శుక్రవారం, అక్టోబర్ 23, 2015

మానాన్నగారి కోపంలో అర్ధంఉంది



      మొన్న సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మానాన్నగారు కోపంతో ఊగిపోతున్నారు. కొంచెంచల్లబడ్డాక విషయమేంటని ఆరాతీస్తే మా అన్నయ్యకొడుకు ఆరేళ్ళవాడు, పక్కవీధిలోఉండేస్కూలులో ఒకటవ తరగతి చదువుతున్నాడు. ఇవాళ స్కూలుకి వెళ్ళనప్పుడు, చెప్పిన పాఠంఎదో సరిగ్గా చదవలేదని వాళ్ళ టీచర్ కొట్టారుట, చెయ్య కొంచెం కందింది.అసలే వాడు ఇంటికిపెద్ద మనవడు, తెల్లగా ముద్దుగా ఉంటాడు. వాడి చెయ్యి అలా ఎర్రగా కందిపోయి చూసేసరికిఈయన తాత హృదయం గిలగిలా కొట్టేసుకుని రంకెలు వేస్తున్నారు.

       మానాన్నగారిని అలా ఆ స్థితిలో చూసేసరికి నాకు నవ్వువచ్చింది.  ఒకసారి ఇలాగేచిన్నప్పుడు నేను ఒకసారి హోంవర్క్ సరిగ్గా చెయ్యలేదని మా టీచర్ నాకు బడిత పూజచేశారు. అప్పుడు నాకు కూడా ఇలాగే నడ్డిమీద ఎర్రగా కందిపోయింది. సాయంత్రం ఇంటికివచ్చాక నాన్న నడ్డిమీద దెబ్బలు చూసి ఏంజరిగిందని ఆరాతీసి ఇప్పటిలాగే కోపంతో ఊగిపోయారు. కానీ టీచరుగారి మీదకాదు ,నామీద-   'హోంవర్క్ ఎందుకుచెయ్యలేదంటూ...!!!'. పనిలోపనిగా నాకు ఆయన కూడా రెండు వడ్డించారు, ఆల్రడీస్కూలులో దెబ్బలు తిన్నానని జాలి కూడా లేకుండా. అదేవిషయం ఆయనకు గుర్తుచేస్తూఇప్పుడు వీడు కూడా పాఠం సరిగ్గా చదవలేదనేకదా కొట్టారు, మరి వీడినెందుకువెనకేసుకొస్తున్నావు అన్నాను నవ్వుతూ.

        "నోరుముయ్యవోయ్,.. అసలు నామనవడిని కొట్టే హక్కు వీళ్ళకెక్కడిది???, వాడు సరిగ్గాచదవకపోతే నాతో చెప్పాలి అంతేగాని కొట్టే అధికారం వీళ్ళకెవరు ఇచ్చారు. నాకు గానీతిక్కరేగిందంటే వీళ్ళందరిమీద పోలీసుకేసు పెట్టించి లోపల తోయిస్తాను.....!!!" ... ఆవేశంతోఆయన స్వరం గతి తప్పింది.

      ఇంతచిన్న విషయానికి ఆయన అంత కోపం తెచ్చుకోవడమెందుకో నాకు అర్ధం కాలేదు.నాపదవతరగతి పూర్తయ్యేవరకూ మా స్కూలు టీచర్ల చేతిలో నేను ఎన్నోసార్లు దెబ్బలుతిన్నాను. ఇంట్లో ఆవిషయం తెలిస్తే వీళ్ళుకూడా రెండు తగిలించేవారు తప్ప టీచర్లను ఎమీఅనేవారుకాదు. ఇప్పుడు కూడా ఎప్పుడైన ఊరు వెళ్ళినప్పుడు మాటీచర్లను కలిస్తే "అప్పుడుమీరు నాలుగు తగిలించైనా దారిలో పెట్టారు కనుక జాగర్తగా చదువుకుని ఈరోజు  జీవితంలోనిలదొక్కుకున్నాడు" అంటూ ఎంతో మర్యాదగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి ఇలామనవడిని కొట్టేసరికి ఇంత ఆవేశపడిపోవడం నాకు ఆశ్చర్యం వేసింది.

      "అసలు కంటే వడ్డీ ముద్దు కదా నాన్న.. అందుకేనా ఇంత కోపం" అన్నాను నేను ఆయననుఉడికిస్తూ.
"నోరుముయ్యరా.. టీచర్లయినంత మాత్రన ప్రతీవాళ్ళకీ కొట్టే హక్కు ఉండదు, దానికి వారిప్రవర్తనలో కూడా కొన్ని గుణాలు ఉండాలి. అప్పుడే వాళ్ళకి పిల్లల్ని దండించే అధికారంవస్తుంది. వీళ్ళకి ఆ అర్హత  లేదంతే... " అంటూ తేల్చేశారు.  ఆయనకు ఆ టాపిక్ అంతకుమించి పొడిగించే ఉద్దేశ్యం లేనట్లుంది, లేచి వెళ్ళి గదిలో పడుకున్నారు. నేనుకూడా భోజనం చేసి వెళ్ళి పడుకున్నాను.

      తెల్లవారి శనివారం. నాకు ఆఫీసు శెలవు. నాన్న ఉదయాన్నే లేచి పనులు పూర్తిచేసుకుని గుమ్మం దగ్గర కుర్చీలో కూర్చుని పేపరు చదువుతున్నారు. బుసలు తగ్గాయి గానీ కోపంపూర్తిగా తగ్గినట్లు లేదు. ఎందుకైనా మంచిదని ఆరోజు మావాడిని స్కూలులో దింపడానికి నేనే బయలుదేరాను. అక్కడికి చేరుకునే సరికి ప్రార్ధన జరుగుతోంది, వాచ్-మెన్ మమ్మల్ని గేటుదగ్గరే ఆపేశాడు. నాతోపాటు ఇంకొక అవిడ కూడా పిల్లవాడిని పెట్టుకుని గేటు బయటనిలబడి ఉంది. ప్రార్ధన పూర్తయ్యాక వాచ్-మెన్ నన్నులోపలికి పంపాడు గానీ ఆవిడను ఆపేశాడు. ఫీజు  కట్టని పిల్లల్ని లోపలికి పంపద్దని ప్రిన్సిపాల్ గారి ఆర్డర్ అమ్మా, పంపడంకుదరదు అని తేల్చిచెప్పేశాడు. “ఒక్కనెలేకదయ్యా లేటయ్యింది ప్రతీనెలా టైముకే కట్టేస్తున్నాంకదా, రెండురోజుల్లో కట్టేస్తాం..” అని ఆవిడ బతిమాలుతోంది. వీడు కుదరదని తేల్చేయడంతో ఇంకఏమీ చెయ్యలేక పిల్లవాడిని తీసుకుని అక్కడినుంచీ వెళ్ళిపోయింది. "నేనేం చేసేది సార్!, ఫీజుకట్టని పిల్లల పేర్లు ఇచ్చి, వాళ్ళని ఎవరినీ లోపలికి పంపవద్దని ప్రిన్సిపాల్ మేడం ఆర్డర్!!,చెబితే వీళ్ళకు అర్ధం కావట్లేదు..." అన్నాడు నామొహంలో ఫీలింగ్స్ గమనిస్తున్నవాడిలాగ.
 
         రెండంతస్తుల భవనంలో నడుస్తున్న కార్పోరేట్ స్కూల్ అది. ప్రార్ధనచేసుకునే చిన్నస్థలం తప్ప పెద్దగా ఆడుకునే ఆటస్థలం కూడా లేదు, కానీ లోపలంతా అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగుతో ప్రతీక్లాసు సెంట్రలైజ్డ్ ఏసీతో ఉంటుంది.. చదువుకునే చిన్న పిల్లలకు ఏసీ ఎందుకో నాకుఎప్పుడూ అర్ధంకాదు. ఒక్కసారి పిల్లవాడు క్లాసురూములోకి వేళ్ళాడంటే బయట బాంబులుపడ్డా వినిపించనంతగా తరగతి గదులకు సీలింగ్ చేశారు.

        మేము ఎలిమెంటరీ స్కూలులో ఉన్నప్పుడు మా స్కూలు ప్లే-గ్రౌండులో ఉన్న మామిడిచెట్టుమీద కూర్చుని కోకిల "కూ.." అంటూ కూసేది. అదివిని మేముకూడా ప్రతిగా "కూ..."అంటూ కూసేవాళ్ళం. దాంతో అదికూడా రెచ్చి పోయి కూతలు పెట్టేది. కొంతసేపు ఇలా సాగినతరువాత, అదో, మేమో అలిసిపోయి కూతలు ఆపేసేవాళ్ళం. అది మాకు ఆట.ఎంతోసరదాగా ఉండేది. అల్లరి చేస్తే కొట్టే టీచర్లు మేము ఇలా కూస్తుంటే వాళ్ళుకూడా సరదాగానవ్వుతూ ఎంజాయ్ చేసేవారు.  ఇటువంటి స్కూళ్ళలో చదివే పిల్లలకు  అటువంటి సరదాలు ఊహించుకోవడానికి కూడా అవకాశంలేదేమో అనిపించింది నాకు.

       మా వాడిని క్లాసురూములో దింపడానికి వెళుతూ నిన్నతి సంఘటనగుర్తుకువచ్చి, ఎందుకైన మంచిది ఒకసారి ప్రిన్సిపాల్ గారికి చెబుదామని ఆవిడరూము వైపుకి వెళ్ళాను. ఆవిడకి తెలుగు వచ్చినా ఎందుకో ఇంగ్లిషులోమాట్లాడదానికే ఇష్టపడతారు. ఆవిడ దగ్గరకి వెళ్ళి ఇందీ సంగతి అనిచెప్పాను. ఆవిడ బిక్కు బిక్కు మంటూ నా పక్కన నిల్చున్న మావాడినిచూసి  , "ఏ క్లాసు నువ్వు" అని అడిగింది ఇంగ్లీషులో
వీడు చెప్పాడు.
సంబంధించిన క్లాసు టీచర్ని పిలిపించారు.
ఆవిడ నేను చెప్పినదంతా ఆవిడకి చెప్పి సంజాయిషీ అడిగింది.
టీచరు ఒకసారి మావాడిని ఎగాదిగా చూసి
                                  " నీ పేరు ఎంటి..?? " అని అడిగింది. (ఇంగ్లీషులోనే)
                                  వీడు చెప్పాడు
                                  "ఏ క్లాసు ...???." టీచరు.
                                 "1st  క్లాస్..." మావాడు..
వాళ్ళిద్దరి సంభాషణా చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది.. రోజూ చూసే తనస్టూడెంటునే గుర్తుపట్టలేని స్థితిలో ఉందా ఆవిడ, నిజం గానే గుర్తుపట్టలేదాలేదా అలా అడగడం కూడా ఒక ఫ్యాషనా ???? నాకు అర్ధం కాలేదు.

"ఓకే…!!!! గాట్ ఇట్... నిన్న మీవాడు చెప్పిన పాఠం సరిగ్గా చదవలేదండీ,అందుకే కొట్టాల్సి వచ్చింది..."  ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లు మొహం పెట్టిచెప్పిందావిడ. ఆవిడ నాతో తెలుగులోనే మాట్లాదిందిగానీ, యాస కొంచెం ఇంగ్లీషులో ఉంది. దానినే కొందరు తెంగ్లీష్ అంటారని నా ఫ్రెండు ఒకతను చెప్పాడు.

      "అయినా సరే మీరు స్టూడెంటుని ఇంత గట్టిగా కొట్టకూడదండి. డోంట్ రిపీట్ఇట్..." అన్నారు ప్రిన్సిపాల్ ఆవిడని మందలిస్తున్నట్లు, నన్ను సంతృప్తిపరుస్తున్నట్లు ఏకకాలంలో.
     
      ఆ టీచరు సరే నన్నట్లు తల ఊపింది.  “మీకు ఇప్పుడు సంతోషమేనా..!!!” అన్నట్లు చూసింది ప్రిన్సిపాల్ నావైపు.

      ఆ సంజాయిషీ నన్ను సంతృప్తి పరచలేకపోయినా అంతకుమించి ఆవిషయాన్ని సాగదియ్యడం నాకు ఇష్టంలేక ఆవిడ దగ్గర శెలవుతీసుకుని బయటకు వచ్చేశాను.

బయటకు వచ్చి షూ లేసు కట్టుకుంటున్న నాకు, నేను వెళ్ళిపోయాననుకునిలోపలినుంచి టీచరు,ప్రిన్సిపాల్ ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలువినిపించాయి (ఈసారి స్వచ్చమైన తెలుగులో మాట్లాడుకుంటున్నారు,తెంగ్లిష్ యాస కూడా నాకు వినిపించలేదు.).

    "అయినా తక్కువకి వస్తున్నారు కదా అని డిగ్రీ కూడా పాసవ్వని నీలాంటివాళ్ళని తెచ్చి నెట్టిన పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. వాడు ఊరుకున్నాడుకనుక సరిపోయింది. కాదని కేసు పెడితే స్కూలు పరిస్థితి ఏమిటి...??,నీవల్ల మాకు కొన్ని లక్షలు నష్టం వచ్చేది,  కేసు పెట్టకపోయినావచ్చేసంవత్సరం పిల్లవాడిని వేరే స్కూలుకి మారిస్తే నీవల్ల స్కూలుకి 50వేలకు పైగా నష్టం వస్తుంది. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నేను నిన్నుఉద్యోగంలోంచి తీసేస్తాను... అర్ధం అయ్యిందా????!!!!"

"సారీ మేడం ఇంక్కెప్పుడూ రిపీట్ చెయ్యను..." కొంచెం ఏడుపు కలగలిసినస్వరంతో అంటోంది టీచర్.
వాళ్ళ సంభాషన వింటుంటే నాకు నవ్వు వచ్చింది. బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసి ఇంటికిబయలు దేరాను. వాళ్ళమాటలే నాకు చెవుల్లో తిరుగుతున్నాయి. వీళ్ళ ఆలోచనలు ఎంతసేపూ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి తప్ప వీళ్ళ గురు శిష్యుల అనుబంధంలో జీవం లేదు. ప్రతివిద్యార్ధినుంచీ కుదిరినంత డబ్బు ఎలా లాగచ్చా..!! అన్నట్లు ఉంటుంది వీళ్ళ ప్రవర్తన.  ఇప్పుడుఅర్ధం అయ్యింది నిన్న రాత్రి మానాన్న "వీళ్ళకు కొట్టే అధికారం లేదు" అని ఎందుకుఅన్నారో. విద్యార్ధిని ప్రేమించలేని గురువుకి దండించే అధికారం ఉండదు.

        మా టీచర్లు మమ్మల్ని ఎంతకొట్టినా అందులో అందులో ప్రేమ ఉండేది. మేము పాఠాలు నేర్చుకోవాలన్న ఆరాటం ఉండేది. రెండురోజులు మేము స్కూలుకి రాకపోతే మూడవరోజుమాఇంటికి వచ్చో, లేక ఎవరినైనా ఇంటికి పంపో విషయం కనుక్కునేడంత అభిమానం వారిమనసుల్లో ఉండేది.  పుస్తకాలు కొనుక్కోగలిగిన స్తోమతలేని పిల్లలకు, టీచర్లే పాత విద్యార్ధుల నుంచీ పుస్తకాలు సేకరించి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏస్కూలుని తీసుకున్నా, టెక్ట్సు పుస్తకాలుకూడా ఏ అన్నయ్యవో అక్కవో ఉపయోగించకూడదు. ప్రతి విద్యార్ధి విధిగా అన్నిపుస్తకాల  కొత్త సెట్లు స్కూలుకి అనుబంధంగా ఉన్న స్టొర్స్ లో కొనుక్కోవాలి.

        ఇంటర్నెట్ అంతగా అభివృద్ధి చెందని మాకు ఏవిషయం తెలుసుకోవాలన్నా అమ్మానాన్నాతరువాత గురువే మార్గం. వీళ్ళకి అలాకాదు, మావాడు ఇంకొంచెం పెద్దయ్యాక, గూగుల్ఉపయోగించి విషయాలు తెలుసుకోగలడు. అప్పుడు టీచర్ వీళ్ళకి జీతం కోసం పాఠాలు చెప్పేఒక వ్యక్తి మాత్రమే, అంతకు మించి అనుబంధం వారి రిలేషన్లో ఉండదు. ఎందుకంటే దానికి తగినపునాది ఇప్పుడు వీళ్ళమధ్య ఏర్పడట్లేదు. నెలనెలా ఫీజు,సంవత్సరానికి 50 వేలు డొనేషను కడుతున్నారు కనుక వాళ్ళు యాంత్రికంగా పాఠాలు చెప్పు కుంటూ వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్వీళ్ళకి ఒక ఆదాయ వనరు మాత్రమే.

"మానాన్న సంవత్సరానికి 50వేలు డొనేషను , నెలనెలా ఫీజు  కడుతున్నాడు కనుక ,వీళ్ళు పాఠాలు చెబుతున్నారు. వీళ్ళకి నన్ను కొట్టేఅధికారం లేదు….." అని రేపు మావాడు అనుకుంటే అది వాడి తప్పు కాకపోవచ్చు.

      అలాఅని అన్ని స్కూళ్ళూ ఇలాగే ఉన్నాయని కాదు. అద్భుతమైన సహనంతో, ఎంతో ఓర్పుగా  పిల్లలమనసుకు హత్తుకునేలాగా పాఠం చెబుతూ, వారికి చదువుపై ఇష్టం కలుగజేసేఉపాధ్యాయులున్న స్కూళ్ళు కూడా ఎన్నోఉన్నాయి. కానీ వాటి శాతం చాలా తక్కువ. వాటిల్లోచదువుకునే అవకాశం అందరికీ లభించకపోవచ్చు. అందుకనే ఇటువంటి స్కూళ్ళని ఆశ్రయిస్తూఉంటాం. మన అవసరం ఎదుటివాడికి వ్యాపారం అంతే.


శనివారం, జులై 11, 2015

మా నరసాపురం ఇంత బాగుంటుందా....!!!!



నరసాపురం మాఊరు. నాకు నచ్చిన ఊరు. నేను పెరిగిన ఊరు. చిన్నప్పటినుంచీ తిరిగిన వీధులే, చదివిన కాలేజీనే, కానీ కెమేరా కంటితో చూస్తుంటే ఎంత అందంగా ఉంది. అందంగా ఒంపు తిరిగిన గోదావరి, రమ్మంటూ స్వాగతం పలుకుతున్న మాకాలేజీ, ఎంబరుమన్నార్ స్వామికోవెల ... అబ్బా ఎంత అందంగా ఉన్నాయి.
కింద లింకుని నొక్కండి,మాఊరి అందాలు మీకు కూడా కనిపిస్తాయి.




ఈ వీడియో తీసిన ఉమా స్టూడియో అండ్ వీడియో వారికి నా కృతజ్ఞతలతో కూడిన అభినందనలు.



మంగళవారం, జూన్ 09, 2015

శ్రద్ధాంజలి : దాశరధి రంగాచార్య







       "అపౌరుషేయాలకి అక్షర రూపమా..!?" అంటూ చాలామంది ఆశ్చర్య పడిపోయారుట  , దాశరధి వేదాలను తెలుగులోనికి అనువదించడానికి పూనుకున్నప్పుడు.  కొందరు ఛాందసులు రుసరుసలాడిపోతే, చాలామంది సంస్కరణభిలాషులు వెన్నుతట్టి ముందుకు నడిపించి ప్రోత్సహించారుట. ఆ విధంగా ఇరవయ్యో శతాబ్దం  ప్రారంభానికి కొంచెం ముందు వేదామృతం తెలుగులోనికి అనువదించబడి సామాన్యులకి అందుబాటులోనికి వచ్చింది.  క్లిష్టమైన సంసృతంలోనుంచి సామాన్యతెలుగు భాషలోనికి వేదాలను అనువదించడం ద్వారా దాశరధి “అభినవ వ్యాసుని”గా కీర్తి గడించారు. 

       “నా తెలంగాణా కోటిరతనాల వీణ” అంటూ నినదించిన ప్రఖ్యాత సాహితీవేత్త దాశరధి కృష్ణమాచార్య తమ్ముడు ఈ రంగాచార్య. చెరగని చిరునవ్వుతో అతిసామాన్యంగా కనిపించే ప్రసన్న వదనం దాశరధిది. సాత్వికంగా మాట్లాడుతూనే అవసరం వచ్చినప్పుడు కుండబద్దలుకొట్టినట్లు తన అభిప్రాయలను వెల్లడించడం దాశరధికే చెల్లింది. సాంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలోపుట్టి ఒక చేత్తో రామాయణాన్నీ మరొకచేత్తో కారల్ మార్క్సుని పట్టుకుని తిరిగారు.   వేదాలను తెనుగించిన ఆచేతితోనే నిజాంకాలంలో రజాకార్లుగా పేరుగాంచి ప్రజలను హింసించిన ముష్కరుల అకృత్యాలను "చిల్లర దేవుళ్ళు","మోదుగపూలు" నవలలలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. తెలుగులో ఎంత సాధికారికంగా మాట్లాడగలరో అంతే సాధికారికంగా ఉర్దూలోకూడా ప్రసంగించగలరు దాశరధి . “మా నిజాం రాజు, తరతరాల బూజు” అంటూ ఆగ్రహించారు. సూటిగా నిక్కచ్చిగా ఉండే భావాలతో మాట్లాడే రంగాచార్య ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటూనే అది నాయకులకి కాక ప్రజలకి ఉపయోగపడే తెలంగాణా కావాలని అభిలషించారు. "జీవనయానం" పేరిట తనజీవిత చరిత్రను అక్షరబద్ధం చేసిన దాశరధి స్వర్గస్థులు కావడంతో తెలుగు సాహితీ లోకంలో ఒక అధ్యాయానికి తెరపడింది.

శనివారం, జనవరి 24, 2015

ఆ విధంగా చిన్నప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి



    సీతాకోకచిలుకలు కూడా కీటకాలే..నేను అయిదవ తరగతి లో ఉన్నప్పుడు మా మాష్టారు చెప్పిన పాఠం నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది..అప్పటి వరకూ నా దృష్టిలో  కీటకాలు అంటే గొంగళీ పురుగులు, ఈగలు, దోమలు మాత్రమే. మాపెరట్లో ఉన్న పూలమొక్కలమీద వాలుతూ రంగురంగుల్లో మెరిసిపోతూ ఉండే సీతాకోకచిలుకలంటే నాకు ఒకవిధమైన ఆరాధనాభావం. ఆకుల రంగులలో కలిసిపోతూ బుజ్జి బుజ్జి ఆకుపచ్చ సీతాకోకచిలుకలూ, నీలం,పసుపు మిశ్రమంతో అమ్మ అరచేయి వెడల్పున ఉండే పెద్దపెద్ద  సీతాకోకచిలుకలూ మా పెరట్లో పూలమీద తేనే తాగడానికి వస్తుండేవి. అవి ఆదమరిచి తేనె తాగుతున్నప్పుడు, ఒడుపుగా దాని రెండు రెక్కలూ పట్టుకుని వాటితో ఆడుకోవడం నాకు అప్పట్లో చాలా ఇష్టమైన ఆట. అటువంటి సీతాకోకచిలుకల్ని పట్టుకుని ఆయన ఇలా కీటకాల జాబితాలో కలిపి చెప్పడం, దానికి సాక్ష్యంగా  మా సైన్స్ పుస్తకంలో ఉన్న కీటకాల బొమ్మల చార్టులో నేను నమ్మే ఇతర కీటకాల బొమ్మలతో పాటుగా సీతాకోకచిలుకని కలిపి చూపించడం అప్పట్లో నా మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. మామాష్టారు ఇన్ని సాక్ష్యాలు చూపించినా, నాకు నమ్మ బుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మని అడిగాను.అమ్మకూడా నాకు అదేచెప్పింది, సీతాకోకచిలుకలకి ముందురూపం గొంగళీ పురుగులేననీ ఇందాకా మాష్టారు చెప్పిన పాఠం నిజమేననీ అమ్మ చెప్పడంతో, బాధగానైనా వాళ్ళు చెప్పింది నమ్మక తప్పలేదు.



    చిన్నప్పుడు నేను కొన్ని విషయాల్ని బలంగా నమ్మేవాణ్ణి. భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతే భూలోకం వస్తుందని, అక్కడ భూమాత ఉంటుందని నేనూ నా ఫ్రెండ్సు కూడా నమ్మేవాళ్ళం. బాగా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఆకాశం తగిలి కిందపడిపోతామని కూడా అనుకునేవాళ్ళం. :) ఆ నమ్మకాల చుట్టూ అందమైన ఊహలు అల్లుకుని బోల్డు ఆటలు ఆడుకునే వాళ్ళం. నేను కొబ్బరి మట్టమీద కూర్చుని రెక్కలున్న పంచకళ్యాణి గుర్రం మీద గాలిలో ఎగురుతూ రాక్షసుడిని చంపేసినట్లు ఊహించుకుంటూ, కొబ్బరి డొలకలతో కత్తుల కాతారావులాగ కత్తి యుద్దాలు చేసేవాడిని. ఒకసారి మళ్ళి ఆ సైన్సు మాష్టారే పాఠం చెబుతూ, కిందకి తవ్వుకుంటూ వెళ్తే నీళ్ళు పడతాయి తప్ప వేరే భూలోకం అంటూ ఎమీ ఉండదనీ, ఎంతపైకి ఎగిరినా వెళ్తూనే ఉంటాం తప్ప ఆకాశం తగిలి కింద పడిపోవడం అంటూ ఎమీ ఉండదనీ చెప్పి మళ్ళీ మా మనోభావాల్నీ ,నమ్మకాల్నీ గాయపరిచారు.

   ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మా దృష్టిలో మా లెక్కల మాస్టారు ఒక హీరో. మిగిలిన టీచర్లు అందరూ కూడా ఆయనంటే ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. మేము ఆయనకు తెలియని విషయంలేదు అని నమ్మేవాళ్ళం. కొన్ని నమ్మకాలకి ఆధారాలు అవసరంలేదు కదా. కానీ అయన ఒకసారి పాఠం చెబుతున్నఫ్ఫుడు ఒక లెక్క చెప్పడం ఆయనవల్ల కాలేదు. ఆయన ఆ విషయాన్ని నిజాయితీగా ఒప్పుకుంటూ ఎవరైనా పెద్దవాళ్లని ఆడుగుదాం అన్నారు. మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయనకు అన్నీ తెలుసునన్న మానమ్మకం దెబ్బతిన్నందుకు.

ఆదివారం, జనవరి 18, 2015

మాఊరిలో మైకాసురుడు. ...



       మాఊరిలో మైకా గనులు లాంటివి ఎమీలేవు. కనీసం బొగ్గుగనులు కూడాలేవు. ఉన్నదల్లా ప్రశాంతంగా ప్రవహించే గోదావరి మాత్రమే. కానీ మాఊరికొక అసురుడున్నాడు. మామూలు అసురుడు కాదు, మైకాసురుడు. అసురుడు అంటున్నాం కదాఅని ఆయనేమీ దుర్మార్గుడో,దుష్టుడో కాదు, ఉన్నత విద్యావంతుడు, బహు పెద్దమనిషి. ఆయన అసలుపేరు వేరే ఉంది. దానికంటే కూడా ఆయనను మైకాసురుడు అని పిలుచుకోవడానికే ఊరిలో అందరూ ఇష్టపడతారు.. ఆయని ఈ పేరు రావడానికి వెనుక చిన్న తమాషా రీజను ఉంది. ఇప్పటికి ఒక తరం క్రితం మాఊరిలో ఏకార్యక్రమం జరిగినా, ఆయన హాజరు, హాజరుతో పాటు ఆయన స్పీచ్ తప్పకుండా ఉండేవిట. ఒకసారి మైకు అందుకున్నాడంటే గడియారం ముల్లుతో పోటీపడుతూ గంటలు గంటలు సునాయాసంగా, అనర్గళంగా మాట్లాడేసేవారుట. అలాఅని అవేమీ ఊకదంపుడు కబుర్లుకావు, కార్యక్రమం దేనికిసంబంధించినది అయితే ఆవిషయాన్ని గురించి ఒక వికీపీడియాలాగా, ఎన్-సైక్లోపీడియాలాగా సవివరంగా, విశ్లేషాత్మకంగా మాట్లాడేసేవారుట. కంప్యూటర్లు,ఇంటర్నెట్లు లేని ఆకాలంలో, ఏవిషయాన్ని గురించయినా అంత అనర్గళంగా, ఆశువుగా మాట్లాడగలిగే ఆయన్ను చూసి అప్పటి యూత్ అంతా  ఇన్-స్పైర్ అయిపోయి, బోల్డంత సంతోషపడిపోయి, (అనధికారికంగా) ఆయనకు "మైకాసురుడు" అనే బిరుదు ఇచ్చి సంతోషపడిపోయారు.  అప్పటినుంచీ ఆయన విశాఖపట్నానికి వైజాగ్ లాగా,అసలుపేరుకంటే మైకాసురుడు పేరుతో ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయారు.

       అప్పుడే పాదునుంచీ తెంపిన పులుసు గుమ్మడికాయలాగా బంగారు రంగులోఉండి, ఆరడుగుల ఎత్తు, ఆఎత్తుకు తగిన లావుతో వెలిగిపోతూ ఉండే అయ్యన్ను చూస్తే ఎవరికైనా గౌరవభావమే కలిగేది.  బాగా చిన్నప్పుడు ఆగస్టు పదిహేను కార్యక్రమాలకి మా స్కూలు వాళ్ళు ఆయన్ని పిలిచినప్పుడు , ఆయన అలా అలా గంటలు గంటలు మాట్లాడేస్తూ మాకు స్వీట్లు పంచే కార్యక్రమాన్ని లేటు చేస్తుంటే ఆయనంటే తెగ కోపం వచ్చేసేది. ఆయనచెప్పేది అర్ధంచేసుకోగలిగిన వయసు వచ్చాక, ఆయన మాటలు వింటూ ఉంటే ఆ ధారణ శక్తికి ఆశ్చర్యం కలిగేది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు దూరదర్శన్ లో ఆయన వ్యాఖ్యానం తప్పనిసరి.

    నేను ఆరవతరగతి చదువుతున్నప్పడు ఒకసారి మా ఊరిలో సమాఖ్య కార్యక్రమాలు జరిగాయి. నేను మా నాన్నగారు కలిసి వెళ్ళాము. మైకాసురుడుగారు ముఖ్య అతిధి. వక్తృత్వ పోటీలు,వ్యాసరచనపోటీలు జరిగాయి. నేను కూడా వక్తృత్వ పోటీలో పాల్గొని మాట్లాడాను. కార్యక్రమాలు భోజనాలు  అయి నతరువాత, మానాన్నగారు ఖాళీగా ఉన్న మైకాసురుడు గారి దగ్గరకు వెళ్ళి, పరిచయం చేసుకుని,ఎవో కబుర్లు చెప్తున్నారు.  ఇంతలో నేను ఆడుకుంటూ అటువైపుగా వెళ్ళాను.మానాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి,ఆయనకు నమస్కారం పెట్టించి, వీడు మాఅబ్బాయండీ అని పరిచయం చేసారు.ఆయన నావైపు చూసి చిరునవ్వునవ్వి, "ఆ చూశానండి ఇందాకా వక్తృత్వ పోటీలో మాట్లాడాడు కదా..." అని నా వైపు తిరిగి "బాగా మాట్లాడావోయ్ కీప్-ఇట్ అప్..." అన్నారు అభినందనపూర్వకంగా. ఆయనకి థాంక్స్ చెప్పి, పనిలోపనిగా, "మీరుకూడా బాగా మాట్లాడారండీ కీప్-ఇట్ అప్.." అని అభినందించిపారేశాను నేను కూడా...



మానాన్నగారు అదిరిపడి చూశారు. వెంటనే తేరుకుని డిప్పమీద ఒకటి ఇచ్చారు. మైకాసురుడుగారు కూడా ముందు షాకయిపోయినా, తర్వత తేరుకుని పోనీలెండీ చిన్న పిల్లాడు అంటూ హాయిగా నవ్వేశారు.   ఇంటికి వచ్చాక మానాన్న బడితపూజ చేశారు , చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడతావా అంటూ... :):).