ఆదివారం, జూన్ 29, 2014

మొన్న రైలులో నరసాపురం వెళ్ళివచ్చా గెట్-టు-గెదర్ కి.......

      జేబులో ఉన్న మొబైల్ బయటకితీసి టైం చూసుకున్నాను తొమ్మిదిన్నరకావస్తోంది. మాఊరువెళ్ళవలసిన రైలురావడానికి  ఇంకా అరగంటకిపైగా సమయం ఉంది. దానికంటే ముందువెళ్ళవలసిన  గౌతమి ఎక్స్-ప్రెస్ ఇంకా ప్లాట్-ఫారం మీదనే ఉంది.ఇంకా చాలా సమయం ఉండడంతో క్యాంటీనులోకి నడిచాను, వేడివేడిగా ఒక టీతాగి అరగంట తరువాత మళ్ళీ స్టేషనులోకి వచ్చాను, అప్పటికి గౌతమీ పెద్దకూతతో కిక్కిరిసిన ప్రయాణికులతో భారంగా స్టేషనునుంచి బయలుదేరింది. సెకెండుక్లాసు,ఏసీ కోచ్ లలో అయితే ఫరవాలేదుగానీ, జనరల్ పాసింజర్స్ ని చూస్తుంటేమాత్రం నిజంగానే భయంవేసింది. డోర్లదగ్గర,టాయ్-లెట్ల దగ్గర కిక్కిరిసి వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. నాకిలాంటి ఇబ్బంది రాకూడదనే ప్రయాణం కంఫార్మ్ అవ్వగానే ముందుగా ఆన్-లైన్లో టిక్కెట్టు బుక్ చేసేసుకున్నాను. గౌతమీ స్టేషను దాటిన పదిహేను నిముషాల తరువాత  మాఊరు వెళ్ళే రైలు అదేప్లాట్ ఫారమ్మీదకి నెమ్మదిగా వచ్చి ఆగింది. నేనెక్కవలసిన కోచ్ దగ్గర అంటించిన లిస్టులో నాపేరు ఒకసారి కంఫార్మ్ చేసుకుని లోపలికివెళ్ళి నాబెర్తుమీద బ్యాగు పడేసి కిటికీని ఆనుకుని కూర్చున్నాను. ఒక పదినిముషాల తర్వాత పెద్దకూతతో రైలు తీరిగ్గా స్టేషను నుంచి బయలుదేరింది. నేను నాబ్యాగులోంచి ఎదో పుస్తకం తీసుకుని చదువుకుంటూకూర్చున్నాను. ఒక పదినిముషాల తరువాత ఎదోస్టేషనులో ఆగింది. అక్కడ చాలామంది మాకంపార్టుమెంటులోకి ఎక్కారు. నేనదేమీ పట్టించుకోకుండా పుస్తకం చదువుకుంటున్నాను. ఇంతలో ఎవరో పెద్దావిడ వచ్చి నాపక్కన నిలబడింది. నేను తల ఎత్తి ఎమిటన్నట్లు చూసాను. నాది ఈ పైబెర్తేబాబు కానీ కాళ్ళునొప్పులు అంతపైకి ఎక్కలేను నువ్వు ఎమీఅనుకోనంటే అంటూ .. అర్ధోక్తిగా ఆగింది.అందులో అనుకోవడానికి ఎమీలేదు, ఆచీకటి సమయంలో లోయర్ బెర్తులో కూర్చుని కూడా చేసేదేమీ ఉండదు. అందులోనూ అంత పెద్దావిడ అడుగుతుంటే కాదనడం బాగోదు కనుక సరేనని పైకి ఎక్కి పడుకున్నాను.


           నరసాపురం మాఊరు. ఈప్రపంచంలో నాకు బాగానచ్చే ప్రదేశాలలో మాఊరుఒకటి. ఊరికి దూరంగా కొండ, ప్రతిరోజూ ఉదయాన్నే కొండచాటునుంచీ ఉదయించే ఎర్రని సూర్యబింబం, కొండమీదగుడి, గుడిముందు కోనేరు, అందులో కలువపూలు, లాంటి హంగులేమీ లేకపోయినా ఊరు ఎంతో అందంగాఉంటుంది. ఇప్పుడు నేనుంటున్న హైదరాబాదుకి అయిదువందల కిలోమీటర్లదూరంలో ఒకమూలగా బంగళాఖాతాన్ని ఆనుకుని ఉంటుంది. నేను ఇప్పుడు  ఇక్కడ రైలు ఎక్కితే తరువాతిరోజు ఉదయం తొమ్మిదింటికి అక్కడికి చేరుకుంటుంది. అసలు మాఊరు వెళ్ళడనికి ఈ రైలు ఒక్కటే కాదు, ఎన్నో ఆర్టీసీ,ప్రైవేటు బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. సాయంత్రం ఆరింటికి బస్సుఎక్కితే తర్వాతరోజు ఉదయాన్నే సూర్యోదయం కాకుండానే అక్కడదింపేస్తాయి. కానీ నాకు ఈ రాత్రి పదిగంటల రైలులో ప్రయాణమంటేనే ఇష్టం. ఇప్పుడు ఎక్కితే తరువాతిరోజు తెలవారకుండానే విజయవాడ వంతెనమీదకి వచ్చేసరికి ఆటోమేటిగ్గా మెలుకువ వచ్చేస్తుంది. అప్పుడు లేచి మొహం కడుక్కుని దూరంగా కొండమీద కనిపించే అమ్మవారికి రైలులోంచే దండం పెట్టేసుకుని, విజయవాడ స్టేషనులో ఆగినతరువాత దిగి వేడివేడి టీ తాగి పేపరుకొనుక్కుని మళ్ళీ తిరిగి రైలెక్కేసి కిటికీ పక్కన కూర్చుని చదవడం మొదలుపెడితే గుడివాడ చేరుకునే సమయానికి చదవడం అయిపోతుంది. అప్పటికి పూర్తిగా తెల్లవారిపోతుంది. రైలుకూడా అప్పటికి మూడొంతులుఖాళీ అయిపోతుంది. ఇంక అక్కడనుంచీ మనదే రాజ్యం. చిన్నచిన్న స్టేషనులలో అమ్మవచ్చే చిట్టి చిట్టిసమోసాలు కొనుక్కుతింటూ, మొబైల్ లో మెలోడీసాంగ్స్ వింటూ పచ్చని పొలాలు మధ్యలోంచీ, పంటకాలువలమీద కట్టిన చిన్నచిన్న వంతెనలమీదనుంచీ సాగిపోయే రిమైనింగ్ జర్నీ ఎంజాయ్ చెయ్యడమంటే నాకు చాలా ఇష్టం. అప్పటివరకూ ఎక్స్-ప్రెస్ లాగా దూసుకొచ్చిన రైలుకూడా అక్కడనుంచీ గుల్లనేల కావడంతో పాసింజరులాగా మారిపోయి కృష్ణా,గోదావరి జిల్లాల అందాలని మనకి చూపిస్తూ నెమ్మదిగా నరసాపురం చేరుకుంటుంది. ఒక పదినిముషాలు అటూ-ఇటూలో ఈసారికూడా అలాగే చేరుకుంది.


   ఉద్యోగంపేరుతో ఊరువిడిచి ఇప్పటికి ఆరు సంవత్సరాల పైనే అయ్యింది. అయినా సంవత్సరానికి ఒకసారో కుదిరితే రెండుసార్లో ఎదోఒక వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను.అసలు నరసాపురం వెళ్తున్నామన్న  ఊహే ఎంతో అపురూపంగా అనిపిస్తుంది నాకు. పోయిన నెలలో నా చిన్ననాటి ఫణి ఒకసారి నాకు ఫోనుచేసి మన టెంత్-క్లాసు స్నేహితులంతా కలిసి గెట్-టు-గెదర్ పెట్టుకుంటే ఎలాఉంటుంది??,  అని అని అడిగాడు. నేనిక్కడ హైదరాబాదులో కూర్చుని "చాలబాగుంటుంది కానివ్వండి" అని చెప్పడం చాలా సుళువే, కాని అక్కడ ఊరిలో బాధ్యత తీసుకుని అన్నీ సక్రమంగా జరిగేలా చూడడమే చాలా కష్టం.  ఆమాటే నేను వాడితో అన్నాను. అవన్నీ మాకు వదిలైరా మనవాళ్ళంతా ఇక్కడేఉన్నారు కదా. మేము చూసుకుంటాము, నువ్వుమాత్రం ఒకరెండురోజులు ఉండేలాగా శెలవు పెట్టుకునిరా అన్నాడు. ఇదిగో దానికోసమే ఇప్పుడు ఇలా బయలుదేరివచ్చాను. వాళ్ళడిగినట్లు రెండురోజులు కుదరలేదుగానీ, ఒకరోజు శెలవు మాత్రం కుదిరింది. ఉదయాన్నేదిగి సాయంత్రం తిరుగుప్రయాణమయ్యేలా రిజర్వేషన్ చేయించుకున్నాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఫణి అప్పటికే అక్కడికి వచ్చేసి ఉన్నాడు. తనతో కలిసి తిన్నగా వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడ పలకరింపులన్నీ పూర్తయిన తరువాత, స్నానం చేసి మరికొందరు స్నేహితులుతో కలిసి మేము చదివిన స్కూలుకి బయలుదేరాను.అక్కడే ఆరోజు జరగబోయే మాప్రోగ్రాం ప్లానుచేశాము.


     "టేలరు ఉన్నతపాఠశాల " అని బోర్డు పెట్టిఉన్న మాస్కూలు బిల్డింగు ఠీవీగా రోడ్డుపక్కకి నిలబడిఉంది. జార్జిటేలరు అనే బ్రిటీషాయన దాన్ని కట్టించాడు. ఆయనపేరుమీదనే అది టేలరు ఉన్నత పాఠశాల అయ్యింది. కానీ ఇదిమేము చదివినప్పటిదికాదు. మా స్కూలు చదువు పూర్తి అయిపోయి మేము కాలేజీకి వచ్చేసిన కొన్ని సంవత్సరాల తరువాత పాత పెంకుటింట్లోఉన్న స్కూలుని కూల్చేసి దాని స్థానంలో ఇప్పుడున్న కొత్త భవనం కట్టించారు. ఇది కూడా బాగానేఉంది, కాని దీనికంటే నాకు ఆ పాత పెంకుటిల్లే చాలా చాలా అందంగా అనిపిస్తుంది . ఒకటి నుంచి పదవతరగతి వరకూ విశాలమైన తరగతిగదులు, ఎలిమెంటరీని, హైస్కూలునీ విడదీస్తూ చిన్న ఆటస్థలం దానిలో గుబురైన మామిడిచెట్టు,ఎర్రటి పూలుండే మోదుగపూల చెట్లతో ఒకవిధమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. మేము ఆ చెట్లకిందే నిలబడి ప్రార్ధన చేసేవాళ్ళం.క్లాసులో ఎవరైనా ఎక్కువగా అల్లరిచేస్తే మాకు విధించే శిక్షకూడా ఆ చెట్టుకింద నిలబడడమే. కానీ అదిచాలా పెద్ద శిక్ష. క్లాసులో ఎంత అల్లరి చేసినా,దానికి ఎంత పెద్ద శిక్ష విధించినా బయట ఎవరికీ తెలియదు కనుక  పెద్ద నష్టం ఉండదు. కానీ చెట్టుకింద నిలబడితే అన్నిక్లాసులవాళ్ళకీ తెలిసిపోతుంది. ముఖ్యంగా హెడ్-మాష్టారు గారికి డైరెక్టుగా కనపడిపోతాం.అందుకనే ఆశిక్ష పడేంతగా కాకుండా కొంచెం తక్కువగా అల్లరిచేసేవాళ్ళం. మాటీచర్లు కూడా సాధారణంగా బెత్తంతో కొట్టడం, బెంచీ ఎక్కించడం లాంటి శిక్షలే వేసేవాళ్ళు.మా ఇల్లుకూడా స్కూలుకి దగ్గరగా ఉండేది, దాంతో మాటీచర్లందరికీ మా ఇంట్లోవాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండేవి, అందువల్ల నేను ఎప్పుడైనా లిమిట్ దాటి  అల్లరిచేస్తే  క్లాసులో దెబ్బలు అన్నయ్యద్వారా ఇంటికిచేరి అక్కడ కంటిన్యూ అయ్యేవి. మాస్కూలులొ అల్లూరి సీతారామరాజు , యెల్లాప్రగడ సుబ్బరావుగారు లాంటివాళ్ళు చదువుకున్నారట. ఆ విషయాలన్నీ మాటీచర్లు మాకు చెప్పి  "అంత గొప్పగొప్పవాళ్ళు చదువుకున్న స్కూలులో చదువుకుంటున్నందుకు గర్వపడి మీరు కూడా బాగచదువుకోవాలి" అని మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు. మాఅన్నయ్య లాంటి వాళ్ళు ఆ మాటలకి ఇన్స్పైరై బాగా చదువుకునేవాళ్లు. నాలాంటివాళ్ళు ఆ విషయాలన్నీ అడిగినవాళ్ళకీ అడగనివాళ్ళకి చెప్పుకుని గర్వపడేవాళ్ళం. మాకుపాఠాలు చెప్పే టీచర్లందికీ మాఫామిలీతో మంచి పరిచయాలు ఉండేవి. ఎప్పుడైనా సమాఖ్య కార్యక్రమాలుజరిగినప్పుడో లేక మరే ఇతరకార్యక్రమాల్లోనో వాళ్ళు మానాన్నగారు కలుసుకోవడం జరిగినప్పుడు ఆటోమేటిగ్గా మాచదువులగురించి ప్రస్తావన వచ్చేది. వాళ్ళందరూ ఎదో లంచాలు తీసుకున్నవాళ్లలాగా నాకంటే మాఅన్నయ్యకి మంచి ఫీడ్-బ్యాక్ ఎక్కువ ఇచ్చేవారు, మాతెలుగు మాష్టారు ఇంకా పిటి మాష్టారు మాత్రం నాకుకూడా మంచి ఫీడ్-బ్యాక్ ఇచ్చేవారు. అందుకే వాళ్ళిద్దరూ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది.  ఇప్పుడు వాళ్ళలో చాలామంది రిటైర్ అయిపోయారు. వాళ్ళందరినీకూడా పిలిచాము. వాళ్ళుకూడా చాలాఆనందంగా వచ్చారు. అనుకున్నప్రకారమే ఉదయాన్నే పదిగంటలకి కార్యక్రమం మొదలయ్యింది. టీచర్లలో చాలామంది సభలో మాట్లాడుతూ కొద్దిగాఉద్వేగానికి లోనయ్యారు.  కార్యక్రమం ముగిసినతరువాత మాస్నేహాలన్నీ ఇలాగే కొనసాగాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయారు. అప్పటికి టైం సాయంత్రం అయిదు కావస్తోంది. మీల్సు ఇంకా మిగిలినపనులూ అన్నీ ముందే కాంట్రాక్టుకి మాట్లాడేసుకోవడంవల్ల మాకు పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. నా రైలుకి ఇంకా గంట టైము ఉండడంవల్ల అందరం కలిసి అలా గోదావరి ఒడ్డుకి వెళ్ళి ఒక అరగంట కూర్చుని అక్కడనుంచి అందరం కలిసి తిన్నగా రైల్వేస్టేషనుకి చేరుకున్నాము.  అప్పటికి రైలు వచ్చేసిఉంది. నేను అందరికీ వీడ్కోలు చెప్పి తిరుగుప్రయాణం అయ్యాను