సోమవారం, జులై 28, 2014

తులసీదళం అనబడే ఒక కాష్మోరా కథ



అనగా అనగా ఒక పాప, పేరు తులసి. ముద్దుగా,బొద్దుగా ఉంటుంది(ట). ఆ పాపకి ఒక అమ్మా,నాన్న. పేరు శ్రీధర్, శారద. వాళ్ళకి బోల్డంత డబ్బు ఉంది. అయితే అదంతా తులసీవాళ్ళ నాన్న సంపాదినంచిదికాదు, కొంచెం ఆయన సంపాదిస్తే మిగిలినది వాళ్ళ కంపేనీ యజమాని(విదేశీయుడు) ముసలితనంతో తనదేశానికి వెళ్ళిపోతూ,వెళ్ళిపోతూ శ్రీధర్ మీద అభిమానంతో తను మనవరాలిలా భావించే తులసి పేరుమీద రాసినది. అయితే రాసేఆయనేదో తిన్నగా రాయచ్చుకదా, అలారాసేస్తే కిక్కేముంటుంది అనుకున్నాడేమో ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. తులసికి పదేళ్ళ వయసు వచ్చాక మాత్రమే ఆ డబ్బుకి తను హక్కుదారు అవుతుంది, ఇంతలోపు జరగరనిది ఎదైనా  తులసికి జరిగితే ఆ డబ్బంతా
ఒక అనాధ శరణాలయానికి చెందుతుంది. ఇదీ ఇక్కడ మెలిక. తులసికి పదేళ్ళు రావడానికి రెండునెలల ముందరవరకూ అంతా బానేఉంటుంది, తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తులసిని అడ్డంతొలగించుకుంటే ఆస్తిమొత్తం కాజెయ్యచ్చు కదా అని అనాధశరణాలయం  వాళ్ళు కుట్ర చేస్తారు.తులసిని కత్తో,తుపాకినో పెట్టి చంపేయ్యచ్చు , కానీ అలాచేస్తే లాజిక్ ప్రకారం మొదట అనుమానం  వచ్చేది అనాధశరణాలయం  వాళ్ళ మీదే కనుక సేఫ్ గేం అడదాం అనుకుంటారు. బాగా అలోచించి,అలోచించీ పాపని క్షుద్రశక్తుల సాయంతో చంపుదాం అని నిర్ణయించుకుని ఒరిస్సా బయలుదేరి వెల్తారు. ఎందుకంటే అక్కడే కిలో బియ్యానికి కూడా మర్డర్లు చేసే మంత్రగాళ్ళు ఉంటారు(ట). అక్కడికి వెళ్ళి కాద్రా అనే మంత్రగాడిని పట్టుకుని వాడిసాయంతో పాపని చంపడానికి ప్రయత్నిస్తారు. తీరా చిన్నపిల్లని చంపడానికి కాద్రా ఒప్పుకోకపోవడంతో నిరాశగా తిరిగివస్తుంటే దారిలో   కాద్రా

శిష్యుడు ఒకడు తగిలి తాను ఆపని చెయ్యడానికి ఒప్పుకుని పాపకి చేతబడి చెయ్యడం మొదలు పెడతాడు. పని మొదలుపెట్టాక తులసికి అనారోగ్యం రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇంక అక్కడినుంచీ కథ రకరకాల మలుపులు తిరుగుతూ అనూహ్యంగా చేతబడి మంత్రాలు రివర్స్ కొట్టి కాద్రా శిష్యుడు  చచ్చిపోవడంతో అవేశంగా కాద్రాయే రంగంలోకి దిగుతాడు. అక్కడినుంచీ కథ ఇంకోమలుపు తిరుగుతుంది. అవేశంతో ఉన్నకాద్రా చిన్నాచితకా శక్తుల్ని కాకుండా మంత్రవిద్యలలో అతిభయంకరమయినది అయిన "కాష్మోరా" అనబడే భయంకరమైన క్షుద్ర శక్తిని పిచుకపై బ్రహ్మాస్త్రం లాగా తులసిమీద ప్రయోగిస్తాడు.  ప్రయోగం మొదలుపెట్టినరోజునుంచీ 21 రోజులపాటు ఆ కాష్మోరా తన టైం-టేబుల్ లో ఉన్న లిస్టు ప్రకారం పాపని రకరకాల రోగాలకి గురిచేస్తూ 21రోజు అర్ధరాత్రి దారుణంగా చంపెయ్యాలి. ఇంక అక్కడనుంచీ ప్రతిరోజూ పాపకి ఎదోఒక రోగమే. పాపావాళ్ళ అమ్మకీ, ఇంకా వాళ్ళింట్లో పనిచేసే ముసలిపనివాడికి ఇదేదో మంత్రగాళ్ళ పని అయిఉండవచ్చి అని అనుమానంవస్తుంది కానీ, పాపావాళ్ల  నాన్నారేమో ఇలాంటివి నమ్మడు. అందుకనీ పాపని హాస్పటళ్ళ చుట్టూ తిప్పుతూ తను ఏడుస్తూ ఇంట్లోవాళ్ళందరినీ ఏడిపిస్తూ చివరిరోజువరకూ గడిపేస్తాడు. ఇంకమరికొద్ది గంటలలో పాప చచ్చిపోతుందనగా రియలైజ్ అయ్యి ఒక ఫకీర్ ఇచ్చిన మంత్రదండం పట్టుకుని మనల్నందరినీ టెన్షన్ పెడుతూ కారులో ఒరిస్సావెళ్ళి కాద్రాని చంపేసి కూతుర్ని రక్షించుకుంటాడు. అదీకథ. కథముందుకునడిపే క్రమంలో అసలు క్షుద్రవిద్యలంటే ఏమిటి, చేతబడిలాంటి ప్రయోగాల్ని ఎలాచెయ్యచ్చు అనేవిషయాల్ని మనందరికీ చాలాసుళువుగా అర్ధమాయ్యేలాగ వివరిస్తాడు రచయిత.

         మొత్తం పుస్తకం చదవడం పూర్తయిన తరువాత నాకు అనిపించిందేమిటంటే "అసలు ఆ అమెరికావాడికి బుద్ధిలేదు....", అవును నిజంగానే లేదు. లేకపోతే చంపడానికి ఇంత ఈజీ పద్దతులుండగా ఆ లాడెన్ గాడిని చంపడానికి అన్ని బిలియన్లు ఖర్చు పెట్టాలా , చక్కగా మనదేశం వస్తే రాచమర్యాదలతో ఒరిస్సా తీసుకుని వెళ్ళి  ఇంకో కాద్రానో ,లేకపోతే బాద్రానో పరిచయంచేసేవాళ్ళంకదా. అప్పుడు పదోపాతికోఖర్చుపెడితే సరిపోయేది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఒకసారి కాష్మోరాని ప్రయోగించిన తరువాత,ఎవరిమీదయితే  ప్రయోగించారో వాళ్ళనోటిలో ప్రతిరోజూ అర్ధరాత్రి 12.00 గంటలకు మూడు రక్తంచుక్కలు వెయ్యాలి,లేకపోతే ప్రయోగం తిరగబడే ప్రమాదం ఉంది. అంటే అమెరికావాడు ఎవరైనా తనమనిషిని లాడెన్ వాళ్ళింట్లో పెట్టుకుని, వాడి నోటిలో సరిగ్గా అర్ధరాత్రి 12.00 గంటలకు మూడు రక్తంచుక్కలు వేయించాలి. ఇప్పుడు అలాంటి మనిషెక్కడ దొరుకుతాడు. ఒకవేళ దొరికినా ఇక్కడా ఇంకో చిక్కు ఉంది. సదరు లాడెన్ అనబడేవాడు సుఖపురుషుడు. అంటే మనవాడికి దాదాపుగా నలుగురైదుగురు భార్యలు ఉన్నారు. ఏరాత్రి ఏభార్యగదిలో ఉంటాడో చెప్పలేం. ఒకరాత్రంతా ఒకభార్య గదిలోనేఉంటాడోలేదోకూడా చెప్పలేం. కనుక ఇలాంటి బాధలన్నీ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకు అనుకున్నాడోఎమో డైరెక్టుగా విమాలేసుకుని యుద్దానికే వెళ్ళాడు. ఇవన్నీ అలోచించిన తరువాత ఎంతైనా అమెరికావాడే నాకంటే తెలివైనవాడు అనిపించింది.

      ఇంక అమెరికావాడి సంగతి పక్కనపెట్టి, నావిషయానికి వస్తే హాయిగా చందమామకథలు, మంచిమంచి ఆటో-బయోగ్రఫీలు చదువుకునే నేను, వాడెవడో సజష్టు చేశాడనిచెప్పి ఈ దెయ్యాల,కాష్మోరాల కథలు చదివి, ఆ హేంగోవరుతో రాత్రుళ్ళు నిద్రపట్టక నన్ను ఆ బుక్కు చదవమని చెప్పినవాడిని నోటినిండా తిట్టుకుంటూ రెండురోజులు గడిపి మూడవరోజు రాత్రిపడుకునేడప్పుడు ఆంజనేయస్వామి సింధూరం పేట్టుకుని పడుకోవలసి వచ్చింది. ఇలాంటి పుస్తకాలు మరికొన్ని మార్కెట్లోకి వస్తేచాలు, చిల్లరమంత్రగాళ్ళకి, బాబాలకి బోల్డంతపని, కావలసినంత డబ్బు. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి, పుస్తకం చదువుతున్నంతసేపూ పాపకి ఎమీజరగదని తెలుస్తున్నా, టెన్షన్ తగ్గకుండా ఆసాంతం చదివించడంలో రచయిత వందశాతం విజయం సాధించాడు.


ఆదివారం, మే 11, 2014

పిల్లకాకి కంటే తల్లికాకే ఎప్పటికీ మంచిది



ఒక ఊరిలో ఒక మంచినీటి బావి ఉండేది,ఆ ఊరి మొత్తానికి అది ఒక్కటే మంచినీటి బావి.ఆ ఊరిలో ఉన్న స్త్రీలందరు ఉదయాన్నే ఆ బావి వద్దకి వచ్చి నీళ్ళు పట్టుకుని వెళ్ళేవారు. ఆ ఊరిలొ ఒక కాకి ఉండేది.అది ఉదయాన్నే ఆబావి వద్దకి వెళ్ళి దానిచుట్టూ చక్కర్లుకొట్టి,వీళ్ళునీళ్ళు పట్టుకునే సమయానికి ఆ బావి వరలమీద పడేలాగ రెట్ట వేసేది.నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన స్త్రీలు ఆ కాకిని తిట్టుకుని వరలని శుభ్రపరుచుకుని నీటిని పట్టుకెళ్ళేవారు.కొంతకాలానికి ఆకాకి ముసలితనం వల్ల చనిపోయింది.అక్కడివాళ్ళందరు పీడవిరగడైందని సంతొషించారు. ఆ కాకికి ఒక పిల్ల కాకి కూడా ఉంది. దానికి ఇలా అందరు తన తల్లిని తిట్టడం నచ్చలేదు. ఎమైన చేసి తన తల్లికి మంచి పేరు తిసుకుని రావాలి అనుకుంది,ఈసారి స్త్రీలు నీళ్ళు పట్టుకోవడానికి బావివద్దకి వచ్చినప్పుడు ఆబావి వద్దకి వెళ్ళి దానిచుట్టూ చక్కర్లుకొట్టి, వీళ్ళునీళ్ళు పట్టుకునే సమయానికి ఆ బావిలొ పడేలాగ రెట్ట వేసింది. అప్పుడు ఆ స్త్రీలందరు ఆపిల్లకాకి చేసిన పనికి చిరాకుపడి దీనికంటే ఆ తల్లి కాకే నయం అనుకున్నారు. ఆవిధంగా ఆపిల్లకాకి తల్లికాకికి మంచిపేరు తిసుకుని వచింది.

హైదరాబాదు కొఠిఏరియాలో ఉమెన్స్ కాలెజీ నుంచి కొఠి బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. కొన్నిరోజుల క్రితం అక్కడ ఎడమ చేతి వైపు వెళ్ళేదారిలో దారిపొడవునా ఫుట్-పాత్ ని ఆనుకుని పుస్తకాల షాపులు ఉండేవి. వాళ్ళు ఫుట్-పాత్ ని ఆక్రమించుకునందే కాకుండా,రోడ్డుమీద సగం వరకు వచ్చేస్తూ దారినపొయే వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ట్రాఫిక్ కూడా జాం ఐపోయి చాలా అందరూ చాలా చిరాకుపడేవాళ్ళు. కొన్నాళ్ళు వాళ్ళ టార్చర్ భరించాక కొంతమంది పెద్దవాళ్ళు కలుగజేసుకుని కోర్టులొ కేసులు పెట్టి వాళ్ళని అక్కడనుంచి ఖాళీ చేయించారు. వెంటనే కార్పొరేషన్ వాళ్ళు అక్కడ రోడ్డు బాగుచేయించి పెడిష్ట్రెయిన్ పాత్ కుడా నిర్మించారు.దానిమీద పెద్దపెద్ద కుండిలతో పూలమొక్కలు కూడాపెట్టారు..పోనిలే ఇంక ట్రాఫిక్ జాం కష్టాలుతగ్గుతాయి అనుకున్నాం....:)

                             కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలబడలేదు....:(

ఇలా వాళ్ళు ఫూట్-పాత్ బాగుచేసివెళ్ళారు, మర్నాటికి ఆపాత్ మొత్తం ఒపెన్ ఎయిర్ టాయిలెట్ గా మారిపోయింది.పూలకుండీలు కుడా వదలలేదు కొందరు వీరులు. పుస్తకాలషాపులు ఉన్నప్పుడు కనీసం అటువైపునడవడానికైనా ఉండేది.ఇప్పుడు కనీసం అటువైపు నడవడానికైనా లేకుండాపొయింది. బోనస్ గా భరించలేని దుర్వాసన.దానిగురించి కనీసం పట్టించుకునే వాడు కుడాలేడు. ఇప్పుడనిపిస్తొంది పుస్తకాలషాపులున్నప్పుడే నయం అని...

నీతి : " పిల్లకాకి కంటే తల్లికాకే ఎప్పటికీ మంచిది"

సోమవారం, ఏప్రిల్ 21, 2014

1947 నాటి వ్యాపారప్రకటన



ఇప్పుడు టీవీలలో స్టైలుగా ఉండే యాడ్స్ చూడడం అలవాటైపోయిన మనకి 1947 నాటి యాడ్స్ చూస్తే కొంచెం నవ్వురావచ్చేమో. సరదాగా చదువుతారని కింద ఇస్తున్నాను.

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

లాల్ బహదూర్ శాస్త్రి అస్తమయం



తాష్కెంటు సమావేసమునకు వెళ్ళిన మన ప్రధానపంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అస్తమయం. వివరములకు కింది పేపరు చదవండి.





సోమవారం, ఏప్రిల్ 07, 2014

గోదావరి-గవర్రాజు






గోదావరి- ఎక్కడో మహారాష్ట్రలో గోముఖం నుంచి చిన్నధారగా పుట్టి,మనరాష్ట్రంలోని రాజమండ్రివరకు అఖండగోదావరిగా ఉరుకులు పెట్టుకుంటూ ప్రవహించి,అక్కడినుంచి ఏడుపాయలుగా విడిపోయి ఉభయ గోదావరిజిల్లాలని సస్యశ్యామలం చేస్తూ సముద్రంలో కలిసిపోతుంది...రేవు నావలు నడిపేవారి దగ్గరనుంచి పెద్దపెద్ద పంట్లు నడుపుకునే వాళ్ళవరకు , చిన్నచిన తెప్పలలొ చేపలు పట్టుకునే వారి నుంచి మరపడవలలొ వేటకి వెళ్ళేవారి వరకు ఎందరికో ఈనది జీవనాధారం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకుని అలసిపోయిన శ్రమజీవులకి అది ఒక రీఫ్రెష్మెంట్ స్పాట్.చిన్నదైన మానరసాపురం మొత్తమ్మీద మోష్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది.

   అక్కడే నాకొకసారి గవర్రాజు పరిచయం అయ్యాడు. చేపల వ్యాపారం చేసేవాడు. తెల్లవారుఝామునే పడవ వేసుకుని గోదావరి మధ్యలోకి వెళ్ళి వలలు పాతి,రాత్రి తిరిగి వెళ్ళి వలలో పడిన చేపలని తెచ్చుకుని మర్నాడు మార్కెట్ లో అమ్ముకునేవాడు.అప్పుడప్పుడు నేనుకూడా అతనితో కలిపి రాత్రి పడవలో వెళ్ళేవాడిని. పడవ మీద దాదాపు ఐదు అడుగుల పొడవుండే వెదురు కర్రని నిలపెట్టి, దానిమీద నూనె దీపం పెట్టి, అది ఆరిపోకుండా దానిచుట్టూ గాజుబుడ్డి అమర్చి తెడ్డు వేసుకుంటూ గోదాట్లోకి తీసుకెళ్ళేవాడు. వలలు బయటకి తీసి చేపలు పడవలో వేస్తూ "పంతులూ కూతంత పక్కకి కూకో చేపలు మీద పడిపోగలవు" అనేవాడు.నేను నవ్వుతూ పక్కకి జరిగితే , సడెన్ గా నావైపు తిరిగి "పెళ్ళాం పుస్తెలమ్మైనా పులస తినాలంటారు ,క్యారేజీలొ పులుసుంది కూతంత  రుచి సూత్తావేటి" అనేవాడు. నేను నిర్లఖ్యంగా చూస్తే నవ్వేస్తూ సరదాకి అన్నాలే సామి అంటూ సత్తు క్యారెజీలో తెచ్చిన మసాలావేసి ఉడికించిన మొక్కజొన్న గింజల్లో సగం నాకు పెట్టేవాడు.

     పూర్తిగా వెన్నెల ఉన్నరోజుల్లొ ఐతే తను వలలో పడిన చేపలని పడవలో వేస్తూ ఉంటే, నేను ఆ వెన్నెల వెలుగులో వెండిలా మెరిసిపోతున్న గోదావరిని చూస్తూ గడిపేసేవాడిని.   చేపలు బాగా పడిన రోజున ఉత్సాహంగా బోల్డు కబుర్లు చెప్పేవాడు, లేకపోతే చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ తత్వాలు చెప్పేవాడు.ఉన్నట్లుండి సడెన్ గా  నావైపు తిరిగి "గోదారి మా అమ్మ తెలుసా" అనేవాడు. తను చుట్ట కాలుస్తున్నప్పుడు సరదాపుట్టి  నాకుకూడా ఒక చుట్ట ఇమ్మని అడిగితే,వెంటనే తను కాలుస్తున్న చుట్టని తీసి గోదాట్లొకి విసిరేసి,"ఛీ! నీకెందుకు చెప్పు ఈ చెడ్డ అలవాటు, నువ్వు మంచి వాడివి, అలాగే ఉండు అనేవాడు."

                  వెంటనే నేను "అంటే నువ్వు చెడ్డవాడివా" అని అడిగేవాడిని ఠక్కున.

         ".....అనికాదనుకో , చిన్నప్పుడు నాన్నతో కలిపి చేపలు పట్టడానికి గోదాట్లోకి వెళ్ళేవాడిని.నడిగోదాట్లో చలేస్తోంది అంటే కప్పుకోడానికి నాన్న రగ్గు ఇచ్చేవాడు.నాన్నకి జబ్బు చేసిన తర్వాత పక్కింటి మామతో వెళ్ళేవాడిని, అప్పుడు చలేస్తోంది అంటే మామ చుట్ట ఇచ్చేవాడు. కొంతకాలానికి రగ్గు ఇచ్చిన నాన్న,చుట్ట ఇచ్చిన మామ ఇద్దరూ పోయారు. ఈ పాడు అలవాటు మాత్రం మిగిలి పోయింది.ఇప్పుదు ఒళ్ళు పాడవుతుండని తెలిసినామానలేకపోతున్నాను.నీకు వద్దులే ఇలాంటి చెడ్డ అలవాట్లు..." అనేవాడు.

చేపల వ్యాపారంలోవచ్చే డబ్బులు సరిపోకనో ఏమో తెలియదుగానీ, కొంతకాలానికి అతను బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ దేశాలకి  వెళ్ళిపోయాడు.వెళ్ళేముందర నన్ను కలిసాడు. రోజంతా నాతోనే ఉన్నాడు. అదే అతన్ని అఖరిసారి కలవడం.మళ్ళీ నాకు కనిపించలేదు.తరువాత మేము కూడా ఉద్యొగం కోసం వెరే ఊరు మారిపోయాము.దాదాపుగా ఆరుసంవత్సరాలు గడచిపొయాయి. ఎప్పుడైన ఊరువెళ్ళినప్పుడు తను కనిపిస్తాడేమో అని ఒకసారి అలా పడవలరేవు వరకు వెళ్ళి వస్తాను.   కాని నాకు నిరాశే మిగులుతుంది.అతని చుట్టాలెవరితోనూ నాకు పరిచయం లేదు. కనుక అతని గురించి సమాచారం కూడా ఎమీ తెలియలేదు. కాని అతనితో స్నేహం మత్రం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.  

శనివారం, ఏప్రిల్ 05, 2014

సుబ్బయ్యతాత

మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ మాఊరువచ్చాను. ఉద్యోగం కోసం దాదాపు ఆరు సంవత్సరాలక్రితం ఊరువిడిచి వెళ్ళినప్పటినుండి ఏడాదికి ఒకసారయినా ఎదోఒకవంకతో ఇక్కడికి వచ్చేవాడిని కానీ గత మూడు సంవత్సరాలుగా  వీలుచిక్కటంలేదు. బహుశా ప్రయత్నలోపంకావచ్చు. కానీ ఎందుకో పోయినవారం ఒక్కసారిగా ఊరిమీద  బోల్డంతప్రేమ పుట్టుకొచ్చింది. ఒకసారి అందరిని చూడాలనిపించింది.అనిపించడమేతడవు వెంటనే టిక్కెట్టు రిజర్వ్ చేయించుకుని బయలుదేరి వచ్చేశాను.రైలుదిగితూనే సరాసరి ఊర్లోనే ఉంటున్న మాపెదనాన్నగారింటికి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే రెష్టు తీసుకుని కొంచెం చల్లపడ్డాక సైకిలు మీద ఎంబరుమన్నారు స్వామి కోవెలకి బయలుదేరాను.ఎంబరుమన్నారుస్వామి అంటే తమిళంలో వెంకటేశ్వరస్వామి. ఆ గుడిని తమిళాయన కట్టించినందువల్ల తమిళనామంతోనే పిలుస్తారు. నాస్నేహితుడు కృష్ణ అక్కడే అర్చకత్వం చేస్తున్నాడు. నేను వేళ్ళేసరికి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తున్నాడు.దూరం నుంచి నన్నుచూస్తూనే పలకరింపుగానవ్వి కూర్చోఅక్కడ వస్తున్నా అన్నట్లు సైగ చేసాడు.నేను స్వామివారిని దర్సించుకుని ధ్వజస్తంభానికి పక్కగాఉన్నమంటపంలో కూర్చున్నాను.ఒక పావుగంటలో వచ్చాడు అభిషేకం అయిపోయినతర్వాత. అరిటాకులో తెచ్చిన  గోరువెచ్చని అప్పాలు,చెక్కరపొంగలి నాచేతిలో పెట్టాడు. తనకితెలుసు అవంటే నాకుచాలా ఇష్టంఅని.... తెస్తాడని నాకూతెలుసు.

                 "ఇంతకాలానికి మళ్ళీ మేము గుర్తొచ్చామన్నమాట.." అన్నాడు నవ్వుతూ నాపక్కన కూర్చుని.

                 నేనేమీ సమాధానం చెప్పలేదునవ్విఊరుకున్నా.

పదినిముషాలు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇద్దరంకలిసి గోదావరిఒడ్డుకి బయలుదేరాము.
సైకిలుమీద కోవెలనునంచి రెండువీధులు దాటి దాదాపు జ్యోశ్యులవారి వీధివరకు వచ్చేశాము, వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి సైకిలు ఆపి వెనుకకితిరిగి చూశాము.

దాదాపు ఎనభైసంవత్సరాల వయసు ఉండే ముసలాయన,పరుగులాంటినడకతో దాదాపు వంద అదుగులదూరం నుండి మావైపేవస్తున్నాడు. కొంచెం దగ్గరకి వచ్చేసరికి పోల్చుకున్నాను. అతను సుబ్బయ్యతాత...........

........మా చిన్నప్పుడు మాస్కూలు దగ్గర ఉదయం పూట పిప్పరమెంటు బిళ్ళలు, ఉడికించిన వేరుశెనగకాయలు అమ్మేవాడు. టెంత్ క్లాస్ అయిపోయినతర్వాత మళ్ళీ తనని చూడడం ఇదే మొదటిసారి. దాదాపుగా పది సంవత్సరాల పైన అయిపోయింది. చాలకాలానికి మమ్మల్ని చూసిన ఆనందం అతని మొహంలో క్లియర్ గా కనిపిస్తోంది. వయసుతెచ్చిన అలసటవల్ల అనుకుంట కొద్దిపాటినడకకే ఒగరుస్తున్నాడు.

   ఒక్కసారిగ నాకుపాత సుబ్బయ్యతాత గుర్తుకువచ్చాడు.

...మా స్కూలుదగ్గర పిప్పరమెంటుబిళ్ళలు అమ్మే సమయానికే అతను చాలా పెద్దవాడు. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు.దాదాపు పది కిలోమీటర్లు దూరంలొ ఉండే వాళ్ళ ఇంటినుండి బుట్టలో సరుకులుపెట్టుకుని నడుచుకుంటూ మాస్కూలుదగ్గరకి వచ్చేవాడు.మమ్మల్ని అభిమానంగా చేరదీసి కబుర్లు చెప్పేవాడు. మేము తనదగ్గర ఏమైన కొనుక్కుని డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేకపోతే తనదగ్గర ఉన్నచిన్న పుస్తకంలొ అరువు రాసుకునేవాడు. అది ఎన్నాళ్ళకి తిరిగి మేము ఇచ్చినా అడిగేవాడుకాదు.నిజానికి అతను ఏనాడు డబ్బులు మిగుల్చుకోవడానికి వ్యాపారం చేసేవాడుకాదు.ఏదో గవర్నమెంటు ఆఫీసులో ప్యూను ఉద్యోగం చేసి రిటైరు అయ్యి, నెలనెలా వచ్చే పెన్షన్ ఇద్దరు కొడుకులకి సమానంగ పంచి ఇచ్చేస్తూ, నెలకి ఒకరిదగ్గర గడుపుకునేవాడు.ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలుదగ్గర వ్యాపారం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్తూ తర్వాతిరోజుకి సరుకులు కొనుక్కుని, మిగిలిన డబ్బులతో  తనకి లంక పొగాకు కాడలు, మనవలకి చిరుతిళ్ళూ కొనుక్కెళ్ళేవాడు.అంతవరకే అతనికి డబ్బు అవసరం. అంతకుమించి వచ్చే అవకాశం ఉన్నా అతను ఆశపడేవాడు కాదు...

   ఇన్నాళ్ళకి మమ్మల్ని చూసిన ఆనందంలో పావుగంట సేపు ఆపకుండా బోల్డు కబుర్లు చెప్పాడు.మాటలలో అతను వ్యాపారం మానివేసాడని ,ఇప్పుడు వేరే ఊరిలో  ఉంటున్నాడని అర్ధమైంది.

ఒక అరగంట కబుర్లుచెప్పుకున్న తర్వాత బయలుదేరుతూ కృష్ణ తాత చేతిలో ఏభైరూపాయలనోటు పెట్టాడు. అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది.నేనుకూడా ఎమైనా ఇద్దాం అని జేబులో ఉన్న పర్సు బయటకి తీశాను. ఇందాకా ఏటిఎం లో విత్-డ్రా చేసిన వెయ్యిరూపాయలనోటు తప్ప చిన్నవి కనిపించలేదు.చూస్తూచూస్తూ అంత పెద్దనోటు ఇవ్వలేకపోయాను.చేసేది ఎమీలేక చిల్లరలేదు తాతా అన్నాను కొంచెం ఇబ్బందిగా మొహంపెట్టుకుని.పర్వాలేదులే బాబు, ఇప్పుడునాకు డబ్బులతో పనేముంటుంది,పొగాకుకాడలకి తప్ప. కృష్ణ ఇచ్చాడుకదా చాలులే అన్నాడు.కానీ ఆమాట అంటున్నప్పుడు అతని మొహంలో కనిపించిన చిన్నపాటి నిరాశ నాకళ్ళని దాటిపోలేదు. సరేనని తనకి విడ్కోలు చెప్పి మేము గోదావరివైపు బయలుదేరాము.కొద్ది దూరం వచ్చాముకానీ నామనసుకంతా వెలితిగా అనిపించింది. వెయ్యిరూపాయలు కొంచెం పెద్ద మొత్తమేకావచ్చు, కాని తాతకి ఇవ్వడంవల్ల నాకు పెద్దగా వచ్చే నష్టం ఎమీఉండదు. రోజూ చేసే ఎన్నో పిచ్చిఖర్చులతో పోలిస్తే ఇదేమీ అంతలెఖలోనిదీ కాదు.ఈ విషయంలొ అనవసరంగా లోభించానేమో అనిపించింది.ఇంక ఇలాకాదని సైకిలు ఆపి, కృష్ణని అక్కడే ఉండమని చెప్పి నేను వెనుకకి వెళ్ళాను ఆ డబ్బులు తాతకి ఇద్దాం అని. కాని అప్పటికే అతను అక్కడనుంచి వెళ్ళిపోయినట్లున్నాడు ఎంత వెతికినా నాకు కనిపించలేదు.నిర్ణయం తిసుకోవడంలొ చిన్నపాటి టైమింగ్ ప్రాబ్లం నాకు చాలా గిల్టిఫీలింగ్ మిగిల్చింది. ఇంక చెసేది ఎమీలేక వెనుకకి తిరిగివచ్చి , కృష్ణతోకలిసి గోదావరిఒడ్డుకి చేరుకున్నాను.





మాటజారితే

 ఒక్కొక్కసారి మనం అనుకొకుండానో, తీవ్రత అంచనా వెయ్యకుండానో మాటలు వదులుతూ ఉంటాం. తీరా మనతప్పు తెలుసుకునే సరికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. తర్వాత తీరిగ్గా బాధపడడం తప్ప చెయ్యగలిగేది ఎమీఉండదు.
  మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవమే నాకు ఎదురయ్యింది. ఎదోపనిఉండి మా కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది.నా ఫ్రెండు కృష్ణని తోడుగా తీసుకుని వెళ్ళాను. పని పూర్తి అయ్యి బయటకి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం అయ్యింది.మేము  రోడ్డుమీదకి వచ్చేసరికి మాడిగ్రీ క్లాస్-మీట్ శ్యామల ఎదురయ్యింది. అప్పటికి నేను తనని అఖరిసారి కలుసుకుని దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది,మరలా ఇప్పుడే కలవడం. మమ్మల్ని చూస్తూనే స్కూటీ పక్కకి ఆపి మాదగ్గరకి వచ్చి నవ్వుతూ పలుకరించింది . ఒక పావుగంట కబుర్లు చెప్పినతర్వాత తాను ఇప్పుడు ఎదో కంప్యూటర్ కోర్సుచేస్తున్నానని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానని మరో ఐదు నిముషాలలో క్లాస్ స్టార్ట్ అవుతుంది కనుక మరొకసారి కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది.ఐదు సంవత్సరాలక్రితం కలిసినప్పుడు కూడా ఇలాగే ఎదో కోర్సు చేస్తున్నానని చెప్పింది.
     "ఇంక ఈఅమ్మాయి పెళ్ళి-పెటాకులు ఎమీ చేసుకొదేంట్రా, ఎంతసేపూ ఎదోఒక కోర్సు చెయ్యడం తప్ప..." అన్నాను నేను కృష్ణతో  ఒక్కొక్కసారి నాగొంతులో నాకుకూడా తెలియకుండా ధ్వనించే చిన్నపాటి వెటకారాన్ని నింపుకుని. కొంతసేపు వాడు ఎమీ మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా అన్నాడు. అలాకాదురా,ఎంతచదువుకున్నా ఎంత అందంగాఉన్నా ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే ఈరొజుల్లో కూడా లక్షలకిలక్షలు కట్నాలు ఇవ్వాలి. వీళ్ళ నాన్నేమో చిన్న సైకిలుషాపు నడుపుతాడు. మొన్ననే చాలా కష్టపడి వీళ్ళ అక్కకి పెళ్ళి చేసారు, ఈమెకికూడా చూస్తున్నారు. ఈమెది అయిపొతే వెనుక వీళ్ళ చెల్లి కూడాఉంది అన్నాడు. ఒక్కసారిగా నామాట ఆగిపోయింది. తిరిగి అలోచించి చూస్తే నేనెంత తొందరపడి మాట్లాడానో నాకు అర్ధమయ్యింది. ఆ గిల్టీ ఫీలింగ్ తోనే అనుకుంట కొంచెంసేపు మౌనంగాఉండిపొయాను.

  నెను మట్లాడడం అపేసరికి నా పరిస్థితిని కృష్ణ అర్ధంచెసుకున్నట్లున్నాడు  నాభుజం మీద చెయ్యి వేసి "అయినా అవన్ని నీకు నీకుమాత్రం ఎలా తెలుస్తాయి లేరా, నీకు చెల్లో అక్కో ఉండి ఉంటే తెలిసేది, నాకు కూడా మొన్న మా ఆక్క  పెళ్ళిలో ఈవిషయాలన్నీ కొంచెం అనుభవం లోకి వచ్చాయి,అందుకే అన్నారు పెళ్ళి చేసిచూడు, ఇల్లుకట్టి చూడు అని అర్ధం అయ్యిందా"  అన్నాడు నవ్వుతూ అనునయంగా .   ఇది జరిగిపోయి రెండునెలలు అయిపోయినా ఎప్పుడైనా గుర్తొస్తే కొంచెం బాధగాఅనిపించి మట్లాడేటప్పుదు ఒకటికి రెండుసార్లు అలోచించుకోవలసిన అవసరాన్ని నాకు గుర్తుచేస్తూ ఉంటుంది.

ఐస్-క్రీం బండి దుర్గారావు

రెండు నెలలక్రితం ఎదోపనిఉండి ఊరు వెళ్ళాల్సివచ్చింది. ఒక్కరోజు మాత్రమే శెలవుదొరకడంతో ఊరిలో దిగిన రోజే పని కంప్లీట్ అయ్యెలాగా ప్లాన్ చేసుకుని ఊళ్ళోదిగాను. అన్ని అనుకున్న ప్రకారమే కంప్లీట్ కావడంతో సాయంత్రం బండి క్యాచ్ చెయ్యడానికి తిరిగి స్టేషనుకి బయలుదేరాను. కృష్ణ నాతోపాటు వచ్చాడు నాకు సెండాఫ్ ఇవ్వడానికి. ఇంకా రైలుస్టార్ట్ అవ్వడానికి అరగంటకి పైగా టైము ఉండడంతో మేమిద్దరం అక్కడే స్టేషనులో నిలపడి మాట్లాడుకుంటున్నాం.ఇంతలో ప్లాట్-ఫారం మీద బండిమీద తిరుగుతూ ఐస్-క్రీము అమ్ముకుంటున్న ఇద్దరు పిల్లలు నాకు కనిపించారు. ఎక్కడో చూసినట్లనిపించింది. దగ్గరకి వచ్చాక బాగాపోల్చుకున్నాను. దుర్గారావు పిల్లలు వాళ్ళు. చటుక్కున దుర్గారావు గుర్తొచ్చాడునాకు.

   దుర్గారావు మాస్కూలుదగ్గర ఐస్-క్రీం బండి నడుపుకునేవాడు. రెండు రూపాయలు ఇస్తే పెద్ద బ్రెడ్డు-స్లైస్  మీద ఐస్-క్రీం పెట్టిఇచ్చేవాడు. సినిమాకబుర్లు బాగాచెప్పేవాడు. డబ్బులు లేనప్పుడు అరువు కూడా ఇచ్చేవాడు. మాకందరికి అతనంటే ఎందుకో కొంచెం అభిమానం ఉండేది.అప్పుడప్పుడు తనపిల్లల్ని కూడా తీసుకుని వచ్చేవాడు. మమ్మల్ని వాళ్ళకి చూపిస్తూ మీరుకూడా వీళ్ళలాగా బాగాచదువుకోవాలి అని చెప్పేవాడు. అప్పటికి వాళ్ళు బాగా చిన్నపిల్లలు.ఎమీ అర్ధంకానట్లు నవ్వేవాళ్ళు.ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయ్యారు.

 " ..... ఆమధ్య జబ్బు చేసి దుర్గారావు సడన్ గా పోయాడురా, దానితో వీళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే వాళ్ళ నాన్న వ్యాపారాన్నే కలిపి చెసుకుంటున్నారు.." అన్నాడు కృష్ణ . అప్పుడు గమనించానువాళ్ళని, పెద్దవాడు కొంచెం బలంగా,పొడుగ్గా ఉన్నాడు. కాని పాపం వాడికి కళ్ళు సరిగ్గా కనపడవనుకుంట, పెద్దపెద్ద సోడాబుడ్డి కళ్ళాద్దాలు వేసుకుని ఉన్నాడు. రెండో వాడికి అన్నీ బాగానే ఉన్నాయి గాని వాడు బక్కగా పొట్టిగా ఉన్నాడు.కాని వాళ్ళిద్దరు కలిపివ్యాపారం చేసుకుంటున్న పద్ధతిచూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇద్దరు కలిపి నడుపుకోవడానికి వీలుగా సైకిలుకి రెండుసీట్లు పెట్టించారు. పెద్దవాడు వెనుక కూర్చుని  పెడల్ తొక్కుతుంటే, చిన్నవాడు ముందుసీట్లో కూర్చుని హేండిల్ బార్ చూసుకుంటున్నాడు.

  వాళ్ళకేదైనా సాయం చెస్తే బాగుంటుందేమో అనిపించిందినాకు. కృష్ణ ఆపాడునన్ను. కష్టమోనష్టమో వాళ్ళజీవితాలు ఒకపద్దతిలో వాళ్ళుగడుపుతున్నారు.. ఇప్పటివరకు అప్పుకోసంకూడా ఎవరిదగ్గర చెయ్యిచాపినట్లు కూడా నేను చూడలేదు. నాకుతెలిసి నువ్వుఇచ్చినా వాళ్ళు తీసుకోరు అన్నాడు. సరేఅయితే ఎంచేద్దాం అన్నాను. రెండు ఐసులు కొను వాళ్ళదగ్గర,అది చాలు వాళ్ళకి మనం కూడా పుల్ల ఐసులు తినిచాలాకాలం అయినట్లుంది అన్నాడు నవ్వుతూ . ఇంతలో రైలు బయలుదేరుతున్నట్లు ఎనౌన్సుమెంటు రావడంతో నేను వాళ్ళని దగ్గరకిపిలిచి రెండు ఐస్-ఫ్రూట్లు కొని ఒకటి కృష్ణకి ఇచ్చి వీడ్కోలుచెప్పి రైలు ఎక్కాను.

శుక్రవారం, మార్చి 28, 2014

తెలుగుతెరపైకి దూసుకువస్తున్న కొత్త గాయకుడు.



తెలుగుతెరకి ఈమధ్యనే విడుదలయిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రం ద్వారా సరికొత్త గాయకుడు పరిచయం అయ్యాడు. పిట్టకొంచెం కూతఘనం అనిపిస్తున్న ఆగాయకుడి వయసు కేవలం ఇరయైరెండేళ్ళే.


అతనిపేరు :    శ్రీపతి పండితారాధ్యుల  బాలసుబ్రహ్మణ్యం

క్లుప్తంగా :     ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని,

ముద్దొచ్చినప్పుడు :  (కొందరికి మాత్రమే) "బాలు" అనికూడా పిలువవచ్చు.




గురువారం, జనవరి 30, 2014

బ్రేకింగ్-న్యూస్ .. బాపూజి ఇకమనకిలేరు .. భారతజాతి మహాత్ముని కోల్పోయింది



ప్రపంచ శాంతికి కృషిచేసిన మహాత్ముని అస్తమయం.. ప్రార్ధనకి వెళ్ళి వస్తుండగా  ఒక యువకుని దుస్సాహసం...  ..భారతజాతి మహాత్ముని కోల్పోయింది. మహాత్ముని మరణవార్త విని ప్రజలు ఖిన్నులయ్యారు. ప్రజలని సమ్యమనం పాటించవలసిందిగా మన ప్రధానమంత్రి నెహ్రు విజ్ఞప్తి చేసారు........





గురువారం, జనవరి 23, 2014

ఇప్పుడే అందిన తాజావార్త.. భారతదేశానికి స్వాతంత్రం ..ఎర్రకోటనుంచి ప్రకటించిన నెహ్రూజీ

మంగళవారం, జనవరి 14, 2014

నేను, వాళ్ళు - ఓ హైటెక్ బస్సు


నాలుగో తరగతి చదువుతున్నప్పుడు దసరా శెలవలకి హైదరాబాద్ వెళ్ళి,తిరిగి వచ్చేటప్పుడు పెద్దమామయ్య మమ్మల్ని రైలులోకాకుండా, హైటెక్ బస్సులో పంపించాడు. అప్పటి వరకు బస్సు అంటే తాతగారింటికి వెళ్ళేటానికి ఎక్కే ఎర్రబస్సే. అది గతుకులతో నిండిన మట్టి రోడ్డుమీద యుద్ధవిమానమంత సౌండుచేసుకుంటూ రోడ్డుమీద దుమ్ముని కొంచెం తన మీదా మిగిలినిది లోపలకూర్చున్నవారిమీద రేపుకుంటూ తీసుకువెళ్ళేది. అప్పటివరకు  అటువంటి బస్సులో
ప్రయాణం చేసిననాకు ఈ బస్సు కొత్తగా అనిపించింది. ఈబస్సులో సీట్లు కూడా వెనక్కి ముందుకి వాల్చుకోవడానికి వీలుగా చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇంటువంటి బస్సుల్ని చూసినా ఎప్పుడూ ఎక్కక పోవడంవల్ల వాటిగురించి ఎక్కువగా అలోచించలేదు. .కాని ఆ ఒక్కరాత్రి
ప్రయాణం ఆ బస్సుకి నన్ను వీరాభిమానిని చేసేసింది.దానికితోడు ఆ బస్సులో సినిమాలు కూడావేశారు. ఇంక అప్పటివరకు నా జీవితాశయం అయిన సినిమాహాలులో ఆపరేటర్ ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి  ఆర్టిసి  బస్సులో
కండక్టర్ కావటమే నా జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నాను.

        ఇంటికి తిరిగివచ్చిన వెంటనే పక్కింట్లోఉండే కండక్టర్ మామయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి  అసలు మా ఊరి డిపోలో ఎన్ని హైటెక్కు బస్సులు ఉన్నాయా అని ఆరా తీశాను.మొత్తం రెండే ఉన్నాయిట. అందులో ఒకటి హైదరాబాదుకి రెండోది వైజాగుకి ఉంటాయని మామయ్య చెప్పాడు.అదికూడా బాగానేఉంది అనిపించింది. ఒకరోజు హైదరాబాదుకి రెండోరోజు వైజాగుకి మార్చి మార్చి డ్యూటీ వేయించుకోవచ్చు అనుకున్నాను. రెండురోజులకొకసారి మామయ్య దగ్గరకి వెళ్ళి వాటి యోగక్షేమాలు కనుక్కుని వచ్చేవాడిని. వారానికి ఒకసారి సాయంత్రంపూట అలా బస్-స్టాండుకి వరకూ వెళ్ళి నేను భవిష్యత్తులో ఉద్యోగం చేయబోయే బస్సుల్ని చూసుకుని వచ్చేవాడిని. ఒకసారి మాఊరినుంచి హైదరబాదు బయలుదేరిన బస్సుకి విజయవాడ దాటిన తరువాత ఎదో యాక్సిడెంట్ అయ్యిందని వార్త తెలిసింది. వెంటనే ఆందోళనగా మామయ్యదగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళాను. ఆయన వివరాలు కనుక్కునివచ్చి హైవేమీద స్పీడు ఎక్కువై డివైడర్ని ఢీకొట్టిందని, బస్సుకేమి కాలేదుగాని సడన్ బ్రేక్ వెయ్యడంవల్ల ఇద్దరికిమాత్రం గట్టిదెబ్బలు తగిలాయని చెప్పాడు. బస్సు క్షేమంగానే ఉందనడంతో నేను హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను.

        కొన్నిరోజులకి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కొందరు  మా ఊరినుంచి హైదరాబాదుకి హైటెక్-బస్సులు వేశారు. నా రొట్టెవిరిగి నేతిలో పడినట్లయ్యింది. ఉదయం పూట గోదావరిఒడ్దున బస్సుల్నిపెట్టుకుని డ్రైవర్లు, క్లీనర్లు కలిపి వాటిని కడిగేవారు.   రెండురోజులు అక్కడి వాళ్ళని బాగా పరిశీలించి కుదమట్టంగాఉన్న ఒక డ్రైవర్ని ఎంచుకుని వాడితో ఫ్రెండ్-షిప్ మొదలుపెట్టాను. వాడిపేరు  గుమ్మాల అప్పారావు.  ప్రతీరోజూ స్కూలు అయిపోయిన తర్వాత నాన్న దగ్గర చిల్లరడబ్బులు అడిగి తీసుకుని వెంకటేశం కొట్లో పకోడీలు కొనుక్కుని వెళ్ళి వాడికి నైవేద్యం పెట్టేవాడిని.దానికి ప్రతిఫలంగా వాడునాకు మా ఊరినుంచి పక్కఊరిదాకా బస్సులో ఫ్రీ గా ఎక్కే అవకాశం ఇచ్చేవాడు. కాకపోతే ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చోవాలి. ఎవరైనా లేచిపొమ్మంటే వెంటనే లేచిపోవాలి. అల్లరి చెయ్యకూడాదు అనే నిబంధనమీద. పక్కఊరిలో ఎక్కే పాసింజర్స్ కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేసిపెట్టేవారు, కనుక ఎప్పుడూ మనకి ఇబ్బంది ఉండేదికాదు.

       తిరిగి వచ్చేటప్పుడు ఎవరినైనా లిఫ్ట్ అడిగి వచ్చేసేవాడిని. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు తిరిగివచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్న ఒకాయన్ని లిఫ్ట్ అడిగాను. ఆయన లిఫ్ట్ ఇచ్చి సరాసరి ఇంటివరకు తీసుకుని వచ్చి దింపేశాడు. ఈయనకి మాఇల్లు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతోపాటు మనసు కొంచెం కీడుకూడ శంకించింది. హెల్మెట్ తీసిన తర్వాతచూస్తే ఆయన మా పక్కవీధిలో ఉండే అహోబిలం మామయ్య. ఎప్పుడూ గుమ్మడిలాగ సాత్వికంగా మాట్లాడే అహోబిలం మామయ్య ఒక్కసారిగా రాజనాలలాగా మారిపోయి నా గుట్టంతా ఇంట్లో చెప్పేశాడు. నా వీపు విమానం మోత మోగిపోఇంది. ఇంక ఆరోజు నుంచీ ట్రావెల్స్ ప్రయాణాలు బంద్ అయిపోయాయి.

       ఆ సంవత్సరం సంక్రాంతి శెలవలకి ఎప్పటిలాగే తాతగారి ఊరు వెళ్ళాము. అక్కడ చిన్నారివదినా, పండుబావ, అన్నయ్య ఇంకా నేను కలిసి పగలు రాత్రి తేడా లేకుండా ఆడుకున్నాము.చూస్తుండగానే శెలవలు అయిపొయాయి.
అయితే తిరిగి వచ్చేటప్పుడు చిన్న ఇబ్బంది వచ్చింది. శెలవలు అయిదు రోజులే ఇచ్చారు. అవి గురువారంతోటి అయిపోతాయి. శుక్రవారం ఒక్కరొజు స్కూలుకి వెళ్ళాలి, శనివారం సెకండు సాటర్ డే శెలవు వచ్చింది. ఈ ఒక్కరోజు స్కూలు మానేస్తే చక్కగా ఆదివారందాకా మనందరం కలిపి ఆడుకోవచ్చుకదా అంది వదిన. ఈ ప్రపోజల్ నాకు తెగనచ్చేసింది. కాని అన్నయ్య ఒప్పుకోలేదు. స్కూలుమానడం కుదరదన్నాడు పెద్ద వివేకానందస్వామి లాగ గోడకి ఆనుకుని నిలపడి. అమ్మకూడా వాడివైపే మాట్లాడింది. పనిలో పనిగా నన్ను,నాకు వచ్చిన మార్కులని ఇంకా ఈమధ్యకాలంలో హైటెక్కు బస్సు అభిమానంతో నేను చేసినపనులని గుర్తుతెచ్చుకుని మరీ దులిపిపారేసింది. నాకు మళ్ళీ మా రాజనాలగాడు గొర్తొచ్చి వాడిని నోటినిండా తిట్టుకున్నాను. అమ్మకి ఆవేశం ఎక్కువైపోయి రెండు అంటిస్తుందేమో అని భయం వేసింది, ఇంతలో మామయ్య అడ్డంవచ్చి అమ్మని ఊరుకోపెట్టాడు. పదకొండుగంటల బస్సుకి ప్రయాణంగా నిర్ణయించి అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. హమ్మయ్య ఒక గండం గడిచింది అనుకున్నాను. కాని అవమానభారంతో కంట్లో నీళ్ళు వచ్చాయి. వదిన, పండుబావా నన్ను ఇంటివెనకాల పాకలోకి తీసుకువెళ్ళి ఓదార్చారు.

ఇంతజరిగినా నాకు అప్పుడే వెళ్ళడం మాత్రం ఇష్టంలేదు. వాళ్ళిద్దరికి కూడా నన్ను పంపడం ఇష్టంలేదు. ఒరెయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడప్పుడే రావుకదరా అంది వదిన. అవునే మళ్ళీ వేసవి శెలవలదాకా రావడం కుదరదు అన్నాను నేను బాధగా మొహం పెట్టి. ఇప్పుడు నువ్వు ఆగిపోతే సాయంత్రం మనం అంతా కలిసి సైకిలుమీద సినిమాకివెల్దాంరా అన్నాడుబావ. వెల్దాంబావా ఊరువెళ్ళామంటే నాన్న ఇప్పుడప్పుడే సినిమాకి పంపరు అన్నాను నేను. అయితే ఎదోఒకలాగ ప్రయాణం ఆపేద్దామురా అన్నారు వాళ్ళిద్దరు. సరెనంటే సరే అనుకుని అక్కడే పాకలో కూర్చుని ప్రయాణం ఎలా ఆపాలి అని కుట్రలు చెయ్యడం మొదలుపెట్టాము. పదకొండు గంటల బస్సు తప్పిపోతే మళ్ళీ  పన్నెండు గంటలకి ఉంది. దాని తర్వాత మళ్ళి సాయంత్రమే. కాని సాయంత్రం ప్రయాణాలు మామయ్య ఒప్పుకోడు. కనుక ఈ రెండు తప్పించుకోగలిగితే ప్రయాణం వాయిదా వెయ్యచ్చని ప్లానులు వెయ్యడం మొదలు పెట్టాము. రకరకాల ప్లానులు ఆలోచించాము. చివరికి చిన్నారొదిన చెప్పిన ప్లాను  ఫైనలైజ్ చేసాము. దానిప్రకారం బస్సు మాస్టాపులోకి రావడానికి అయిదు నిముషాల ముందు నేను కడుపునొప్పి వస్తున్నట్లు  అభినయిస్తూ టాయ్-లెట్ లోకి దూరిపోవాలి మళ్ళి బస్సు స్టాప్ దాటినతర్వాతే బయటకి రావాలి.

అనుకున్న ప్రకారం మొహంలో రకరకాల ఫీలింగ్స్ అభినయిస్తూ టాయ్-లెట్ లో దూరిపోయాను. బయటకి వచ్చినా బస్సు అందే అవకాశం లేదు అనే ధైర్యం వచ్చిన తర్వాత బయటకి వచ్చాను. మా నాటకంలో మొదటి అంకం సక్సస్-ఫుల్ గా కంప్లీట్ ఇయ్యింది. ఇంక రెండో అంకంలో మా స్క్రిప్ట్ ప్రకారం బస్సు రావడానికి అరగంట ముందర నుంచి బోల్డంత కడుపునెప్పి వస్తున్నట్లు నటిస్తూ తగినంత గోల చెయ్యాలి.  

దానిప్రకారం నేను ఇంకోఅరగంట ఉందనగా నేను పొట్టమీద చెయ్యివేసుకుని మంచం మీదపడుకుని అభినయం మొదలు పెట్టాను. బావ, వదినా నాకు చెరోవైపునా కూర్చుని నన్ను ఊరుకో పెడుతున్నట్లు నాపొట్టమీద రాస్తున్నారు. మా వివేకానందుడు మాత్రం నా వైపు అనుమానంగా చూస్తున్నాడు. మా అమ్మకూడా కొంచెం అనుమానంగానే చూసిందిగాని ఇంతలో ఏమనుకుందో మా మామయ్య వైపు  తిరిగి సూరిబాబునిగానీ, రామంగారిని గాని పిలవరా, ఎదైనా మందుఇస్తారేమో అంది కొంచెం ఆందోళనగా మొహం పెట్టి. ఎంతైనా అమ్మకదా.

    వాళ్ళిద్దరూ ఆ గ్రామవైద్యులు. రామం తాత గారిది ఆయుర్వేదం ,సూరిబాబు తాతయ్యది ఇంగ్లీషు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. రామంతాతగారు అయితే తేనెలో కలుపుకుని వేసుకునే తియ్యటి మందులు ఇచ్చేవారు, అదే సూరిబాబు తాతయ్య అయితే చేదుఇంగ్లీషు బిళ్ళలు ఇచ్చేవాడు. అది చాలదన్నట్లు ఉన్నట్లుండి సూది,సిరంజి పట్టుకుని ఇంజక్షన్ చేస్తానని వెంటపడేవాడు. ఇంట్లో ఎక్కడ దాక్కున్నా పట్టేసుకునేవాడు. ఆయనబారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బాత్రూంలో దాక్కుంటే ఒక అయిదునిముషాలు ఆగి వెళ్ళిపోతున్నట్లు సీను క్రియెట్ చేసి, వెళ్ళిపోయాడన్న ధైర్యంతో మనం బయటకి వచ్చిన వెంటనే సడనుగా ఎదోఒక పక్కనుంచి వచ్చి గట్టిగా పట్టేసుకుని కసక్కుమని పొడిచేసేవాడు. అందుకే మామయ్య సూరిబాబు తాతయ్యని కాకుండ రామం తాతగారిని తీసుకుని రావాలని దేముడికి దండంపెట్టుకున్నాను. కానీ దేముడు నామాట వినలేదు.మామయ్య ఇలా బయలు దేరాడొ లేదో, ఎదో పెద్దపని ఉన్నవాడిలాగా సూరిబాబుతాతయ్యే ట్రింగు-ట్రింగు అని బెల్లుకొట్టుకుంటూ సైకిలు వేసుకుని వచ్చి ఇంటిదగ్గర ఆగాడు.నాగుండెలు జారిపోయాయి. వాణ్ణి బయటకి రమ్మనండి చూస్తాను వాడి సంగతి అన్నాడు. నేను భయం భయంగా బయటకి వచ్చాను. ఒకసారి నాపొట్టమీద అటుఇటూ నొక్కి అబ్బే ఎమీలేదు అజీర్తి చేసిఉంటుంది. సోడాతాగి ఓగంట పడుకోరా అన్నాడు. అమ్మవైపు తిరిగి ఇవాల్టికి ప్రయాణం ఆపై అమ్మాయ్, ఓగంటాగితే అంతాసర్దుకుంటుంది అన్నాడు. ప్రయాణం ఆగిపోయినిదానికంటే , ఇంజక్షన్ కార్యక్రమాలు ఎమీపెట్టనందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను యాక్టింగ్ కంటిన్యూచేస్తూ వచ్చి మంచమ్మీద పడుకున్నాను. వదినా,బావా నన్ను మెచ్చుకుంటున్నట్లు నవ్వారు. నేను లోపలికి వచ్చేసిన తర్వాత అమ్మావాళ్ళంతా బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాటలమధ్యలో సూరిబాబు తాతయ్య ఇందాక పదకొండుగంటలకి వెళ్ళినబస్సు మధ్యలో చెడిపోయిందని, దానిబదులు  ఈట్రిప్ హైదరాబాదు వెళ్ళే హైటెక్-బస్సు మనఊరు వేసారని అది ఇంకో పదినిముషాలలో వస్తుందని చెప్తున్నాడు. ఒక్కసారిగా నాకళ్ళు మిలమిలా మెరిసిపోయాయి. ఠపీమని లేచి కూర్చున్నాను. వదిన మనసుకి ఎదోకీడు శంకించిందేమో, ఒరెయ్  హైటెక్-బస్సుదేముందిరా ఎప్పుడైనా ఎక్కచ్చు, ఈఒక్కరోజు ఆగిపోతే మళ్ళీమనం రెండురోజులు కలిసి ఆడుకోవచ్చు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే మళ్ళీ ఎప్పుడోగానిరావు కదరా అంది. దానిదేముందే ఎలగో మళ్ళీ వేసవి శెలవలకి వస్తానుకదా అప్పుడు ఆడుకోవచ్చులే అన్నాను.  అందరూ ఒప్పుకున్నారు కదరా ఉండిపో సాయంత్రం మనం అందరం కలిసి సైకిలుమీద సినిమాకివెల్దాం అని ఊరించాడు బావ. ఈసారి వచ్చినప్పుడు వెల్దాంలేబావ అని వాడికి సమాధానం చెప్పాను.  వాళ్ళిద్దరు ఇంకా ఎదోచెప్తున్నారు. నేనదేం పట్టించుకోకుండా నాబ్యాగు తీసుకుని బయటకి వచ్చి కడుపునెప్పి తగ్గిపోయిందని ప్రకటించేశాను. మరింకేం బయలుదేరిపోదాం అన్నాడు మా వివేకానందుడు లోపలపెట్టిన బ్యాగులు బయటకి తీస్తూ. వదినా,బావా ఎదో అంటున్నారు. నేనదేం పట్టించుకునే స్థితిలోలేను, నా దృష్టంతా రాబోయే హైటెక్-బస్సుమీదనే ఉంది. ఎదో అలౌకిక స్థితిలో ఉన్నవాడిలాగా తిన్నగా స్టాపు దగ్గరకి నడిచాను.



శనివారం, జనవరి 11, 2014

ప్రళయకావేరి...

చాలారోజుల క్రితం ఎదో పత్రికలో ఒక కథ చదివాను. కథపేరు "ఉత్తరపొద్దు". కథ ఎంత అద్భుతంగా ఉందో దాని కథనం, వాడిన భాష అంతకంటే అద్భుతంగా ఉన్నాయి. చిక్కని నెల్లూరు యాసలో సాగిపోయిన అచ్చతెలుగు కథ అది. కొన్ని పదాలను అర్ధం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డా  కథనడిపిన విధానం వల్ల ఆసక్తి  ఏమాత్రం  తగ్గలేదు.



చాలాకాలం తర్వాత ఆకథ ప్రళయకావేరి కథల సంపుటంలోనిది అని ఎవరి దగ్గరో విని, ఆ పుస్తకం ఎలా సంపాదించాలి అని గూగుల్ బాబాయ్ ని అడిగితే డౌన్-లోడ్ చేసుకోవడానికి కినిగే వాళ్ళ సైటు చూపించాడు..రచయిత స.వెం.రమేశ్ గారు. వీరు తమిళనాడులో తెలుగుభాష పరిరక్షన గురించి కృషిచేస్తున్న స్వచ్చంద కార్యకర్త అనికొన్ని వెబ్-సైటుల ద్వారా తెలుస్తోంది.

అసలు ప్రళయకావేరి అన్న పేరే ఎంతో అందంగా అనిపించింది నాకు. ఇంతకీ ప్రళయకావేరి అంటే మనకి తెలిసిన పులికాట్ సరస్సు అసలుపేరు. అది దాదాపు నలభై దీవుల సమూహారం. వాటిల్లో ఒక దీవే ఇప్పటి మన శ్రీహరికోట.  ఆ దీవుల్లో ప్రజల జీవనవిధానం, ప్రళయకావేరి తో వారికికల అనుబంధం మొదలైనవి కథావస్తువుగా తీసుకుని రాసిన కథలవి. అక్కడ నివిసించే ప్రజలకి ఒక దీవినుంచి మరొకదీవీ వెళ్ళడానికి మోకాలు లోతు నీళ్ళు ఉండే ప్రళయకావేరిని నడకతో దాటుతూ వెళ్ళడడమే ఎకైక మార్గం. అలాదాటుతున్నప్పుడు వారిమధ్య నడిచే మాటలు, చలోక్తులు, దీవుల్లో ఉండే ఊర్లలో జరిగే రకరకాల సంఘటనల సమూహారమే ఈ కథలు. మొత్తం 21 కథల సంపుటం. "ఉత్తరపొద్దు" మొదలయ్యి "వొళ్ళెరగని నిదర" తో ముగుస్తాయి.

" తెల్లోళ్ళు ఉప్పుమీద పన్ను వేసినప్పుడు గాంధీగారి పిలుపునందుకుని  ఉప్పు ఉద్యమంలోకి దూకి , ప్రళయకావేరిని కాపాడుకున్న విషయం ఇప్పుడు గుర్తుకుతెచ్చుకునేవారేలేరు, ఇప్పుడసలు ప్రళయకావేరనే పేరేలేదు. పర్యాటకశాఖ  వారి రికార్డులలో ఇప్పుడున్న పులికాట్ -  పేరులోనూ,ఊరులోనూ తనదనం లేని ఉప్పుకయ్య.." అని బాధపడతాడు రచయిత ముందుమాటలో.

"అమ్మంటే కన్న తల్లే కాదు, అమ్మ బాస కూడా, అమ్మంటే అమ్మనేల కూడా" అనే విశ్లేషణ చదువుతూఉంటే రచయితకి భాషపై ఉన్న మమకారం, అపురూపంగా గుర్తుపెట్టుకున్న చిన్ననాటి జ్ఞాపకాలమీద ప్రేమ మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

ఈ కథలన్నీ బక్కోడు (అది మన రచయిత చిన్నప్పటి ముద్దుపేరు) అని పిలువబడే  ఒక బాలుడి అనుభవాల రూపంలో మనకి కనిపిస్తాయి. ఇవన్నీ బక్కోడు చిన్నప్పుడు శెలవలకి వాళ్ళ తాతగారిఊరు  జల్లెలదొరువు (ఇదికూడా ప్రళయకావేరిలో ఒక దీవే)వెళ్ళినప్పుడు జరిగిన ముచ్చట్లు, వాళ్ళ తాత చెప్పిన కబుర్లూను.


"...ఒరే అశ్విని,బొరణి,కిర్తిక,రోయిణి.. ఈ మాదిరిగా మనకి ఇరవై ఏడు కార్తిలుండాయిరా.దాంట్లో ఉత్తరకార్తి ఒకటి.ఈ ఉత్తరకార్తిలో సూరయ్య మన పెళయకావేరమ్మతో కూడతాడురా.వాళ్ళు కూడెడప్పుడు ఎవరైనా పెళయకావేట్లోకి దిగితే సూరయ్యకి కోపం వస్తాది. అందుకే ఎవరూ ఉత్తరపొద్దులో ఎవరూ పెళయకావేట్లో దిగరు ఒకవేళ తప్పనిసరై దిగినా సూరయ్యకి, పెళయకావేరమ్మకి తప్పు చెప్పుకుని దిగుతారు." ఈ మాటలు  చదువుతున్నప్పుడూ,  నిర్మలత్త పొంగుమీదున్న పెళయకావేరమ్మకి సారెపెట్టడానికి చేటలతో పసుపు కుంకుమ తీసుకుని వేళ్ళినప్పుడూ  పెళయకావేరమ్మతో అక్కడి ప్రజలకి కల మానసిక అనుబంధం గురించి తెలుస్తుంది.

కాశవ్వబాగోతం, పాంచాలి పరాభవం, పరంటిది పెద్దోళ్ళు కథలు పడిపడి నవ్విస్తే, పద్దినాల సుట్టం,తెప్పతిరనాళ, వొళ్ళెరగని నిదర కథలు చదువుతున్నప్పుడు కంటిమీద సన్నని నీటిపొర ప్రత్యక్షమై అక్షరాలు మసకబారతాయి.

పైన చెప్పుకున్నట్లు చాలాకథలు బక్కోడికి, తాతకి మధ్య జరిగే సంభాషనలే. ప్రళయకావేరికి వలసవచ్చే పక్షులని బక్కోడికి చూపిస్తూ    "...ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది  ఎర్రకాళ్ళ కొంగ……."    అంటూ వాటిరూపాల్ని మనకళ్ళకి కట్టినట్లు వర్ణిస్తాడు.

బక్కోడికి దాహంతో ప్రాణానికి ముప్పు వచ్చినప్పుదు తన చనుబాలిచ్చి రక్షించిన వసంతక్క, అమెభర్త నల్లబావ పాత్రలు కూడా ముఖ్యమైనవే.

  "... ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు.   తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి..."  అంటూ నల్లబావే బక్కోడికి ప్రళయకావేట్లోదొరికే చేపలని గురించి వివరిస్తాడు (సందమామ ఇంట్లో సుట్టం కథలో).

"..ఎండినప్పుడు సూడాల ప్రళయకావేరిని—ఎర్రటి యెండలో, మంచు పరిసినట్టు తెల్లంగా తళ తళ మెరుస్తుంటాది.  రేత్రిళ్లు తెల్లటి యెన్నిల వుప్పు మిందబడి యేడు వన్నెలతో తిరిగి పైకి లేచి పోతుంటాది....."  అంటూ వేసవిలో ఎండిపోయిన ప్రళయకావేరిని గురించి అందంగా వర్ణిస్తాడు.

 "అబయా నలగామూల దాటినాక ,పెళయకావేరమ్మకి సక్కల గిలెక్కువ. మునేళ్ళు అదిమిపెట్టినడవండి..." అని తాత చెప్తున్నప్పుడూ (కావేరమ్మకి చక్కెలగిలిట ),

"ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి. మింట యెగరతా
కొమ్మకొమ్మకీ రెమ్మరెమకీ యాలాడతా, గుంపులు గుంపులుగా లెక్కలేనన్ని మిణకర బూసులు (మిణిగురు పురుగులు)...." అన్నప్పుడు,

".....సందకాడ సన్నజాజి పూసినట్టు సన్నంగా నవ్వినాడు ఆ పిలగాడు......" అంటున్నప్పుడు,

రాత్రంతా కష్టపడి పట్టుకున్న చెవులపిల్లులు నల్లబావ భోంచేస్తాడనితెలిసి బక్కోడు బాధపడుతుంటే, అతని బాధని చూడలేక వాటిని వదిలేసిన వసంతక్క  "...ఎరగం సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి..."  అంటూ ముసిముసిగా నవ్వుతూ నల్లబావకి సంజాయిషి ఇచ్చినప్పుడు రచయితలో ఉండే సున్నితమైన భావకుడు మనకంటిముందు కనిపిస్తాడు.

"కత్తోడు,పొండోడు,దిబ్బోడు,పొప్పోడు,కర్రోడు,బర్రోడు,ముద్దలోడు,పెగ్గోడు,గుండు పద్న …"  వీళ్ళంతా బక్కోడి స్నేహితులు. వీళ్ళందరితో కలిసి "  కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట,వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి " అంటూ రకరకాలా  ఆటలు ఆడేస్తూ పనిలోపనిగా అవి ఎలా ఆడాలో మనకి వివరిస్తాడు.

"అంబాలు, అంబాలి మీద కంబాలు, కంబాలు మింద కుడిత్తొట్టి, కుడిత్తొట్టిమింద ఆసుగోలు, ఆసుగోలు మింద యీసి గుండు, యీసి గుండు మింద అరిక చెత్త, అరిక చెత్తలో రేసుకుక్కలు"

"సింగార తోటలో బంగారు పొండు పండె, దాన్ని సింగి తినె, సింగారి తినె, చెల్లో చేప తినె, మందలో పొట్టేలి తినె, యెగిరే పిట్ట తినె, పొదిగే కోడి తినె, చెన్నాపట్నం చిన్నదాని చెంప చెళ్లుమనె".. అంటూ పొడుపుకథలు పొడుస్తాడు ఉనంట్లుండి.

ప్రతీకథలోనూ రచయిత తన హృదయంలోని భావాలను నేరుగా మన మన హృదయంలోకి ఇంజెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తూఉంటుంది. .

అప్పటి వరకు ఎంతో అందంగా కనిపించిన పెళయకావేరమ్మ ఒక్కసారిగ తన ఉగ్రరూపాన్ని కూడా చూపిస్తుంది "ఆడపోడుచు సాంగెం" కథలో.

తాత పెద్దగా చదువుకున్నోడుకాదు. కానీ లోకజ్ఞానం ఉన్నవాడు. "...అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము..." అంటూ ఆనాటి లెక్కలని వివరిస్తాడు.

"తెప్పతిరనాళ" కథలో నాన్న వైపు బంధువులతో కూడా కలుపుకునిపోవలసిన అవసరాన్ని కూడా తాత బక్కోడికి వివరిస్తాడు.అదే సమయంలో భర్తవైపు బంధువులంటే స్త్రీలో ఉండే వ్యతిరేక మనస్తత్వాన్ని అలాఅలా స్పృసిస్తాడు. అప్పటి వరకు సరదాగా సాగిపోయిన ఆకథలో తిరనాళ్ళకి బక్కోడి ఊరెళ్ళిన 'లోలాకు' పాత్ర ఒక్కసారిగ అంతం అయిపొయేసరికి హృదయం ఒక్కసారి మెలిపెట్టినట్లవుతుంది.


ప్రతికథలోనూ తాత ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది.చివరికి చిన్నపట్నుంచి తను ఆడుతూ పాడుతూ పెరిగిన పెళయకావేరమ్మ ఒళ్ళోనే తాత వొళ్ళెరగని నిదరపోవడంతోనే కథలుకూడా ముగిసి మరిచిపోలేని అనుభూతులను మనకు మిగులుస్తాయి..



ఇవన్నీ రచయిత స్వయంగా అనుభవించిరాయడం వల్ల అనుకుంటా చదువుతుంటే ఇవి కథలలా కాకుండా మనజీవితంలో గడచిపోయిన బాల్యం తాలూకూ అందమైన జ్ఞాపకాలలా  అనిపిస్తాయి.

                            నిజానికి ఇవి కథలుకావు ప్రళయకావేరి ప్రజల ఆత్మకథలు.