శనివారం, జనవరి 11, 2014

ప్రళయకావేరి...

చాలారోజుల క్రితం ఎదో పత్రికలో ఒక కథ చదివాను. కథపేరు "ఉత్తరపొద్దు". కథ ఎంత అద్భుతంగా ఉందో దాని కథనం, వాడిన భాష అంతకంటే అద్భుతంగా ఉన్నాయి. చిక్కని నెల్లూరు యాసలో సాగిపోయిన అచ్చతెలుగు కథ అది. కొన్ని పదాలను అర్ధం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డా  కథనడిపిన విధానం వల్ల ఆసక్తి  ఏమాత్రం  తగ్గలేదు.చాలాకాలం తర్వాత ఆకథ ప్రళయకావేరి కథల సంపుటంలోనిది అని ఎవరి దగ్గరో విని, ఆ పుస్తకం ఎలా సంపాదించాలి అని గూగుల్ బాబాయ్ ని అడిగితే డౌన్-లోడ్ చేసుకోవడానికి కినిగే వాళ్ళ సైటు చూపించాడు..రచయిత స.వెం.రమేశ్ గారు. వీరు తమిళనాడులో తెలుగుభాష పరిరక్షన గురించి కృషిచేస్తున్న స్వచ్చంద కార్యకర్త అనికొన్ని వెబ్-సైటుల ద్వారా తెలుస్తోంది.

అసలు ప్రళయకావేరి అన్న పేరే ఎంతో అందంగా అనిపించింది నాకు. ఇంతకీ ప్రళయకావేరి అంటే మనకి తెలిసిన పులికాట్ సరస్సు అసలుపేరు. అది దాదాపు నలభై దీవుల సమూహారం. వాటిల్లో ఒక దీవే ఇప్పటి మన శ్రీహరికోట.  ఆ దీవుల్లో ప్రజల జీవనవిధానం, ప్రళయకావేరి తో వారికికల అనుబంధం మొదలైనవి కథావస్తువుగా తీసుకుని రాసిన కథలవి. అక్కడ నివిసించే ప్రజలకి ఒక దీవినుంచి మరొకదీవీ వెళ్ళడానికి మోకాలు లోతు నీళ్ళు ఉండే ప్రళయకావేరిని నడకతో దాటుతూ వెళ్ళడడమే ఎకైక మార్గం. అలాదాటుతున్నప్పుడు వారిమధ్య నడిచే మాటలు, చలోక్తులు, దీవుల్లో ఉండే ఊర్లలో జరిగే రకరకాల సంఘటనల సమూహారమే ఈ కథలు. మొత్తం 21 కథల సంపుటం. "ఉత్తరపొద్దు" మొదలయ్యి "వొళ్ళెరగని నిదర" తో ముగుస్తాయి.

" తెల్లోళ్ళు ఉప్పుమీద పన్ను వేసినప్పుడు గాంధీగారి పిలుపునందుకుని  ఉప్పు ఉద్యమంలోకి దూకి , ప్రళయకావేరిని కాపాడుకున్న విషయం ఇప్పుడు గుర్తుకుతెచ్చుకునేవారేలేరు, ఇప్పుడసలు ప్రళయకావేరనే పేరేలేదు. పర్యాటకశాఖ  వారి రికార్డులలో ఇప్పుడున్న పులికాట్ -  పేరులోనూ,ఊరులోనూ తనదనం లేని ఉప్పుకయ్య.." అని బాధపడతాడు రచయిత ముందుమాటలో.

"అమ్మంటే కన్న తల్లే కాదు, అమ్మ బాస కూడా, అమ్మంటే అమ్మనేల కూడా" అనే విశ్లేషణ చదువుతూఉంటే రచయితకి భాషపై ఉన్న మమకారం, అపురూపంగా గుర్తుపెట్టుకున్న చిన్ననాటి జ్ఞాపకాలమీద ప్రేమ మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

ఈ కథలన్నీ బక్కోడు (అది మన రచయిత చిన్నప్పటి ముద్దుపేరు) అని పిలువబడే  ఒక బాలుడి అనుభవాల రూపంలో మనకి కనిపిస్తాయి. ఇవన్నీ బక్కోడు చిన్నప్పుడు శెలవలకి వాళ్ళ తాతగారిఊరు  జల్లెలదొరువు (ఇదికూడా ప్రళయకావేరిలో ఒక దీవే)వెళ్ళినప్పుడు జరిగిన ముచ్చట్లు, వాళ్ళ తాత చెప్పిన కబుర్లూను.


"...ఒరే అశ్విని,బొరణి,కిర్తిక,రోయిణి.. ఈ మాదిరిగా మనకి ఇరవై ఏడు కార్తిలుండాయిరా.దాంట్లో ఉత్తరకార్తి ఒకటి.ఈ ఉత్తరకార్తిలో సూరయ్య మన పెళయకావేరమ్మతో కూడతాడురా.వాళ్ళు కూడెడప్పుడు ఎవరైనా పెళయకావేట్లోకి దిగితే సూరయ్యకి కోపం వస్తాది. అందుకే ఎవరూ ఉత్తరపొద్దులో ఎవరూ పెళయకావేట్లో దిగరు ఒకవేళ తప్పనిసరై దిగినా సూరయ్యకి, పెళయకావేరమ్మకి తప్పు చెప్పుకుని దిగుతారు." ఈ మాటలు  చదువుతున్నప్పుడూ,  నిర్మలత్త పొంగుమీదున్న పెళయకావేరమ్మకి సారెపెట్టడానికి చేటలతో పసుపు కుంకుమ తీసుకుని వేళ్ళినప్పుడూ  పెళయకావేరమ్మతో అక్కడి ప్రజలకి కల మానసిక అనుబంధం గురించి తెలుస్తుంది.

కాశవ్వబాగోతం, పాంచాలి పరాభవం, పరంటిది పెద్దోళ్ళు కథలు పడిపడి నవ్విస్తే, పద్దినాల సుట్టం,తెప్పతిరనాళ, వొళ్ళెరగని నిదర కథలు చదువుతున్నప్పుడు కంటిమీద సన్నని నీటిపొర ప్రత్యక్షమై అక్షరాలు మసకబారతాయి.

పైన చెప్పుకున్నట్లు చాలాకథలు బక్కోడికి, తాతకి మధ్య జరిగే సంభాషనలే. ప్రళయకావేరికి వలసవచ్చే పక్షులని బక్కోడికి చూపిస్తూ    "...ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది  ఎర్రకాళ్ళ కొంగ……."    అంటూ వాటిరూపాల్ని మనకళ్ళకి కట్టినట్లు వర్ణిస్తాడు.

బక్కోడికి దాహంతో ప్రాణానికి ముప్పు వచ్చినప్పుదు తన చనుబాలిచ్చి రక్షించిన వసంతక్క, అమెభర్త నల్లబావ పాత్రలు కూడా ముఖ్యమైనవే.

  "... ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు.   తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి..."  అంటూ నల్లబావే బక్కోడికి ప్రళయకావేట్లోదొరికే చేపలని గురించి వివరిస్తాడు (సందమామ ఇంట్లో సుట్టం కథలో).

"..ఎండినప్పుడు సూడాల ప్రళయకావేరిని—ఎర్రటి యెండలో, మంచు పరిసినట్టు తెల్లంగా తళ తళ మెరుస్తుంటాది.  రేత్రిళ్లు తెల్లటి యెన్నిల వుప్పు మిందబడి యేడు వన్నెలతో తిరిగి పైకి లేచి పోతుంటాది....."  అంటూ వేసవిలో ఎండిపోయిన ప్రళయకావేరిని గురించి అందంగా వర్ణిస్తాడు.

 "అబయా నలగామూల దాటినాక ,పెళయకావేరమ్మకి సక్కల గిలెక్కువ. మునేళ్ళు అదిమిపెట్టినడవండి..." అని తాత చెప్తున్నప్పుడూ (కావేరమ్మకి చక్కెలగిలిట ),

"ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి. మింట యెగరతా
కొమ్మకొమ్మకీ రెమ్మరెమకీ యాలాడతా, గుంపులు గుంపులుగా లెక్కలేనన్ని మిణకర బూసులు (మిణిగురు పురుగులు)...." అన్నప్పుడు,

".....సందకాడ సన్నజాజి పూసినట్టు సన్నంగా నవ్వినాడు ఆ పిలగాడు......" అంటున్నప్పుడు,

రాత్రంతా కష్టపడి పట్టుకున్న చెవులపిల్లులు నల్లబావ భోంచేస్తాడనితెలిసి బక్కోడు బాధపడుతుంటే, అతని బాధని చూడలేక వాటిని వదిలేసిన వసంతక్క  "...ఎరగం సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి..."  అంటూ ముసిముసిగా నవ్వుతూ నల్లబావకి సంజాయిషి ఇచ్చినప్పుడు రచయితలో ఉండే సున్నితమైన భావకుడు మనకంటిముందు కనిపిస్తాడు.

"కత్తోడు,పొండోడు,దిబ్బోడు,పొప్పోడు,కర్రోడు,బర్రోడు,ముద్దలోడు,పెగ్గోడు,గుండు పద్న …"  వీళ్ళంతా బక్కోడి స్నేహితులు. వీళ్ళందరితో కలిసి "  కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట,వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి " అంటూ రకరకాలా  ఆటలు ఆడేస్తూ పనిలోపనిగా అవి ఎలా ఆడాలో మనకి వివరిస్తాడు.

"అంబాలు, అంబాలి మీద కంబాలు, కంబాలు మింద కుడిత్తొట్టి, కుడిత్తొట్టిమింద ఆసుగోలు, ఆసుగోలు మింద యీసి గుండు, యీసి గుండు మింద అరిక చెత్త, అరిక చెత్తలో రేసుకుక్కలు"

"సింగార తోటలో బంగారు పొండు పండె, దాన్ని సింగి తినె, సింగారి తినె, చెల్లో చేప తినె, మందలో పొట్టేలి తినె, యెగిరే పిట్ట తినె, పొదిగే కోడి తినె, చెన్నాపట్నం చిన్నదాని చెంప చెళ్లుమనె".. అంటూ పొడుపుకథలు పొడుస్తాడు ఉనంట్లుండి.

ప్రతీకథలోనూ రచయిత తన హృదయంలోని భావాలను నేరుగా మన మన హృదయంలోకి ఇంజెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తూఉంటుంది. .

అప్పటి వరకు ఎంతో అందంగా కనిపించిన పెళయకావేరమ్మ ఒక్కసారిగ తన ఉగ్రరూపాన్ని కూడా చూపిస్తుంది "ఆడపోడుచు సాంగెం" కథలో.

తాత పెద్దగా చదువుకున్నోడుకాదు. కానీ లోకజ్ఞానం ఉన్నవాడు. "...అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము..." అంటూ ఆనాటి లెక్కలని వివరిస్తాడు.

"తెప్పతిరనాళ" కథలో నాన్న వైపు బంధువులతో కూడా కలుపుకునిపోవలసిన అవసరాన్ని కూడా తాత బక్కోడికి వివరిస్తాడు.అదే సమయంలో భర్తవైపు బంధువులంటే స్త్రీలో ఉండే వ్యతిరేక మనస్తత్వాన్ని అలాఅలా స్పృసిస్తాడు. అప్పటి వరకు సరదాగా సాగిపోయిన ఆకథలో తిరనాళ్ళకి బక్కోడి ఊరెళ్ళిన 'లోలాకు' పాత్ర ఒక్కసారిగ అంతం అయిపొయేసరికి హృదయం ఒక్కసారి మెలిపెట్టినట్లవుతుంది.


ప్రతికథలోనూ తాత ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది.చివరికి చిన్నపట్నుంచి తను ఆడుతూ పాడుతూ పెరిగిన పెళయకావేరమ్మ ఒళ్ళోనే తాత వొళ్ళెరగని నిదరపోవడంతోనే కథలుకూడా ముగిసి మరిచిపోలేని అనుభూతులను మనకు మిగులుస్తాయి..ఇవన్నీ రచయిత స్వయంగా అనుభవించిరాయడం వల్ల అనుకుంటా చదువుతుంటే ఇవి కథలలా కాకుండా మనజీవితంలో గడచిపోయిన బాల్యం తాలూకూ అందమైన జ్ఞాపకాలలా  అనిపిస్తాయి.

                            నిజానికి ఇవి కథలుకావు ప్రళయకావేరి ప్రజల ఆత్మకథలు.