మంగళవారం, జనవరి 14, 2014

నేను, వాళ్ళు - ఓ హైటెక్ బస్సు


నాలుగో తరగతి చదువుతున్నప్పుడు దసరా శెలవలకి హైదరాబాద్ వెళ్ళి,తిరిగి వచ్చేటప్పుడు పెద్దమామయ్య మమ్మల్ని రైలులోకాకుండా, హైటెక్ బస్సులో పంపించాడు. అప్పటి వరకు బస్సు అంటే తాతగారింటికి వెళ్ళేటానికి ఎక్కే ఎర్రబస్సే. అది గతుకులతో నిండిన మట్టి రోడ్డుమీద యుద్ధవిమానమంత సౌండుచేసుకుంటూ రోడ్డుమీద దుమ్ముని కొంచెం తన మీదా మిగిలినిది లోపలకూర్చున్నవారిమీద రేపుకుంటూ తీసుకువెళ్ళేది. అప్పటివరకు  అటువంటి బస్సులో
ప్రయాణం చేసిననాకు ఈ బస్సు కొత్తగా అనిపించింది. ఈబస్సులో సీట్లు కూడా వెనక్కి ముందుకి వాల్చుకోవడానికి వీలుగా చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇంటువంటి బస్సుల్ని చూసినా ఎప్పుడూ ఎక్కక పోవడంవల్ల వాటిగురించి ఎక్కువగా అలోచించలేదు. .కాని ఆ ఒక్కరాత్రి
ప్రయాణం ఆ బస్సుకి నన్ను వీరాభిమానిని చేసేసింది.దానికితోడు ఆ బస్సులో సినిమాలు కూడావేశారు. ఇంక అప్పటివరకు నా జీవితాశయం అయిన సినిమాహాలులో ఆపరేటర్ ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి  ఆర్టిసి  బస్సులో
కండక్టర్ కావటమే నా జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నాను.

        ఇంటికి తిరిగివచ్చిన వెంటనే పక్కింట్లోఉండే కండక్టర్ మామయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి  అసలు మా ఊరి డిపోలో ఎన్ని హైటెక్కు బస్సులు ఉన్నాయా అని ఆరా తీశాను.మొత్తం రెండే ఉన్నాయిట. అందులో ఒకటి హైదరాబాదుకి రెండోది వైజాగుకి ఉంటాయని మామయ్య చెప్పాడు.అదికూడా బాగానేఉంది అనిపించింది. ఒకరోజు హైదరాబాదుకి రెండోరోజు వైజాగుకి మార్చి మార్చి డ్యూటీ వేయించుకోవచ్చు అనుకున్నాను. రెండురోజులకొకసారి మామయ్య దగ్గరకి వెళ్ళి వాటి యోగక్షేమాలు కనుక్కుని వచ్చేవాడిని. వారానికి ఒకసారి సాయంత్రంపూట అలా బస్-స్టాండుకి వరకూ వెళ్ళి నేను భవిష్యత్తులో ఉద్యోగం చేయబోయే బస్సుల్ని చూసుకుని వచ్చేవాడిని. ఒకసారి మాఊరినుంచి హైదరబాదు బయలుదేరిన బస్సుకి విజయవాడ దాటిన తరువాత ఎదో యాక్సిడెంట్ అయ్యిందని వార్త తెలిసింది. వెంటనే ఆందోళనగా మామయ్యదగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళాను. ఆయన వివరాలు కనుక్కునివచ్చి హైవేమీద స్పీడు ఎక్కువై డివైడర్ని ఢీకొట్టిందని, బస్సుకేమి కాలేదుగాని సడన్ బ్రేక్ వెయ్యడంవల్ల ఇద్దరికిమాత్రం గట్టిదెబ్బలు తగిలాయని చెప్పాడు. బస్సు క్షేమంగానే ఉందనడంతో నేను హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను.

        కొన్నిరోజులకి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కొందరు  మా ఊరినుంచి హైదరాబాదుకి హైటెక్-బస్సులు వేశారు. నా రొట్టెవిరిగి నేతిలో పడినట్లయ్యింది. ఉదయం పూట గోదావరిఒడ్దున బస్సుల్నిపెట్టుకుని డ్రైవర్లు, క్లీనర్లు కలిపి వాటిని కడిగేవారు.   రెండురోజులు అక్కడి వాళ్ళని బాగా పరిశీలించి కుదమట్టంగాఉన్న ఒక డ్రైవర్ని ఎంచుకుని వాడితో ఫ్రెండ్-షిప్ మొదలుపెట్టాను. వాడిపేరు  గుమ్మాల అప్పారావు.  ప్రతీరోజూ స్కూలు అయిపోయిన తర్వాత నాన్న దగ్గర చిల్లరడబ్బులు అడిగి తీసుకుని వెంకటేశం కొట్లో పకోడీలు కొనుక్కుని వెళ్ళి వాడికి నైవేద్యం పెట్టేవాడిని.దానికి ప్రతిఫలంగా వాడునాకు మా ఊరినుంచి పక్కఊరిదాకా బస్సులో ఫ్రీ గా ఎక్కే అవకాశం ఇచ్చేవాడు. కాకపోతే ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చోవాలి. ఎవరైనా లేచిపొమ్మంటే వెంటనే లేచిపోవాలి. అల్లరి చెయ్యకూడాదు అనే నిబంధనమీద. పక్కఊరిలో ఎక్కే పాసింజర్స్ కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేసిపెట్టేవారు, కనుక ఎప్పుడూ మనకి ఇబ్బంది ఉండేదికాదు.

       తిరిగి వచ్చేటప్పుడు ఎవరినైనా లిఫ్ట్ అడిగి వచ్చేసేవాడిని. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు తిరిగివచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్న ఒకాయన్ని లిఫ్ట్ అడిగాను. ఆయన లిఫ్ట్ ఇచ్చి సరాసరి ఇంటివరకు తీసుకుని వచ్చి దింపేశాడు. ఈయనకి మాఇల్లు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతోపాటు మనసు కొంచెం కీడుకూడ శంకించింది. హెల్మెట్ తీసిన తర్వాతచూస్తే ఆయన మా పక్కవీధిలో ఉండే అహోబిలం మామయ్య. ఎప్పుడూ గుమ్మడిలాగ సాత్వికంగా మాట్లాడే అహోబిలం మామయ్య ఒక్కసారిగా రాజనాలలాగా మారిపోయి నా గుట్టంతా ఇంట్లో చెప్పేశాడు. నా వీపు విమానం మోత మోగిపోఇంది. ఇంక ఆరోజు నుంచీ ట్రావెల్స్ ప్రయాణాలు బంద్ అయిపోయాయి.

       ఆ సంవత్సరం సంక్రాంతి శెలవలకి ఎప్పటిలాగే తాతగారి ఊరు వెళ్ళాము. అక్కడ చిన్నారివదినా, పండుబావ, అన్నయ్య ఇంకా నేను కలిసి పగలు రాత్రి తేడా లేకుండా ఆడుకున్నాము.చూస్తుండగానే శెలవలు అయిపొయాయి.
అయితే తిరిగి వచ్చేటప్పుడు చిన్న ఇబ్బంది వచ్చింది. శెలవలు అయిదు రోజులే ఇచ్చారు. అవి గురువారంతోటి అయిపోతాయి. శుక్రవారం ఒక్కరొజు స్కూలుకి వెళ్ళాలి, శనివారం సెకండు సాటర్ డే శెలవు వచ్చింది. ఈ ఒక్కరోజు స్కూలు మానేస్తే చక్కగా ఆదివారందాకా మనందరం కలిపి ఆడుకోవచ్చుకదా అంది వదిన. ఈ ప్రపోజల్ నాకు తెగనచ్చేసింది. కాని అన్నయ్య ఒప్పుకోలేదు. స్కూలుమానడం కుదరదన్నాడు పెద్ద వివేకానందస్వామి లాగ గోడకి ఆనుకుని నిలపడి. అమ్మకూడా వాడివైపే మాట్లాడింది. పనిలో పనిగా నన్ను,నాకు వచ్చిన మార్కులని ఇంకా ఈమధ్యకాలంలో హైటెక్కు బస్సు అభిమానంతో నేను చేసినపనులని గుర్తుతెచ్చుకుని మరీ దులిపిపారేసింది. నాకు మళ్ళీ మా రాజనాలగాడు గొర్తొచ్చి వాడిని నోటినిండా తిట్టుకున్నాను. అమ్మకి ఆవేశం ఎక్కువైపోయి రెండు అంటిస్తుందేమో అని భయం వేసింది, ఇంతలో మామయ్య అడ్డంవచ్చి అమ్మని ఊరుకోపెట్టాడు. పదకొండుగంటల బస్సుకి ప్రయాణంగా నిర్ణయించి అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. హమ్మయ్య ఒక గండం గడిచింది అనుకున్నాను. కాని అవమానభారంతో కంట్లో నీళ్ళు వచ్చాయి. వదిన, పండుబావా నన్ను ఇంటివెనకాల పాకలోకి తీసుకువెళ్ళి ఓదార్చారు.

ఇంతజరిగినా నాకు అప్పుడే వెళ్ళడం మాత్రం ఇష్టంలేదు. వాళ్ళిద్దరికి కూడా నన్ను పంపడం ఇష్టంలేదు. ఒరెయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడప్పుడే రావుకదరా అంది వదిన. అవునే మళ్ళీ వేసవి శెలవలదాకా రావడం కుదరదు అన్నాను నేను బాధగా మొహం పెట్టి. ఇప్పుడు నువ్వు ఆగిపోతే సాయంత్రం మనం అంతా కలిసి సైకిలుమీద సినిమాకివెల్దాంరా అన్నాడుబావ. వెల్దాంబావా ఊరువెళ్ళామంటే నాన్న ఇప్పుడప్పుడే సినిమాకి పంపరు అన్నాను నేను. అయితే ఎదోఒకలాగ ప్రయాణం ఆపేద్దామురా అన్నారు వాళ్ళిద్దరు. సరెనంటే సరే అనుకుని అక్కడే పాకలో కూర్చుని ప్రయాణం ఎలా ఆపాలి అని కుట్రలు చెయ్యడం మొదలుపెట్టాము. పదకొండు గంటల బస్సు తప్పిపోతే మళ్ళీ  పన్నెండు గంటలకి ఉంది. దాని తర్వాత మళ్ళి సాయంత్రమే. కాని సాయంత్రం ప్రయాణాలు మామయ్య ఒప్పుకోడు. కనుక ఈ రెండు తప్పించుకోగలిగితే ప్రయాణం వాయిదా వెయ్యచ్చని ప్లానులు వెయ్యడం మొదలు పెట్టాము. రకరకాల ప్లానులు ఆలోచించాము. చివరికి చిన్నారొదిన చెప్పిన ప్లాను  ఫైనలైజ్ చేసాము. దానిప్రకారం బస్సు మాస్టాపులోకి రావడానికి అయిదు నిముషాల ముందు నేను కడుపునొప్పి వస్తున్నట్లు  అభినయిస్తూ టాయ్-లెట్ లోకి దూరిపోవాలి మళ్ళి బస్సు స్టాప్ దాటినతర్వాతే బయటకి రావాలి.

అనుకున్న ప్రకారం మొహంలో రకరకాల ఫీలింగ్స్ అభినయిస్తూ టాయ్-లెట్ లో దూరిపోయాను. బయటకి వచ్చినా బస్సు అందే అవకాశం లేదు అనే ధైర్యం వచ్చిన తర్వాత బయటకి వచ్చాను. మా నాటకంలో మొదటి అంకం సక్సస్-ఫుల్ గా కంప్లీట్ ఇయ్యింది. ఇంక రెండో అంకంలో మా స్క్రిప్ట్ ప్రకారం బస్సు రావడానికి అరగంట ముందర నుంచి బోల్డంత కడుపునెప్పి వస్తున్నట్లు నటిస్తూ తగినంత గోల చెయ్యాలి.  

దానిప్రకారం నేను ఇంకోఅరగంట ఉందనగా నేను పొట్టమీద చెయ్యివేసుకుని మంచం మీదపడుకుని అభినయం మొదలు పెట్టాను. బావ, వదినా నాకు చెరోవైపునా కూర్చుని నన్ను ఊరుకో పెడుతున్నట్లు నాపొట్టమీద రాస్తున్నారు. మా వివేకానందుడు మాత్రం నా వైపు అనుమానంగా చూస్తున్నాడు. మా అమ్మకూడా కొంచెం అనుమానంగానే చూసిందిగాని ఇంతలో ఏమనుకుందో మా మామయ్య వైపు  తిరిగి సూరిబాబునిగానీ, రామంగారిని గాని పిలవరా, ఎదైనా మందుఇస్తారేమో అంది కొంచెం ఆందోళనగా మొహం పెట్టి. ఎంతైనా అమ్మకదా.

    వాళ్ళిద్దరూ ఆ గ్రామవైద్యులు. రామం తాత గారిది ఆయుర్వేదం ,సూరిబాబు తాతయ్యది ఇంగ్లీషు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. రామంతాతగారు అయితే తేనెలో కలుపుకుని వేసుకునే తియ్యటి మందులు ఇచ్చేవారు, అదే సూరిబాబు తాతయ్య అయితే చేదుఇంగ్లీషు బిళ్ళలు ఇచ్చేవాడు. అది చాలదన్నట్లు ఉన్నట్లుండి సూది,సిరంజి పట్టుకుని ఇంజక్షన్ చేస్తానని వెంటపడేవాడు. ఇంట్లో ఎక్కడ దాక్కున్నా పట్టేసుకునేవాడు. ఆయనబారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బాత్రూంలో దాక్కుంటే ఒక అయిదునిముషాలు ఆగి వెళ్ళిపోతున్నట్లు సీను క్రియెట్ చేసి, వెళ్ళిపోయాడన్న ధైర్యంతో మనం బయటకి వచ్చిన వెంటనే సడనుగా ఎదోఒక పక్కనుంచి వచ్చి గట్టిగా పట్టేసుకుని కసక్కుమని పొడిచేసేవాడు. అందుకే మామయ్య సూరిబాబు తాతయ్యని కాకుండ రామం తాతగారిని తీసుకుని రావాలని దేముడికి దండంపెట్టుకున్నాను. కానీ దేముడు నామాట వినలేదు.మామయ్య ఇలా బయలు దేరాడొ లేదో, ఎదో పెద్దపని ఉన్నవాడిలాగా సూరిబాబుతాతయ్యే ట్రింగు-ట్రింగు అని బెల్లుకొట్టుకుంటూ సైకిలు వేసుకుని వచ్చి ఇంటిదగ్గర ఆగాడు.నాగుండెలు జారిపోయాయి. వాణ్ణి బయటకి రమ్మనండి చూస్తాను వాడి సంగతి అన్నాడు. నేను భయం భయంగా బయటకి వచ్చాను. ఒకసారి నాపొట్టమీద అటుఇటూ నొక్కి అబ్బే ఎమీలేదు అజీర్తి చేసిఉంటుంది. సోడాతాగి ఓగంట పడుకోరా అన్నాడు. అమ్మవైపు తిరిగి ఇవాల్టికి ప్రయాణం ఆపై అమ్మాయ్, ఓగంటాగితే అంతాసర్దుకుంటుంది అన్నాడు. ప్రయాణం ఆగిపోయినిదానికంటే , ఇంజక్షన్ కార్యక్రమాలు ఎమీపెట్టనందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను యాక్టింగ్ కంటిన్యూచేస్తూ వచ్చి మంచమ్మీద పడుకున్నాను. వదినా,బావా నన్ను మెచ్చుకుంటున్నట్లు నవ్వారు. నేను లోపలికి వచ్చేసిన తర్వాత అమ్మావాళ్ళంతా బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాటలమధ్యలో సూరిబాబు తాతయ్య ఇందాక పదకొండుగంటలకి వెళ్ళినబస్సు మధ్యలో చెడిపోయిందని, దానిబదులు  ఈట్రిప్ హైదరాబాదు వెళ్ళే హైటెక్-బస్సు మనఊరు వేసారని అది ఇంకో పదినిముషాలలో వస్తుందని చెప్తున్నాడు. ఒక్కసారిగా నాకళ్ళు మిలమిలా మెరిసిపోయాయి. ఠపీమని లేచి కూర్చున్నాను. వదిన మనసుకి ఎదోకీడు శంకించిందేమో, ఒరెయ్  హైటెక్-బస్సుదేముందిరా ఎప్పుడైనా ఎక్కచ్చు, ఈఒక్కరోజు ఆగిపోతే మళ్ళీమనం రెండురోజులు కలిసి ఆడుకోవచ్చు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే మళ్ళీ ఎప్పుడోగానిరావు కదరా అంది. దానిదేముందే ఎలగో మళ్ళీ వేసవి శెలవలకి వస్తానుకదా అప్పుడు ఆడుకోవచ్చులే అన్నాను.  అందరూ ఒప్పుకున్నారు కదరా ఉండిపో సాయంత్రం మనం అందరం కలిసి సైకిలుమీద సినిమాకివెల్దాం అని ఊరించాడు బావ. ఈసారి వచ్చినప్పుడు వెల్దాంలేబావ అని వాడికి సమాధానం చెప్పాను.  వాళ్ళిద్దరు ఇంకా ఎదోచెప్తున్నారు. నేనదేం పట్టించుకోకుండా నాబ్యాగు తీసుకుని బయటకి వచ్చి కడుపునెప్పి తగ్గిపోయిందని ప్రకటించేశాను. మరింకేం బయలుదేరిపోదాం అన్నాడు మా వివేకానందుడు లోపలపెట్టిన బ్యాగులు బయటకి తీస్తూ. వదినా,బావా ఎదో అంటున్నారు. నేనదేం పట్టించుకునే స్థితిలోలేను, నా దృష్టంతా రాబోయే హైటెక్-బస్సుమీదనే ఉంది. ఎదో అలౌకిక స్థితిలో ఉన్నవాడిలాగా తిన్నగా స్టాపు దగ్గరకి నడిచాను.



2 కామెంట్‌లు:

ranivani చెప్పారు...

చాలా బావుంది . నవ్వుకునేలా, ప్రతీ ఒక్కరి బాల్యం లోనూ ఇలాంటి సంఘటన ఒకటి తప్పనిసరిగా ఉంటుందనుకుంటా. మంచి హాస్యరచన.

నాగశ్రీనివాస చెప్పారు...

@ నాగరాణి గారు : ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి