శనివారం, జనవరి 24, 2015

ఆ విధంగా చిన్నప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి



    సీతాకోకచిలుకలు కూడా కీటకాలే..నేను అయిదవ తరగతి లో ఉన్నప్పుడు మా మాష్టారు చెప్పిన పాఠం నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది..అప్పటి వరకూ నా దృష్టిలో  కీటకాలు అంటే గొంగళీ పురుగులు, ఈగలు, దోమలు మాత్రమే. మాపెరట్లో ఉన్న పూలమొక్కలమీద వాలుతూ రంగురంగుల్లో మెరిసిపోతూ ఉండే సీతాకోకచిలుకలంటే నాకు ఒకవిధమైన ఆరాధనాభావం. ఆకుల రంగులలో కలిసిపోతూ బుజ్జి బుజ్జి ఆకుపచ్చ సీతాకోకచిలుకలూ, నీలం,పసుపు మిశ్రమంతో అమ్మ అరచేయి వెడల్పున ఉండే పెద్దపెద్ద  సీతాకోకచిలుకలూ మా పెరట్లో పూలమీద తేనే తాగడానికి వస్తుండేవి. అవి ఆదమరిచి తేనె తాగుతున్నప్పుడు, ఒడుపుగా దాని రెండు రెక్కలూ పట్టుకుని వాటితో ఆడుకోవడం నాకు అప్పట్లో చాలా ఇష్టమైన ఆట. అటువంటి సీతాకోకచిలుకల్ని పట్టుకుని ఆయన ఇలా కీటకాల జాబితాలో కలిపి చెప్పడం, దానికి సాక్ష్యంగా  మా సైన్స్ పుస్తకంలో ఉన్న కీటకాల బొమ్మల చార్టులో నేను నమ్మే ఇతర కీటకాల బొమ్మలతో పాటుగా సీతాకోకచిలుకని కలిపి చూపించడం అప్పట్లో నా మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. మామాష్టారు ఇన్ని సాక్ష్యాలు చూపించినా, నాకు నమ్మ బుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మని అడిగాను.అమ్మకూడా నాకు అదేచెప్పింది, సీతాకోకచిలుకలకి ముందురూపం గొంగళీ పురుగులేననీ ఇందాకా మాష్టారు చెప్పిన పాఠం నిజమేననీ అమ్మ చెప్పడంతో, బాధగానైనా వాళ్ళు చెప్పింది నమ్మక తప్పలేదు.



    చిన్నప్పుడు నేను కొన్ని విషయాల్ని బలంగా నమ్మేవాణ్ణి. భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతే భూలోకం వస్తుందని, అక్కడ భూమాత ఉంటుందని నేనూ నా ఫ్రెండ్సు కూడా నమ్మేవాళ్ళం. బాగా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఆకాశం తగిలి కిందపడిపోతామని కూడా అనుకునేవాళ్ళం. :) ఆ నమ్మకాల చుట్టూ అందమైన ఊహలు అల్లుకుని బోల్డు ఆటలు ఆడుకునే వాళ్ళం. నేను కొబ్బరి మట్టమీద కూర్చుని రెక్కలున్న పంచకళ్యాణి గుర్రం మీద గాలిలో ఎగురుతూ రాక్షసుడిని చంపేసినట్లు ఊహించుకుంటూ, కొబ్బరి డొలకలతో కత్తుల కాతారావులాగ కత్తి యుద్దాలు చేసేవాడిని. ఒకసారి మళ్ళి ఆ సైన్సు మాష్టారే పాఠం చెబుతూ, కిందకి తవ్వుకుంటూ వెళ్తే నీళ్ళు పడతాయి తప్ప వేరే భూలోకం అంటూ ఎమీ ఉండదనీ, ఎంతపైకి ఎగిరినా వెళ్తూనే ఉంటాం తప్ప ఆకాశం తగిలి కింద పడిపోవడం అంటూ ఎమీ ఉండదనీ చెప్పి మళ్ళీ మా మనోభావాల్నీ ,నమ్మకాల్నీ గాయపరిచారు.

   ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మా దృష్టిలో మా లెక్కల మాస్టారు ఒక హీరో. మిగిలిన టీచర్లు అందరూ కూడా ఆయనంటే ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. మేము ఆయనకు తెలియని విషయంలేదు అని నమ్మేవాళ్ళం. కొన్ని నమ్మకాలకి ఆధారాలు అవసరంలేదు కదా. కానీ అయన ఒకసారి పాఠం చెబుతున్నఫ్ఫుడు ఒక లెక్క చెప్పడం ఆయనవల్ల కాలేదు. ఆయన ఆ విషయాన్ని నిజాయితీగా ఒప్పుకుంటూ ఎవరైనా పెద్దవాళ్లని ఆడుగుదాం అన్నారు. మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయనకు అన్నీ తెలుసునన్న మానమ్మకం దెబ్బతిన్నందుకు.