ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

సూది, సిరంజీ ఇంకా నేను నాఫ్రెండ్సు


   అసలిప్పుడైతే డాక్టరు అవ్వడానికితెగ కష్టపడిపోతున్నారుగాని ,డాక్టర్ కావడానికి సుళువైనదారి నేను చిన్నప్పుడే కనిపెట్టేశాను.తాతగారి ఊరు వెళ్ళినప్పుడు నేను కనిపెట్టిన ఫార్ములా మావయ్యలకిచెబితే వాళ్ళు బోల్డంత త్రిల్లైపోయారు. నా ఫార్ములా ప్రకారం డాక్టరు అవ్వడానికి ఎంబిబియస్  చదవవలసిన అవసరం లేదు. మనకి అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్తాము కదా,ఇక్కడ డాక్టర్ అంటే సూరిబాబు తాతయ్య అన్నమాట. అప్పుడు సూరిబాబు తాతయ్య ఏంచేస్తాడు మనంచెప్పినవన్నీవిని తర్వాత మనచెయ్యి పట్టుకుని చూసి ఈమందులు వాడించండి అని చీటీమీద మందుల లిష్టు రాసి నాన్నకి ఇస్తాడు కదా. అప్పుడు మనం మందులుతెచ్చుకుని వాడేసి, జ్వరం తగ్గిపోయినతర్వాత ఆ మందుల చీటీ దాచేసుకున్నామనుకోండి, మనకి  జ్వరానికి ఏమందులు వాడాలో తెలిసిపోయినాఅట్లేకదా...

అలాగే కడుపునొప్పివచ్చిందని, తలపోటువస్తోందని సూరిబాబు తాతయ్యకి అబద్దంచెప్పి మందులచీటీలు తెచ్చేసుకున్నామనుకోండి ఏరోగాలకి ఏమందులువాడాలో మనకి తెలిసిపోతుంది,అప్పుడు మనమే డాక్టరు అయిపోవచ్చు , అది నాప్లాను. ఊరినుంచి తిరిగివచ్చినతర్వాత స్కూలులో జంధ్యాలగాడికి, వేమూరి శివకి ఇంకా బూర్ల ఫణి గాడికి నా ప్లాను చెప్తే వాళ్ళంతా వాళ్ళుకూడా థ్రిల్ అయిపోయారు. ఇంక ఆరోజునుంచి మేమందరం కలిసి మందుల చీటీలు సంపాదించడం మొదలుపెట్టాము. ఇంక అరోజు నుంచి మానలుగురిపని ఒకటే, తెలిసినవాళ్ళలో గానీ, చుట్టాలలోగానీ ఎవరికైనా ఏదైన రోగం వచ్చింది అని తెలియడంపాపం వాడిదగ్గవాలిపోయి వాడికి వచ్చిన రోగం ఏంటి దానికి వాడువాడినమందులు ఏంటి అని కూపీలాగి అవన్నీ ఒక నోటుపుస్తకంలో రాసేసుకునేవాళ్ళం. ఇలాకొన్నిరోజులు గడిచిఫోయాయి.మాపుస్తకం బాగానే నిండుతోంది.అప్పుడప్పుడు మేమంతా కూర్చుని హాస్పటలు ఎలానడపాలి, పేషంట్లని అంటా మనదగ్గరకే రావాలంటే ఏంచెయ్యాలి అనేవిషయాలని తీవ్రంగా చర్చించేవాళ్ళం. చాలారోజులు చర్చించిన తర్వాత ఒక ప్రొటోకాల్ తయారుచేశాము. దానిప్రకారం, "....పేషంటు హాస్పటల్లోకి రాగానే ముందుగా వాడికి వచ్చినరోగం ఏంటో వాడినే అడగాలి, తర్వాత వాడి చెయ్యి అడిగితీసుకుని మణికట్టుదగ్గర మునివేళ్ళతో  కొంచెంసేపు పట్టుకుని కళ్ళుమూసుకోవాలి. ఎందుకో నాకూతెలీదు
కానీ సూరిబాబుతాతయ్య ఎప్పుడూ అలాగే చేస్తాడు, అందుకే నేనుకూడా అలాగేచెయ్యాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఇంక వాడిరోగం ఎమిటోమనకి తెలిసిపోయింది కనుక వాడు చూడకుండా మనపుస్తకం ఓపెన్ చేసి అందులో వాడికివచ్చిన రోగానికి ఏమందు ఉందోచూసేసి అది వాడికి వేరే చీటీమీద రాసిచ్చేస్తే సరిపోతుంది అంతే".

   "ఒక్కమందుల చీటీలేయిస్తే సరిపోదురా అప్పుడప్పుడు ఇంజక్షనులు కూడా ఇవ్వాలి అప్పుడే మంచి డాక్టర్ అవుతాం" అన్నాడు జంధ్యాల. అదీనిజమే అన్నట్లు ఫణి, శివ వాడిని సపోర్టు చేశారు.ఆలోచించి చూస్తే వాళ్ళు చెప్పిందికూడా నిజమే అనిపించింది. ఇంజక్షను చెయ్యాలంటే సూది, సిరంజీ ఉండాలి కదా ఇప్పటినుంచే అవన్నీ అముర్చుకుంటే అప్పుడప్పుడు ప్రాక్టీసు చెయ్యచ్చుకదా అనిపించింది. మాఅత్త వేరేఊళ్ళో హెల్త్ డిపార్ట్మెంటులో పనిచేసేది. అప్పుడప్పుడు శెలవలకి తనుఇంటికి వచ్చేస్తుందికదా అప్పుడు తను బయలుదేరేముందునాకు ఫోనుచేసి ఎంతీసుకురాను అని అడుగుతుంది కదా, అప్పుడునేను నాకు సిరంజి-సూది కావాలి అని అడిగాను. ఎప్పుడూ స్వీట్లు కావాలి,చాక్లెట్లు కావాలి అనిఅడిగే నేను ఈసారి కొత్తకోరిక కొరేసరికి అడిగేసరికి కొంచెం ఆశ్చర్యపోయినా తర్వాతరోజుకి నేనడిగినవాటితోపాటు స్వీట్లు కూడాతెచ్చింది. తను ఇంట్లోకి అడుగుపెట్టడమే ఆలశ్యం నేనుతన బ్యాగుమీద దాడిచేసాను నాక్కావలసినవాటికోసం. సిరంజి తెచ్చింది గాని దానికిసూదిలేదు. "ఆ సూది ఎవరికైన గుచ్చుకుందంటే లేనిపోని గొడవలు సిరంజితో ఆడుకో చాలు" అంది అత్త నావైపు చూస్తూ. నేను ఏడుపుమొహం పెట్టానుగానీ తనేమీపట్టించుకోలేదు. సూదిలేని సిరంజితో ఎలా ప్రాక్టీసుచెయ్యడమో నాకు అర్ధంకాలేదు. ఆమొండి సిరంజి నాకు కిరీటంపోగొట్టుకున్న మహారాజులాగా కనిపిస్తోంది.  దానికి ఎలగైనా కిరీటం సంపాదించాలని ఆక్షణంలో నేను నిర్ణయించుకున్నాను.

     తాతగారి ఊరులో సూరిబాబు తాతయ్య ఉన్నట్లే మాఊరికి కూడా ఒక సూరిబాబు తాతయ్య ఉన్నాడు. ఆయనపేరు సాంబమూర్తి తాతయ్య . చెప్పానుకదా సూరిబాబు తాతయ్య అంటే డాక్టరని.  సాంబమూర్తి తాతయ్య దగ్గరకూడా సూదిసిరంజి ఉండేవి. ఆయనదగ్గర ఒక చిన్న అల్యుమినియం రేకుపెట్టే ఉండేది. దానిలో ఆయన అరచేతిమందంగా దూది పరిచి, దానిమీద చీర ఉయ్యాలలో పాపాయిని పడుకో పెట్టినంత జాగ్రత్తగా సూదిసిరంజి పెట్టుకుని మళ్ళీ దానిపైన  ఒక పొర దూదిపరిచేవారు. ప్రతీఆదివారం ఆయన నాన్నతో కబుర్లుచెప్పడానికి ఇంటికివచ్చేవారు.  ఆవారం ఇంటికివచ్చినప్పుడు నేను ఆయన పక్కనేచేరాను. ఒక్కక్షణం అవకాశంవస్తే ఆపెట్టెలోంచి సూదికొట్టేయ్యాలని నాప్లాను. ఆయనకేదో అనుమానం వచ్చినట్లుంది నేను పక్కనచేరడంచూసి పెట్టెఉన్నబ్యాగుని తీసుకుని ఒళ్ళోపెట్టుకున్నారు. నాప్రాణం ఉసూరుమంది. ఈలోపు నాటైంకలిసివచ్చి అమ్మ టిఫినుతీసుకునివచ్చింది.వాళ్ళు టిఫినుచేసి చేతులు కడుక్కోవడానికి పెరట్లోకివెళ్ళిన గ్యాపులో ఆయన పెట్టేలోంచి సిరంజిలేపేసి క్షణంలో అక్కడనుంచి మాయమయిపోయాను.

 తర్వాతిరోజు స్కూలుకివెళ్ళి నాముగ్గురు ఫ్రెండ్సుకి కిరీటంతోకూడిన సిరంజిని చూపిస్తే వాళ్ళు నన్ను తెగమెచ్చేసుకున్నారు. ఇంక అప్పుడు అసలుకథ మొదలయ్యింది.  సూది-సిరంజీ ఎదోఒకలాగా సంపాదించాం గాని పొడవడం ప్రాక్టీసుచెయ్యడానికి ఒక పర్సనాలిటీ కావాలికదా, ఎలాగా అని ఆలోచిస్తుంటే  శివ ముందుకి వచ్చాడు ఇంజక్షను చేయించుకోవడానికి. దానికి ప్రతిఫలంగా మేముప్రతీరోజూ  స్కూలుఇంటర్వెల్లో కొనుక్కుని పంచుకునే చాక్లెట్లలో మేజరువాటాతనకి ఇచ్చే ఒప్పందమ్మీద.  ఇంతలో మాక్లాసులో ఎదో కలకలం మొదలయ్యింది. ముందు బెంచీలో కూర్చునే రాకేషుగాడి లెక్కలు పుస్తకం ఎవరో దొంగతనం చేసారుట. మాష్టారు క్లాసులో అందరి బ్యాగులు వెతకమన్నారు. లెక్కలపుస్తకం దొరకలేదుగాని నా బ్యాగులో సిరంజి దానికీరీటం మాత్రం ఆయన కంటపడిపోయాయి. ఆయన పెద్ద డిటెక్టివ్ లాగా అవి ఇక్కడకి ఎందుకువచ్చాయో ఆరాతీసి తర్వాత పేక బెత్తంతో నన్ను నాఫ్రెండ్సుని ఏకేసి ఇంకాచాలదన్నట్లు సాయంత్రం తిన్నగా ఇంటికివచ్చి "మీవాడండీ...."  అంటూ అమ్మానాన్నలకి ఆవిషయం చెప్పేసారు. నాఖర్మకాలి అదేటైముకి సాంబమూర్తి తాతయ్యకూడా ఇంటిదగ్గరే ఉన్నారు. ఆయన నావైపు కోపంగా చూస్తూనే తప్పిపోయిదొరికిన పిల్లవాడిని దగ్గరకి తీసుకున్నంత అపురూపంగా సూదిని నాదగ్గరనుంచి తీసుకుని ఆయన పెట్టెలో దాచేసుకున్నారు. ఇంక తర్వాత స్కూలు దగ్గర అయిపోయిన బాదుడు కార్యక్రమం ఇంటిదగ్గర కంటిన్యూ అయ్యింది.  ఆదెబ్బకి మేము డాక్టరు కార్యక్రమాలన్నీ పెద్దయిన తర్వాతకి వాయిదావేసుకుని మాసాధారణ కార్యక్రమాల్లో మునిగిపోయాం.

బుధవారం, ఫిబ్రవరి 19, 2014

ఉచిత ఇంటర్నెట్ సౌకర్యానికి సిద్దంకండి.ప్రపంచమ్మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్ అనే సాలెగూడులో చిక్కుకునిఉంది.  రకరకాల ఆఫర్లతో సర్విసు ప్రొవైడర్లు మనల్ని ఊరిస్తూఉంటారు. ఉదయం లేచినదగ్గరనుంచీ రాత్రి పడుకునేవరకు మూడొంతులు పనులన్నీ ఆన్-లైన్ ద్వారా చేసుకోవడానికి అలవాటుపడిపోయినమనం నెలకి ఎంతోకొంత పేచేస్తూ పర్సుఖాళీ చేసుకుంటున్నాం.  కేబుల్ టీవీ,కరెంటు బిల్లు లాగానే మంత్లీబడ్జెట్లో ఇంటర్నెట్ బిల్లుకికూడా స్థానం ఇచ్చేశాం. అయితే ఇంకొక్క సంవత్సరం ఓపికపడితే మనబడ్జెట్లోంచి ఇంటర్నెట్ బిల్లు బరువు తగ్గించేస్తాను అంటోంది అమెరికాకి చెందిన
'మీడియా డెవలప్ మెంట్ ఫండ్' 
అనే సంస్థ. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటర్ నెట్ ఉచితంగా అందుబాటులోకి తేవడమే తన లక్యంగా ప్రకటించిందీసంస్థ. ఈ ప్రాజక్టుకి 'ఔటర్ నెట్' గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా  'క్యూబ్ శాట్స్' అని పిలవబడే చిన్నచిన్న శాటిలైట్లను వందల సంఖ్యలో భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ శాటిలైట్లతో ఇంటర్నెట్ ను ఫోన్లూ, కంప్యూటర్లు తదితర వస్తువులకు కనెక్ట్ చేస్తారు. ఆ శాటిలైట్ తరంగాల ద్వారా భూమ్మీద ఉన్న గాడ్జెట్స్ అన్నిటికీ ఉచితంగా నెట్ సౌకర్యం అందుబాటులోకి

వస్తుంది. ఇంట్లో మనం ఉపయోగించే  'వైఫై' లాగానే ఈఔటర్ నెట్ అనేది ప్రపంచస్థాయి 'వైఫై' అన్నమాట. ఇంటర్నెట్ మీద ఆంక్షలు ఉన్న చైనా,నార్త్ కొరియా వంటిదేశాలలోకూడా అప్పుడు ఆంక్షలురహిత ఇంటర్నెట్ వాడుకోవచ్చు అన్నమాట.2014 సెప్టెంబర్ లో ఈ ఔటర్ నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్పేస్ స్టేషన్ లో ప్రయోగించాలని ఈ సంస్థ నాసాను కోరనుంది. బహుశా 2015నాటికి ఈసౌకర్యం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావచ్చు.  కాకపోతే గూగుల్, ఫేస్-బుక్ వంటి తమదేశానికిచెందిన సంస్థల్ని అడ్డంపెట్టుకుని ప్రపంచదేశాల పౌరుల పర్సనల్డేటాని టెరాబైట్లకొద్దీ సేకరించి తనవద్ద దాచుకున్న అమెరికాకు చెందిన సంస్థ ఈ సేవని అందిస్తాను అని చెప్తుండడంతో ఇంటర్నెట్ పై ఆధిపత్యం కోసం అమెరికా ఆడుతున్న ఆటగా కొంతమంది సందేహిస్తున్నారు.

సోమవారం, ఫిబ్రవరి 03, 2014

నేనుకూడా నవ్వుతాను.....

  "you all laugh because i am different....,

         .....I laugh because you are all the same...."