మంగళవారం, డిసెంబర్ 30, 2014

నూటికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చినా మాకోదండానికి తిట్లు తప్పలేదు....

           

నేను 8వ తరగతిలో ఉన్నప్పటిమాట. మధ్యాహ్నం ఆఖరి క్లాసు జరుగుతోంది. వేదాంతం మాస్టారి క్లాసు. మ్యాథ్స్ సబ్జక్ట్. మాఅందరికీ ఆయనని చూస్తేనే భయం అందుకే అల్లరిచేసే సాహసం చేసేవాళ్ళం కాదు. అంతకు కొన్నిరోజుల క్రితమే క్వార్టర్లీ పరీక్షలు జరిగాయి. క్లాసులో పరీక్ష పేపర్లు ఇస్తున్నారు.అందుకని ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాం. క్లాస్ లీడర్ పేరు పెట్టి ఒక్కొక్కరినీ పిలుస్తుంటే, మాస్టారు రూళ్ళకర్రతో మరోవైపు నిలపడి ఫెయిలు అయినవాళ్ళకి అక్కడే బడితపూజ చేస్తున్నారు. అందరి పేపర్లు ఇచ్చేశారు గానీ కోదండంగాడి పేపరు ఆకట్టలో లేదు. మాస్టారుకి కూడా ఎలా మిస్ అయ్యిందో అర్ధంకాలేదు.  ఆయనకూడా బుర్రగోక్కుంటూ… ” ఈసారి మీపేపర్లు నేను దిద్దలేదురా, హెడ్మాస్టారు దిద్దారు. ఆయనగదిలోనే పడిపోయి ఉంటుంది, ఉండు నేను వెళ్ళి చూసివస్తాను …” అని  బయలుదేరబోతూ ఇంతలో ఎదో గుర్తొచ్చినట్లు ఆగి,
"అయినా నీకొచ్చే మార్కుల సంగతి నాకు తెలియదా పట్టు చెయ్యి…"  అని కొట్టబోయారు.
దాంతో అప్పటివరకూ మామూలుగానే ఉన్న మావాడికి ఒక్కసారిగా ఉక్రోషం పొడుచుకు వచ్చి, సార్ నన్ను కొట్టకండి, నేను ఈసారి పరీక్షలు బాగా రాశాను, ఖచ్చితంగా పాసు అవుతాను అన్నాడు.
వాడిమాటలకి మాస్టారు ఒక్కసారిగా షాకయిపోయారు, వాదు అంత కాంఫిడెంటుగా మాట్లాడాడం చూసి మేము కూడా థ్రిల్లయిపోయాము.
ఒక్క సెకను ఆయన వాడివైపు అలాగే చూసి … " అవునా.. అయితే  పేపరు చూసిన తర్వతే చెప్తానీసంగతి…" అంటూ హెడ్మాస్టారి గదివైపుకి వెళ్ళబోయారు.
ఇంతలో హెడ్మాస్టారే అటువైపుకి వచ్చారు వాడిపేపరు పట్టుకుని. మాస్టారూ నేనే వాడీపేపరు తర్వాత ఇద్దామని ఆపానండీ అన్నారు 
".. ఆవునా,ఎందుకండీ…?? ఇంతకీ ఇంతకీ మావాడికి ఎన్నీమార్కులు వచ్చాయండీ..." అనడిగారు బెత్తం సరిచేసుకుంటూ.
"….నూటికి తొంభై ఎనిమిది…"
"అవునా …" అన్నారు నమ్మలేనట్లు.
ఇంతలోనే తేరుకుని “నేను చెప్పినవన్నీ కష్టపడిచదివినట్లున్నాడండీ వెధవ అందుకే అంత కాంఫిడెంటుగా మాట్లాడాడు…” అన్నారు గర్వంగా మొహంపెట్టి. 
కోదండం గాడుకూడా ఆయనవైపు గర్వంగా చూశాడు.
"కష్టపడడమా పాడా వెధవ కాపీకొట్టాడండి…" హెడ్మాష్టారు గర్జించారు.
అదిరిపడ్డాడు మావాడు.
ఉల్లిక్కిపడి చూశారు వేదాంతం మాష్టారు.
"ఏరా నేను చెప్పేదినిజమేనా …"
"…….. లేదండీ"… అన్నాడు చాలా కష్టంగా నోరు పెగల్చుకుని.
"నువ్వు అబద్దం చెప్తున్నావ్…" హెడ్మాష్టారు…
"…" మావాడు ఇంకా బిక్క చచ్చిపోయాడు.
"వెధవ.. పనికిమాలిన వెధవ … చెప్పినవి చదవడం ఎలాగో రాదు, కనీసం కాపీ  కొట్టాడంకూడారాదు..”
"ఇంతకీ ఏంజరిగిందండీ…" వేదాంతంగారు.
మీరే చూడండి అంటూ పేపరు ఆయనచేతికి ఇచ్చారు.
అవి చూసిన మాష్టారు భళ్ళున నవ్వేశారు.
ఇంతకీ ఎంజరిగిందంటే మావాడు నిజంగానే పరీక్షలలో స్లిప్పులు పెట్టి విజయవంతంగా రాసేశాడు, కానీ బాగా రాసిన ఆనందంలో చూసుకోకుండా స్లిప్పులు కూడా కలిపి కట్టేసి పేపర్లు ఇచ్చేశాడు, అడ్డంగా దొరికిపోయాదు. అదీసంగతీ.
కోపం, నవ్వు కలిసిపోయిన మొహంతో మావాడివైపు చూశారు మాష్టారు.
కానీ అప్పటికే మావాడు టెన్షన్ తో బిగుసుకుపోయాడు. వాడి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది.
వాళ్ళముగ్గురినీ అలాచూస్తున్న మాకు కూడా నవ్వు ఆగడంలేదు. కానీ గట్టిగా నవ్వితే మాకుకూడా ఎక్కడా వడ్డిస్తారో ఆపుకుంటూ కూర్చున్నాం.
వాడిపరిస్థితి చూసిన ఆయనకికూడా ఇంక కొట్టడం అనవసరం అనిపించిందేమో ” ఫో వెధవా ఇంకెప్పుడైనా ఇలాచేశావంటే కాళ్ళు విరగ్గొట్టేస్తాను” అన్నారు.
వాడు బ్రతుకుజీవుడా అనుకుంటూ అక్కడనుంచీ జారుకున్నాడు.
ఇంతలో క్లాసు కంప్లీట్ గంట కొట్టడంతో మాష్టార్లిద్దరూ కూడా నవ్వుకుంటూ అక్కడనుంచీ వెళ్ళిపోయారు.
*****************************************************
చిన్నప్పుడు కాపీకొట్టి చదివినా మావాడు తర్వాత కష్టపడి చదివాడు. ఇప్పుడు వాడు ఐబిఎంలో సీనియర్ సాఫ్ట్-వేర్ ఇంజనీర్. మొన్నీమధ్య కలిసినప్పుడు మాటల మధ్యలో ఈవిషయం జ్ఞాపకంవచ్చి హాయిగా నవ్వేసుకున్నాం.