గురువారం, సెప్టెంబర్ 11, 2014

మాఊరి గోదావరి సాక్షిగా ఒక డాక్టర్ గారి పశ్చాతాపం



ఆరోజెందుకో  గోదారి ప్రశాంతంగా ఉంది. గాలిబాగానే ఉందిగానీ నదిలో పెద్దగా అలలులేవు. అప్పుడప్పుడు ఏ అంతర్వేది వెళ్ళే లాంచీనో ,చేపలబోటో వెళ్ళినప్పుడు కెరటాలు  కొంచెం కనిపిస్తున్నాయి



నేను గోదావరి గట్టు మెట్లమీద కూర్చుని నావెంట తెచుకున్న తుమ్మకర్రలతో వికెట్లు తయారుచేస్తున్నాను. మా బ్యాచ్ లో అందరికీ క్రికెట్ ఆడే పిచ్చి ఉందిగానీ ఆడడానికి అవసరమైన ఆయుధాల కిట్  మాత్రం శివ ఒక్కడిదగ్గరే ఉండేది.అదిమేము వాడుకోవడానికి వాడు కోరే గొంతెమ్మకోరికల లిష్టు మాత్రం చాలా పెద్దదిగా ఉండేది. బ్యాటు వాడుకోవాలంటే, గట్టిగా బ్యాటు పట్టుకోవడం రాకపోయినా వాడికే ఫష్టు బ్యాటింగ్ ఇవ్వాలి, అవుటయినా ఒకపట్టాన ఒప్పుకునేవాడుకాదు. బాలు,వికెట్లు ఇవ్వాలంటే ముందు వాడికే బౌలింగ్ ఇవ్వాలి. ఓవరుకి 6 బాల్సు కంప్లీట్ చెయ్యడానికి వాడు దాదాపు పన్నెండు నుంచి పదిహేను బాల్సు వేసేవాడు. ఏమైనా అంటే వాడెక్కడ అలిగి బాలు,బ్యాటు పుచ్చుకుని వాకౌట్ అంటాడోఅని చచ్చినట్లు వాడిని భరించేవాళ్ళం. అదిచాలదన్నట్లు మ్యాచ్ అయిపోయినతరువాత మాఅందరినీ కూర్చోపెట్టి మేము ఎవరం లేనప్పుడు వేరే టీం తో జరిగినా మ్యాచ్ లో తను ఎన్ని సిక్సులు కొట్టాడో, ఎంతమందిని ఫష్టు బాలుకి అవుటు చేశాడో కథలుకథలుగా వివరించి చెప్పేవాడు. అవి అబద్ధాలు  అనితెలిసినా చచ్చినట్లు నమ్మినట్లు నటించవలసి వచ్చేది. వాడి ఆటనిని భరించడంకంటే కంటే ఇలా నటించడం ఇంకా పెద్ద టార్చర్ లా అనిపించేది మాకు. ఇంక  వీడితో వేగడం మాతో కానిపని అని అర్ధం అయ్యిన తర్వాత, మేమే సొంతంగా కిట్టు కొనుక్కుందామని నిర్ణయించుకుని,ఇంట్లో వాళ్ళని డబ్బులడిగితే ఇవ్వడం మాట పక్కన పెట్టి రివర్సులో మాకు క్వార్టర్లీలో ఎన్ని మార్కులొచ్చాయి,హాఫెర్లీలో ఎన్ని మార్కులొచ్చాయి ఆరాలుతియ్యడం మొదలు పెట్టారు. వీళ్ళని డబ్బులడగడం మాదే తప్పని అర్ధమైన తరువాత మేమే సొంతంగా కిట్టు కొనుక్కుందామని నిర్ణయించుకుని, పాకెట్ మనీ పోగేస్తే బ్యాట్,బాల్  కొనగలిగాముగానీ వికెట్లకి డబ్బులు సరిపోలేదు. అందుకని అవి సొంతంగా తయరుచేసుకోవాలని నిర్ణయించుకుని ఇలా తుమ్మ కర్రలేసుకుని గోదారి గట్టుమీదకూర్చున్నాను. అతడు సినిమాలో చెప్పినట్లు ‘గులాబీ మొక్కకి అంటుకడుతున్నంత’ ఓపిగ్గా చెక్కుతున్నాను, ఇంతలో ఎవరో కొంచెం దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్నమాటలుఎవో వినిపించీ వినిపించకుండా వినిపిస్తున్నాయి. అప్పటివరకూ సీరియస్ గా పనిచేసుకుంటున్న నన్ను తెరలు తెరలుగా వినిపిస్తున్న వాళ్ళమాటలు అకర్షించాయి. నేను సగంసగం  చెక్కిన వికెట్లని పక్కనపెట్టి ,కూర్చున్న మెట్టుమీంచి రెండుమెట్లు పైకి ఎక్కి వాళ్ళకి దగ్గరగా కూర్చున్నాను. ఇప్పుడు కొంచెం స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు.

 వాళ్ళిద్దరిలో ఒకాయన బాగా పెద్దవాడు,రెండవాయన మధ్య వయస్కుడు.
"అప్పు డు నేను తప్పుచేశానోయ్...." అన్నాడు ఆ పెద్దాయన.
"పోనీలెండి ఇప్పుడవన్నీ తలుచుకుని ఏంలాభం, వదిలేయండి..." అన్నాడు రెండవాయన.

ఇంతలో గాలిహోరు ఎక్కువై మాటలు మొత్తం సరిగ్గావినిపించలేదు .వాళ్ళు దేనిగురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుసుకోవాలనా కుతూహలం మొదలయ్యింది నాలో... అసలు పనిపక్కనపెట్టి ఇంకొంచెం దగ్గరకి జరిగి కూర్చున్నాను. వినిపించిన మాటల్ని బట్టి ఆ పెద్దాయన ఒక డాక్టర్ అని ఇక్కడ కూర్చున్న రెండవ ఆయన అక్కకి ఒకప్పుడు ఆయన వైద్యం చేశాడని, కానీ ఆమె చనిపోయిందని అర్ధమైంది.

"అప్పట్లో నేను కొంచెం నిర్లఖ్యంగా ఉండేవాడినోయ్, అందరినీ సమానంగా చూసేవాడిని కాదు….. ఒకడాక్టరుగా అది నావృత్తి ధర్మానికి విరుద్ధం."

"........." ఇవతలివైపాయన ఎమీమాట్లాడాలేదు.

"అప్పటికీ మీఅమ్మగారు రెండు సార్లు వచ్చి పిల్లని చూడమని అడిగారు, నేనే సరిగ్గా పట్టించుకోలేదు, పట్టించుకునే సమయానికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది..." ఆయనగొంతులో  కొంచెం బాధ ధ్వనించింది.
"..."
"ఇప్పుడు ఇంతవయసొచ్చిన తరువాత చచ్చేముందు ఆవిషయం గుర్తుకువస్తే మనసంతా వికలం అయిపోతోంది, ఆరోజే  నేను ఆ పిల్లకి సరిగ్గా వైద్యం చేసి ఉంటే ఈరోజు మీఇల్లు చక్కగా మీఅక్క పిల్లలతో పచ్చగా కళకళాలాడుతూ ఉండేది...".

కొంచెంసేపు ఇవతలాయన ఎమీమాట్లాడలేడు.

ఒక పదినిముషాల తరువాత నెమ్మదిగా అన్నాడు "పోనీలెండి ఇప్పుడు ఆ పాత విషయాలానీ తలుచుకుని ఏంలాభం, పోయిన పిల్ల ఎలాగో తిరిగిరాదు కదా. మీరింక ఆవిషయం వదిలేసి ప్రశాంతంగా ఉండండి..."

"కానీ ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా, గుండెల్లో ముల్లుగుచ్చుకున్నట్లవుతోందయ్యా.. పోయేకాలం  ముంచుకువస్తోంది కదా బహుశా పాపభీతికాబోలు.....!!!!! " అన్నాడు.

"…. నలభై ఏళ్ళక్రితం మాట, అసలు తను ఎలా ఉండేదో కూడా నాకు గుర్తులేదు. ఋణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. పోవాలని రాసిపెట్టిఉన్నప్పుడు మనం మాత్రం ఏంచెయ్యగలం,... నాకుఊహ తెలిసినప్పటినుంచి మాఇంట్లో అందరికీ రాత్రి పగలు అనిచూడకుండా ఎప్పుడు పిలిచినా వచ్చి వైద్యం చేస్తున్నారు,ఆగౌరవం మీమీద మాకు ఎప్పుడూ ఉంటుంది, ఇంకా ఈ పాతవిషయాలన్నీ తలుచుకుని మనసు పాడు చేసుకోకండి.." అన్నాడు అనునయంగా.

కొంచెం విశ్రాంతిగా తలూపాడు ఆ పెద్దాయన.



ఇంతలో సాయంత్రం అయ్యింది. గోదారిగాలిలో చలిపెరిగింది. వాళ్ళిద్దరూ నెమ్మదిగాలేచి నడుచుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. నేనుకూడా నాపని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి