శుక్రవారం, ఏప్రిల్ 11, 2014

బాల్యం - ఒక అందమైన జ్ఞాపకం


బాల్యం, ప్రతివ్యక్తి జీవితంలోనూ అందమైన జ్ఞాపకం.   నెమలికన్ను పుస్తకంలో దాచుకుని ప్రతిరోజూ దానికి  మేతవేస్తే అది కొన్ని రోజులకి పిల్లల్ని పెడుతుందని నమ్మే అందమైన అమాయకత్వం బాల్యంలోనే సాధ్యమవుతుందేమో. ఒక్కసారి గడిచిపోయిన రోజుల్నితడిమిచూసుకుంటే , చిన్నప్పుడు చేసిన్ ఎన్నో తిక్కపనులు, సరదా సంగతులు అప్రయత్నంగా చిరునవ్వురూపంలో పెదవులమీదనుంచి బయటకి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది,అలాంటి ఒకసరదా జ్ఞాపకమే ........

నేను ఐదోక్లాసు పరీక్షలు రాసేసమయానికి మా అన్నయ్య, పండుబావ ఎడోక్లాసు పబ్లిక్ పరీక్షలు రాశారు. ఇప్పటికి కొన్నిసంవత్సరాల క్రితం వరకు ఎడోక్లాసుకి కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవికదా, అవన్నమాట. అప్పటివరకు తోపుడు బండిలా క్లాసులనీ నెట్టుకుంటూ వచ్చేసినా ఎడోక్లాసుకి కచ్చితంగా పాసవ్వాల్సిన పరిస్థితి.
వీళ్ళు పరీక్షలు రాసినరోజునుంచి అమ్మకి,నాన్నకి,మామయ్యకి,అత్తకి అందరికి టెన్షను. ఏటెన్షను లేనిది ఇద్దరికే, అన్నయ్యకి, బావకి. ఇద్దరికి వాళ్ళరిజల్ట్స్ ఎలాఉంటాయో ముందేతెలుసు, కనుక హాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు.

   ఆసంవత్సరం శెలవలకి పండుబావా చిన్నారి వదిన మా ఇంటికొచ్చారు. ఇంక రిజల్ట్స్ రోజు రానేవచ్చింది. ఆరోజు అమ్మ మమ్మలందరిని ఉదయాన్నే నిద్రలేపి రడీచేసి గుడికి తీసుకుని వెళ్ళింది.  కొబ్బరికాయ కొట్టించి మాందరికి తలోఒక రూపాయి ఇచ్చి హుండీలో వెయ్యమంది. లాజిక్కు ప్రకారం చూస్తే పబ్లిక్ పరీక్షలు రాసింది అన్నయ్య,బావ కనుక వాళ్ళు వెయ్యాలి కానీ నేను వెయ్యవలసిన అవసరం లేదనిపించి  అమ్మ చూడకుండా ఆరూపాయని నా లాగూ జేబులో వేసుకున్నాను. అందరం కలిసి ఇంటికివచ్చేశాము. మేము ఇంటికి చేరేటైముకి నాన్న బజారుకివెళ్ళి పేపరు తీసుకునివచ్చి మాకోసం రడీగా కూర్చుని ఉన్నారు గుమ్మందగ్గర.

హాల్-టిక్కెట్లు తెచ్చి పేపర్లో ఇద్దరి నంబర్లు చూసింది అమ్మ. అప్పటి మాఅందరిమొహాల్లోనూ ఇప్పటి మొగలిరేకులు సీరియల్ చూస్తున్నంత టెన్షన్. అమ్మ మొత్తం చూసి అన్నయ్య ఫస్ట్ క్లాసులో పాసయ్యాడని ప్రకటించింది. నాకు తెలుసు అన్నట్లు అన్నయ్య చిరుమందహాసం చేశాడు. బావ నంబర్ కనిపించలేదు. నాకూతెలుసులే అన్నట్లు వాడుకూడా చూశాడుగాని ఇంతలో అందరు వాడివైపు కోపంగా చూడడంతో తప్పదని ఏడుపు మొహం పెట్టాడు. అక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది వాడిని తిట్టారు, కొంతమంది వెనకేసుకుని వచ్చారు. ఒక అరగంట తర్వాత నెమ్మదిగా వానవెలిసింది. అప్పటివరకూ తిట్టినవాళ్ళు, పొగిడినవాళ్ళు అలిసిపోయి ,టీతాగడానికి వెళ్ళారు.

  ఆసాయంత్రం నేనూ పండుబావా కలిసి గుడికి బయలుదేరాము. "ఈసారి  పరిక్షలలో ఖచ్చితంగా పాసవ్వాలని దేముడి దండంపెట్తుకునిరా.." అని అమ్మ ఒకటికి రెండుసార్లు బావకి చెప్పి మరీ పంపించింది. హుండీలో వెయ్యడానికి మాఇద్దరికీ తలో ఒక రూపాయి ఇచ్చింది. అదికూడా నాలాగూ జేబులో చేరిపోయింది  (చెప్పానుకదా నాకు పబ్లిక్ పరీక్షలు లేవని). ఇద్దరం కలిసి సైకిలుమీద బయలుదేరాము.

         "పొనీలేబావా ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతావులే బాధపడకు"   అన్నాను నేను దారిలో వెళుతూ ఓదార్చుదామని.

          "నాగురించి నాకేం బాధలేదురా నాబాధంతా మీఅన్నయ్య గురించే"  అన్నాడు,కొంచెం ఆందోళనగా మొహం పెట్టి.  వాడేమంటున్నాడో నాకేం అర్ధంకాలేదు.

         "అదేంటి బావా వాడిగురించి ఎందుకు బాధపడడం వాడు పాసయ్యాడుకదా" అన్నాను నేను ఆశ్చర్యంగా వాడినిచూస్తూ.

"అందుకేరా నాబాధంతా, నువ్వు ఇంకా చిన్నవాడివి కనుక నీకు తెలియదు. ఎడోతరగతి మొదటిసారి రాసినప్పుడే పాసయిపోయామనుకో, పదోతరగతిలో ఖచ్చితంగా ఫెయిలయి పోతారు. అదే ఎడోతరగతిలో ఫెయిలయిపోయామనుకో పదోతరగతి ఖచ్చితంగా మొదటిసారి పాసయిపోతాం" అన్నాడు గంభీరంగా మొహంపెట్టి.

    మళ్ళీవాడే, "  ... ఇప్పుడు నాకు సెవెంత్ క్లాసు ఫెయిలయ్యినా పెద్ద ప్రాబ్లమెమీ లేదురా, వెంటనే పరీక్షలురాసి పాసయ్యిపోవచ్చు, కానీ టెంత్ క్లాసు ఫెయిలైతే మాత్రం సంవత్సరం వేస్టయిపోతుంది. అదేనాబాధంతా... " అన్నాడు.

      అదేం దిక్కుమాలిన లాజిక్కో నాకేం అర్ధంకాలేదు. కానీ, వాడలా అంటుంటే నాకు కూడా భయం వేసింది.  వచ్చే సంవత్సరం నేనుకూడా సెవెంత్ పరీక్షలు రాయాలి. ఎందుకైనా మంచిదని గుడిలోకి వెళ్ళినతరువాత, అమ్మ ఇచ్చిన రూపాయి దేముడికి వేసేసి, వచ్చే ఏడాది నేనుకూడా సెవెంతు ఫెయిలవ్వాలని దండంపెట్టుకుని, పుణ్యం ఎక్కువ రావాలని రెండుసార్లు ప్రసాదం తిని ఇంటికి తిరిగి వచ్చేశాము.