ఆదివారం, జనవరి 18, 2015

మాఊరిలో మైకాసురుడు. ...       మాఊరిలో మైకా గనులు లాంటివి ఎమీలేవు. కనీసం బొగ్గుగనులు కూడాలేవు. ఉన్నదల్లా ప్రశాంతంగా ప్రవహించే గోదావరి మాత్రమే. కానీ మాఊరికొక అసురుడున్నాడు. మామూలు అసురుడు కాదు, మైకాసురుడు. అసురుడు అంటున్నాం కదాఅని ఆయనేమీ దుర్మార్గుడో,దుష్టుడో కాదు, ఉన్నత విద్యావంతుడు, బహు పెద్దమనిషి. ఆయన అసలుపేరు వేరే ఉంది. దానికంటే కూడా ఆయనను మైకాసురుడు అని పిలుచుకోవడానికే ఊరిలో అందరూ ఇష్టపడతారు.. ఆయని ఈ పేరు రావడానికి వెనుక చిన్న తమాషా రీజను ఉంది. ఇప్పటికి ఒక తరం క్రితం మాఊరిలో ఏకార్యక్రమం జరిగినా, ఆయన హాజరు, హాజరుతో పాటు ఆయన స్పీచ్ తప్పకుండా ఉండేవిట. ఒకసారి మైకు అందుకున్నాడంటే గడియారం ముల్లుతో పోటీపడుతూ గంటలు గంటలు సునాయాసంగా, అనర్గళంగా మాట్లాడేసేవారుట. అలాఅని అవేమీ ఊకదంపుడు కబుర్లుకావు, కార్యక్రమం దేనికిసంబంధించినది అయితే ఆవిషయాన్ని గురించి ఒక వికీపీడియాలాగా, ఎన్-సైక్లోపీడియాలాగా సవివరంగా, విశ్లేషాత్మకంగా మాట్లాడేసేవారుట. కంప్యూటర్లు,ఇంటర్నెట్లు లేని ఆకాలంలో, ఏవిషయాన్ని గురించయినా అంత అనర్గళంగా, ఆశువుగా మాట్లాడగలిగే ఆయన్ను చూసి అప్పటి యూత్ అంతా  ఇన్-స్పైర్ అయిపోయి, బోల్డంత సంతోషపడిపోయి, (అనధికారికంగా) ఆయనకు "మైకాసురుడు" అనే బిరుదు ఇచ్చి సంతోషపడిపోయారు.  అప్పటినుంచీ ఆయన విశాఖపట్నానికి వైజాగ్ లాగా,అసలుపేరుకంటే మైకాసురుడు పేరుతో ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయారు.

       అప్పుడే పాదునుంచీ తెంపిన పులుసు గుమ్మడికాయలాగా బంగారు రంగులోఉండి, ఆరడుగుల ఎత్తు, ఆఎత్తుకు తగిన లావుతో వెలిగిపోతూ ఉండే అయ్యన్ను చూస్తే ఎవరికైనా గౌరవభావమే కలిగేది.  బాగా చిన్నప్పుడు ఆగస్టు పదిహేను కార్యక్రమాలకి మా స్కూలు వాళ్ళు ఆయన్ని పిలిచినప్పుడు , ఆయన అలా అలా గంటలు గంటలు మాట్లాడేస్తూ మాకు స్వీట్లు పంచే కార్యక్రమాన్ని లేటు చేస్తుంటే ఆయనంటే తెగ కోపం వచ్చేసేది. ఆయనచెప్పేది అర్ధంచేసుకోగలిగిన వయసు వచ్చాక, ఆయన మాటలు వింటూ ఉంటే ఆ ధారణ శక్తికి ఆశ్చర్యం కలిగేది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు దూరదర్శన్ లో ఆయన వ్యాఖ్యానం తప్పనిసరి.

    నేను ఆరవతరగతి చదువుతున్నప్పడు ఒకసారి మా ఊరిలో సమాఖ్య కార్యక్రమాలు జరిగాయి. నేను మా నాన్నగారు కలిసి వెళ్ళాము. మైకాసురుడుగారు ముఖ్య అతిధి. వక్తృత్వ పోటీలు,వ్యాసరచనపోటీలు జరిగాయి. నేను కూడా వక్తృత్వ పోటీలో పాల్గొని మాట్లాడాను. కార్యక్రమాలు భోజనాలు  అయి నతరువాత, మానాన్నగారు ఖాళీగా ఉన్న మైకాసురుడు గారి దగ్గరకు వెళ్ళి, పరిచయం చేసుకుని,ఎవో కబుర్లు చెప్తున్నారు.  ఇంతలో నేను ఆడుకుంటూ అటువైపుగా వెళ్ళాను.మానాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి,ఆయనకు నమస్కారం పెట్టించి, వీడు మాఅబ్బాయండీ అని పరిచయం చేసారు.ఆయన నావైపు చూసి చిరునవ్వునవ్వి, "ఆ చూశానండి ఇందాకా వక్తృత్వ పోటీలో మాట్లాడాడు కదా..." అని నా వైపు తిరిగి "బాగా మాట్లాడావోయ్ కీప్-ఇట్ అప్..." అన్నారు అభినందనపూర్వకంగా. ఆయనకి థాంక్స్ చెప్పి, పనిలోపనిగా, "మీరుకూడా బాగా మాట్లాడారండీ కీప్-ఇట్ అప్.." అని అభినందించిపారేశాను నేను కూడా...మానాన్నగారు అదిరిపడి చూశారు. వెంటనే తేరుకుని డిప్పమీద ఒకటి ఇచ్చారు. మైకాసురుడుగారు కూడా ముందు షాకయిపోయినా, తర్వత తేరుకుని పోనీలెండీ చిన్న పిల్లాడు అంటూ హాయిగా నవ్వేశారు.   ఇంటికి వచ్చాక మానాన్న బడితపూజ చేశారు , చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడతావా అంటూ... :):).