గురువారం, జులై 03, 2014

అప్పుడు ఆయనకి ఎలా తెలిసిపోయిందో ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది....."ఒరేయ్ చిన్నా ఇలారా... "  పెరట్లోంచి నాన్న గొంతు వినిపించింది.

ఏమైందో అనుకుంటూ వెళ్ళి ఆయనముందు నిలపడ్డాను

"నా బ్లేడుతో పెన్సిల్ చెక్కావా..." సబ్బు నురగతో నిడిన  గడ్డం మీద అక్కడక్కడ కనిపిస్తున్న చిన్నచిన్న గాయాల్ని అద్దంలో చూసుకుంటూ  అడిగారు.

"లేదునాన్న.. "  తడబడుతూనే అయినా ధైర్యంగా అబద్దం చెప్పేశాను.

"అబద్దం చెప్పకు .. నాకు తెలుసు నువ్వు  చెక్కావని, ఇంకెప్పుడూ అలా చెయ్యకు అర్ధం అయ్యిందా.." మృదువుగానేచెప్పారు.

"సరే నాన్న..." అని చెప్పి లోపలికి వచ్చేశాను.


లోపలికి వచ్చిన తరువాత ఎంత ఆలోచించినా పెన్సిలు చెక్కిన విషయం నాన్నకి ఎలాతెలిసిందో అర్ధం కాలేదు.

బాగా అలోచించి చూస్తే పెన్సిలు చెక్కినప్పుడు వచ్చే రజను బ్లేడుకి అంటుకుని ఉండిపోయిందేమో అనిపించింది.


అందుకని తర్వాతసారి వాడినప్పుడు బ్లేడుని బాగ తుడిచి మళ్ళీ నాన్న గడ్డం బాక్సులో పెట్టేశాను.

కాని విచిత్రంగా ఈ సారికూడా ఆయనకి తెలిసిపోయింది.

ఈసారి మళ్ళి పెరట్లోకి పిలిచి కొంచే గట్టిగానే డోసు ఇచ్చారు.


నేను అంత జాగ్రత్తపడినా ఈసారికూడా  ఆయనకి ఎలా తెలిసిపోయిందో  అన్న విషయం  సపోటా పండులో ఉండే గింజంత ఉండే నాబుర్రకి అప్పుడు అర్ధంకాలేదు.


నా సూక్ష్మబుద్దికి మరింతపదును పెట్టి ఆలోచిస్తే ఇదంతా మా అన్నయ్య నిర్వాకమేమో అనిపించినిది.


ఈసారి ఎవరూ ఇంట్లో లేనప్పుడు ప్రయత్నించా ....

తర్వాతరోజు మాటలతో చెప్పకుండా, చేతులతో చెప్పారు నాన్న.

ఇంక ఆ తరువాత నేనెప్పుడూ పెన్సిలు చెక్కడానికి బ్లేడు వాడలేదు. కాని చాలా సంవత్సరాలు ఆ విషయం నాన్నకి ఎలా తెలిసిపోయిందో అన్న విషయం నాకు ఒక ప్రశ్నలాగ మిగిలిపోయింది.తర్వాత నేనుకూడా ఆవిషయం మర్చిపోయాను.కొన్ని సంవత్సారాల తరువాత...
         

 మాఅన్నయ్య వాళ్ళ బాబుని ఈమధ్యనే స్కూలులో వేశాములెండి.

మొన్న ఆమధ్య వాడి పెన్సిలు చెక్కడానికి ఎవరో నాబ్లేడు వాడినట్లున్నారు. తరువాతరోజు నేను గడ్డం గీసుకుంటుంటే బ్లేడు కసక్కుమని తెగి కొంచెం మంట, అప్పటి నామనసులో ప్రశ్నకి సమాధానం ఒకేసారి వచ్చి పెదాలపై చిన్నగా నవ్వువచ్చింది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి