శుక్రవారం, డిసెంబర్ 20, 2013

తమసోమా జ్యోతిర్గమయ


సరిగ్గా  ఏడాదిక్రితం.. సోమవారం ఉదయాన్నేఆఫీసుకి రెడీఅవుతూ పేపర్ తీసాను.

"ఢిల్లీలో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం... " 72 ఫాంట్ లో మెయిను  హెడ్డింగుతో వార్త ప్రచురించారు.సాధారణంగా నాకు అటువంటి వార్తలు చదవడం ఇష్టం ఉండదు, అందుకే డైరెక్ట్ గా  స్పోర్త్స్ పేజికి వెళ్ళిపోయాను.తర్వాత ఇంక ఆరొజు దానిగురించి కూడా  అలోచించలేదు.రోజు పేపరుతీస్తే కనపడే అనేక నీచసంఘటనలలో ఇదికూడాఒకటి అనుకున్నాను.

 కానీ ఇరవైనాలుగుగంటలు గడవకుండానే చలినికూడా లెఖ్ఖ చెయ్యకుండా ఢిల్లీయువత ఉద్యమించిన తీరు చదివిన తర్వాతగాని జరిగిన ఘోరం తాలూకూ తీవ్రత నాకు అర్ధం కాలేదు.  అర్ధరాత్రి దేశరాజధానిలో కదులుతున్న బస్సులో ఒక ఆడపిల్లని ఒంటరిదాన్నిచేసి మృగాల్లా బిహేవ్ చెసిన కొందరు మనుషుల పైశాచికత్వం చదువుతుంటే రక్తం ఉడికిపోయింది. నిర్భయ, దామిని అంటూ ఎవరికి తోచిన పేర్లు వాళ్ళుపెట్టుకుంతూ దాదాపు 15 రోజులు దేశమంతా అమెగురించే చర్చలు. ఆ 15 రోజులు ప్రతిరోజూ నరకాన్నీనుభవిస్తూ కూడా  "నాకు బతకాలని ఉంది.."  అని ఆ అమ్మాయి అంటున్న మాటలువింటూ  ఎమీచెయ్యలేని   నిస్సహాయతతో దేశంమొత్తం చూస్తుండగా ఆఅమ్మాయి లోకాన్నివిడిచి వెళ్ళిపోయింది...

 కొన్ని రోజుల తర్వాత ఒక రోజు నేను బైక్ చెడిపోయిందని అర్టిసి బస్సులో ఆఫీసుకి బయలుదేరాను.ఉదయాన్నే మార్నింగు షిఫ్టు.. అపటికింకా పూర్తిగా తెల్లారలేదు.కొంచెం చలిగా కూడా ఉంది

"...అయినా ఇందులో ఆ అమ్మాయి తప్పు కూడా ఉందిలేరా అంత అర్ధరాత్రప్పుడు ఆ అమ్మాయి రోడ్లమీదతిరగడం ఎందుకు చెప్పు..."అన్నాడు బస్సులో నా ముందు సీట్లో కూర్చున్న ఒక సీనియర్ సిటిజన్ పక్క సీట్లో ఉన్న ఇంకో పెద్దాయనతో.

         వాళ్ళిద్దరు నిర్భయ గురించే మాట్లాడుకుంటున్నారని నాకు అర్ధం అయ్యింది. బహుశా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా.


"..జరిగిన ఘోరాన్ని చూసినతరువాత కూడానీకు అలా ఎలా అనాలంపిస్తోందిరా.." అన్నాడు రెండో ఆయన కొంచెం మొహం చిట్లించి.

"జరిగినది ఘోరమే నేను కాదనట్లేదు.. కాని అలా జరగడానికి దారితీసిన పరిస్ఠితులు కూడా అలోచించు.." అన్నాదు మొదటాయన.

 ఈయన కొంచెం అలోచనలో పడ్డాడు... ఇదే ఊహ నాకు కూడా ఒకసారి వచ్చింది. ఆమె ఆ టైంలో అలా బైటకి వెళ్ళకుండాఉంటే బాగుండేదేమో అని నేను కూడా అనుకున్నాను.

రెండోఅయన ఒక నిముషం ఆగి ఎదోసమాధానం చెప్పడానికి రడీ అవుతున్నాడు.. ఇంతలో....

"అయ్యా మీరంతా బాగా చదువుకున్నోళ్ళు కదా.. పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండి ఉంటారు.... ఆ పిల్లని అంత కిరాతకంగా చంపేసిన నాయాళ్ళని వదిలేసి, ఆ పిల్ల వైపు తప్పులు ఎతుకుతారేటి సామి..."  పక్క సీట్లో కూర్చున్న ఒక ముసలాయన వీళ్ళవైపే సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.

             అతని వాలకం చూస్తూఉంటే ఉత్త పల్లెటూరిమనిషి అని అర్ధం  అయిపోతోంది.మాటతీరుమాత్రం చాలా దృడంగా ఉంది.

      అప్పటికి ఇంకా తెల్లవారలేదుగాని కొంచెం వెలుగు రేఖలు కనపడడం ప్రారంభించాయి

"..నేను వాళ్ళని సపోర్ట్ చెయ్యట్లేదయ్యా... ఆ అమ్మాయి ఆ టైంలో అలా బైటకి వెళ్ళడంవల్లేకదా ఇంతఘోరం జరిగింది.. సెకండుషో సినిమాకి వెళ్ళిందిట బోయ్ ఫ్రెండుతో కలిసి..." వివరణ ఇస్తూనే కొంచెం వెటకారం మిక్స్ చేస్తూ అన్నాడు.

అతనేంచెప్తాడో విందామని నేను అతనివైపు చూసాను.

"...సినిమాకి వెళ్ళిందని మీరు తప్పు పడుతున్నారు, సరే సినిమాకి కాకుండా , వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోక మందులు తీస్కునిరాటానికి బైటకి ఎల్లింది అనుకొండి, అప్పుడు కూడా నాయాళ్ళకి చిక్కితే ఇలాగే చేసేవోళ్ళుగదండి...."
                   
 ఒక్కసారి ఇతని మాటలు ఆగిపోయాయి...ఒకనిముషమాగి  "..అవుననుకో, కానీ ఈరొజుల్లో ఈ ఆడపిల్లల డ్రస్సులు ఎలాఉంటున్నాయో చెప్పు , చాల వరకు దారుణాలు జరగడానికి ఇదికూడా ఒక కారణమే.. " సమర్దించుకోవడానికి దారులు వెతుకుతూ అన్నాడు.


".. అయిదేళ్ళ పసి పిల్లల్ని కూడా వదలటంలేదు కదా బాబు ఈ నాయాళ్ళు మరి వాళ్ళు ఏబట్టలు ఏసుకున్నారని బాబు ..."  ఒక్కసారిగా తలంటేసాడు.

"....." ఇవతలవైపు సమాధానం లేదు...

"..మనం మంచి చెయ్యక పోయినా పర్వాలేదు బాబు, పనిగట్టుకుని రాళ్ళు వెయ్యకూడదు. నాకు తెలుసు నేను మీకు చెప్పేఅంతవాడిని కాదు, కాని మీలాటి పెద్దపెద్ద వాళ్లు కూడా ఇలా దెబ్బతిన్న వాళ్ళ వైపు తప్పులు ఎతుకుతూ, జరిగిన ఘొరాల్లో వాళ్ళకి వాటా ఇస్తూ ఉంటే తప్పు చేసిన నాయాళ్ళకి ఇంక భయమేటుంటది బాబు...." అతని గొంతు కొంచెం జీర వచ్చింది. చదువుకోనివాడైనా అతని ఆలోచనావిధానం ఎంతోనిర్మలంగా ఉంది. ఒకేసారి నామనసులో ప్రశ్నలకికూడా సమాధానం చెప్పేశాడనిపించింది.

ఇంతలో అతని స్టాప్ వచ్చినట్లుంది.. "పొరపాటుగా ఎమైనా మాట్లాడి ఉంటే తప్పెట్టుకోకండి బాబు.. నాకు తోచింది చెప్పాను అంతే...చదువుసంధ్య  లేనోడిని...." అంటూ దిగిపోయాదు.


                                              "................."

"...అతనన్నది నిజమేలే నేనే తప్పుగా మాత్లాడానేమో.." అన్నాడు ఈయన బాధగా మొహం పెట్టి ఒక పది నిముషాల తరువాత.

   పోనిలే వదిలై.. అన్నాదు రెండో ఆయన అనునయంగా. ఒక పావుగంట తర్వాత వీళ్ళ స్టాప్ వచ్చింది దిగిపోయారు.

అప్పటికి పూర్తిగా తెల్లవారింది.. గోరువెచ్చని కిరణాలు వెలుగులో నేను నెక్స్ట్ స్టాప్ లో బస్సుదిగి ఆఫీసువైపు నడిచాను



                                                       తమసోమా జ్యోతిర్గమయ
                                                       (చీకటి నుంచి వెలుగు వైపుగా)

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి