సోమవారం, జూన్ 09, 2014

మైక్రో-సాఫ్ట్ మరొక ఆవిష్కరణ "స్కైప్ ట్రాన్సలేటర్"




మూడు సంవత్సరాలక్రితం దాదాపు $8.5 బిలియన్లతో వీడియో కాలింగ్ సేవలని అందించే సంస్థ అయిన స్కైప్ ని కొనుగోలు చేసిన మైక్రో-సాఫ్ట్ సంస్థ, తనవద్దనున్న మైక్రో-సాఫ్ట్ ట్రాన్సలేటర్ పరిజ్ఞానాన్ని స్కైప్ కి జోడించి "స్కైప్ ట్రాన్సలేటర్" ని ఆవిష్కరించింది. మే 27న కాలిఫోర్నియాలో జరిగిన కోడ్ కాన్-ఫ్రెన్స్ లో మైక్రో-సాఫ్ట్ సియిఓ సత్య నాదెళ్ళ, స్కైప్ కార్పోరేట్ వైస్-ప్రెసిడెంట్ గురుదీప్ పాల్ ఈ "స్కైప్ ట్రాన్సలేటర్" ని పరిచయం చేశారు.ఈ సందర్భంగా గురుదీప్ పాల్ కాలిఫోర్నియా లో ఇంగ్లీషులో మాట్లాడిన మాటలు విజయవంతంగా జర్మన్ భాషలోకి తర్జుమా అయ్యి లండనులో ఉన్న డయానా హెన్రిచ్ కి వినిపించాయి.


  అయితే ఈ కొత్త టెక్నాలాజీ ఏఏ భాషలకిఉపయోగించవచ్చో, ఇంకా దీనిని ఎప్పటికి వినియోగదారులకి అందుబాటులోకి తెస్తారో అన్నవిషయానికి మైక్రో-సాఫ్ట్ ప్రతినిధులు సరైన వివరణ ఇవ్వలేదు. ఈ సందర్భంగా మైక్రో-సాఫ్ట్ సియిఓ సత్య నాదెళ్ళ మాట్లాడుతూ "స్కైప్ ట్రాన్సలేటర్" పరిజ్ఞానాన్ని 'మైక్రో-సాఫ్ట్ రీసెర్చ్'మరియు 'మైక్రో-సాఫ్ట్ ట్రాన్సలేటర్' టీములు దశాబ్దానికి పైగా పడిన శ్రమకి ఫలితంగా అభివర్ణించారు.

  మాటలలో ఉండే భావాలని వదిలిపెట్టి, ఒక భాషనుంచి మరొక భాషకి పదాల మార్పిడి మాత్రమే చేసే ఈ పరిజ్ఞానంవల్ల అద్భుతాలని ఆశించడం అత్యాసేఅవుతుందనే కొంతమంది పెదవి విరుపులని పక్కనపెట్టి చూస్తే  ఈనాడు  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల వినియోగదారులు ప్రతినెలా స్కైప్ ని ఉపయోగిస్తున్నారు. సామాన్య వినియోగదారులేకాక కార్పోరేట్ వర్గాలు కూడా స్కైప్ ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటాయి. వారు తమ వ్యాపార విస్తరణలో భాగంగా  కొత్త క్లయింట్లని సంపాదించుకునే క్రమంలో భాషే వారికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. ఈ సమస్యని ఎదుర్కోవడానికి మైక్రో-సాఫ్ట్ ఆవిష్కరించిన ఈ పరిజ్ఞానం పట్ల వ్యాపారవర్గాల్లో అమితమైన 
ఆసక్తి కనిపిస్తోంది.














ఆధారం : http://www.geek.com/microsoft/microsoft-emulates-star-trek-turns-skype-into-a-universal-translator-1595044/